వికారాబాద్: తాండూరు హస్తం టికెట్‌పై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తాండూరు టికెట్ కోసం 8 మంది దరఖాస్తు చేయగా, అధిష్టానం ముగ్గురి పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే టికెట్ ఆశిస్తున్న వారు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఆశావహుల్లో రమేష్ మహరాజ్, రఘువీర్‌రెడ్డి, కేఎల్‌ఆర్, సునితా సంపత్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిలో కేఎల్‌ఆర్ ఎంపీ టికెట్ పైనే ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ కారణంగానే అసెంబ్లీ టికెట్ కోసం పెద్దగా ప్రయత్నం చేయడం లేదనేది సమాచారం.
రమేష్ మహరాజ్, రఘువీర్‌రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి తాండూరు సీటు కేటాయిస్తే రమేష్ మహరాజ్ టికెట్ దక్కే అవకాశం లేకపోలేదు. జనరల్ అయితే రఘువీర్‌రెడ్డిని టికెట్ వరించనుంది. అలాగే మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సునితా సంపత్‌కు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోదంది. కర్ణాటక వైద్య విద్య శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ ద్వారా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇటీవల ఆయన్ను తాండూరుకు పిలిపించి టికెట్‌పై చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తాండూరు అసెంబ్లీ అంటేనే మహరాజుల పేరు టక్కున గుర్తుకు వస్తుంది. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 13సార్లు ఎన్నికలు జరగ్గా 7 సార్లు మహరాజుల కుటుంబ సభ్యులే కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధిస్తూ వచ్చారు. 1994 ఎన్నికల్లో ఆ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణరావు, రెబల్ అభ్యర్థిగా ఆయన సోదరుడు మాణిక్‌రావు బరిలో దిగడంతో టీడీపీ తరఫున పట్నం మహేందర్‌రెడ్డి విజయం సాధించారు.
ప్రస్తుతం మహరాజుల కుటుంబం టికెట్ కోసం తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మాజీ మంత్రి మాణిక్‌రావు తనయుడు ఏఐసీసీ సభ్యుడు రమేష్ మహరాజ్‌కు టికెట్ దక్కుతుందో లేదో మరి కొన్ని రోజుల్లో తేలనుంది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న 12 మందిని ప్రస్తుత ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ జాబితాలో తాండూరు కూడా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పైలెట్ రోహిత్‌రెడ్డి ఆరు నెలల్లోనే బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎలాగైనా ఆయన్ను ఓడించి తీరుతామని అంటున్నారు. మరోవైపు బీసీలకే టికెట్ కేటాయించాలని ఆ సామాజిక వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తాండూరు అసెంబ్లీ బరిలో దిగుతారంటూ ప్రచారం సాగింది. బుధవారం పార్టీ పెద్దలతో భేటీ అయినట్లు సమాచారం. మేడ్చల్ లేదా రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయాలని కేఎల్‌ఆర్‌కు పార్టీ సూచించినట్లు సమాచారం. దీంతో రమేష్ మహరాజ్, రఘువీర్‌రెడ్డిల మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment