Vikarabad municipalities
-
వీఆర్వో పాడుబుద్ది.. భార్యకు సంతానం కలగడం లేదని యువతికి గాలంవేసి
సాక్షి, తాండూరు(వికారాబాద్): తన భార్యకు పిల్లలు పుట్టడంలేదని, రెండో పెళ్లి చేసుకుంటానని యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని మోసం చేసిన వీఆర్వోపై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. బషీరాబాద్ మండలం దామర్చేడ్ గ్రామానికి చెందిన బోయ కార్తీక్ పెద్దేముల్ మండలంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఇంతకుముందే వివాహం కాగా, సంతానం లేదు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల తన భార్యకు సంతానం కలగడంతో, సదరు యువతితో మాట్లాడటం మానేశాడు. పెళ్లి చేసుకునేది లేదని ఆమెకు తేల్చి చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు కార్తీక్, అతనికి సహకరించిన కుటుంబ సభ్యులపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు సీఐ కార్తీక్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చదవండి: బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని.. -
అనుమానం; ఎలాగైన భార్యను చంపేయాలని పక్కా ప్లాన్‌తో!
సాక్షి, వికారాబాద్ : ఓ వ్యక్తి అనుమానంతో భార్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి బంట్వారం మండల పరిధిలోని మద్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కె.ఆంజనేయులు, లక్ష్మి(40) దంపతులు. వీరు తమ ముగ్గురు పిల్లలతో కలిసి తాండూరులో ఉంటున్నారు. ఆంజనేయులు స్థానికంగా మున్సిపాలిటీలో కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లక్ష్మి తరచూ పుట్టింటికి వెళ్తుండేది. ఈనేపథ్యంలో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా భార్యను చంపేయాలని ఆంజనేయులు నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో లక్ష్మి కుటుంబ కలహాలతో వారంరోజుల క్రితం స్వగ్రామం మద్వాపూర్‌కు వెళ్లింది. ఆంజనేయులు పిల్లలను తాండూరులోనే వదిలేసి శనివారం సొంతూరుకు వెళ్లిపోయాడు. ఇంట్లో అర్ధరాత్రి సమయంలో లక్ష్మి నిద్రిస్తుండగా కమ్మ కత్తితో దారుణంగా పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత లక్ష్మి చనిపోయింది. నిందితుడు ఆంజనేయులు ఆదివారం తెల్లవారుజామున బంట్వారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ధారూరు సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం మద్వాపూర్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తల్లి హత్యకు గురవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో లక్ష్మి పిల్లలు రేణుక, రాజు, నాగరాజు అనాథలయ్యారు. ఈమేరకు నిందితుడు ఆంజనేయులుపై హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ తిరుపతిరాజు తెలిపారు. -
రూ. కోటి ‘చెత్త’పాలు
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చెత్త సేకరణకు ఒక్కో పంచాయతీకి రెండు రిక్షాలను అందజేసింది. ఇవి కొన్ని పంచాయతీల్లో మినహాయిస్తే జిల్లాలోని దాదాపు 70శాతం గ్రామాల్లో మూలకు చేరాయి. ఈనేపథ్యంలో రిక్షాల కొనుగోలు కోసం కేటాయించిన రూ. కోట్ల నిధులు ‘చెత్త’ పాలయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్ పథకం లక్ష్యం మరింత దూరమవుతోంది. రిక్షాల నిర్వహణ భారం కావడంతోనే అవి నిరుపయోగంగా మారాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాక్షి, వికారాబాద్: జిల్లా పరిధిలో మొత్తం 367 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో స్వచ్ఛభారత్ మిషన్ కింద చెత్త రిక్షాలను నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుల్లో వేయాలని సూచించింది. అయితే, రిక్షాల నిర్వహణ భారం కావడంతో వీటిని దాదాపు 30 శాతం గ్రామపంచాయతీలు మాత్రమే వినియోగిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికగా పంచాయతీకి రెండు చొప్పున కేంద్ర ప్రభుత్వం మొత్తం 734 చెత్త రిక్షాలను నాలుగేళ్ల క్రితం పంపిణీ చేసింది. ప్రస్తుతం చాలా పంచాయతీల్లో ఇవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. పంచాయతీలు రిక్షాల నిర్వహణకు ఒకో కార్మికుడికి నెలకు రూ. 2 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూ చించింది. అయితే, పంచాయతీల్లో నిధు ల లేమితో రిక్షాల నిర్వహణ భారంగా మారింది. దీంతో వాటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పంచాయతీల్లో నిధుల కొరత కనిపిస్తున్నది. అభివృద్ధి పనుల కోసం 14వ ఆర్థిక సం ఘం నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. 2017 జూలై నెలలో రూ.14కోట్ల 50 లక్షలను ప్రభు త్వం పంచాయతీలకు విడుదల చేసింది. గ్రామాల్లో మురుగుకాలువలు, మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించారు. ఈనేపథ్యంలో డబ్బు ల కొరత ఏర్పడింది. చెత్త తరలించే రిక్షాలను నడిపే కూలీలకు జీతాలివ్వడం, రిక్షాలు మరమ్మతులు తదితరాలు పంచాయతీలు భారంగా పరిణమిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ప్రత్యేకంగా కొన్ని నెలలుగా నిధులు అందకపోవడం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కేంద్ర సర్కార్ పంపిణీ చేసిన చెత్త రిక్షాలను వినియోగించడం లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఒక్కో రిక్షాకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు వెచ్చించింది. ఈలెక్కన రూ. కోటి నిధు లు ‘చెత్త’పాలయ్యాయనే విమర్శలు వినపడుతున్నాయి. కేంద్ర సర్కార్ ఉద్దే శం బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండడంతో ఇబ్బందులు తలె త్తుతున్నాయని చెప్పవచ్చు. పంచా యతీ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. నైపుణ్యమున్న కార్మికులు ఏరీ..? స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమం కింద పంపిణీ చేసిన రిక్షాలను నడపాలంటే నైపుణ్యమున్న (స్కిల్డ్) కార్మికులు అవసరం. వీరు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులకు తరలించాలి. డంపింగ్‌యార్డులు లేనిచోట గ్రామానికి దూరంగా వ్యర్థాలను పారబోయాల్సి ఉంటుంది. దీంతో పాటు రోడ్లను శుభ్రంచేయాలి. గ్రామంలోని వీధుల్లోని చెత్తను సైతం సేకరించాలి. ప్రస్తుతం పంచాయతీల్లో ఉన్న కార్మికులు రిక్షాలను నడపడం లేదు. కొత్తవారిని పెట్టుకుంటే వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామ పంచాయతీలు 14వ ఆర్థికసంఘం నిధులపై ఆధారపడ్డాయి. పంచాయతీలలో నిధుల లేమికి తోడు తక్కువ వేతనానికి చెత్త రిక్షాలను తోలడానికి కార్మికులు ముందుకు రాకపోవడం కూడా రిక్షాల నిరుపయోగానికి కారణంగా చెప్పుకోవచ్చు. రిక్షాలను వినియోగంలోకి తెస్తాం.. స్వచ్ఛభారత్ మిషన్ కింద చెత్త తరలించేందుకు కేంద్ర సర్కార్ రిక్షాలను అందజేసింది. చాలావరకు రిక్షాలను వినియోగిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఎక్కడైనా వీటిని ఉపయోగించకుంటే చర్యలు తీసుకుంటాం. చెత్త తరలించే రిక్షాలను వినియోగంలోకి తీసుకొస్తాం. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతాం. –మాజిద్, జిల్లా పంచాయతీ అధికారి -
జిల్లాలో పోలింగ్ శాతం 76.35
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలు, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట, బడంగ్‌పేట నగర పంచాయతీల పరిధిలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం ఓటింగ్ నమోదైంది. ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 1,98,513 మంది ఓటర్లలో 1,45,954 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోరుగా.. హుషారుగా.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. దాదాపు మూడేళ్ల తర్వాత మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఓటు వేయగానికి ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఎండలు మండుతున్నప్పటికీ లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ మొదలైన తొలి రెండు గంటల్లోనే 18.25శాతం నమోదైంది. తర్వాత 11గంటల ప్రాంతంలో పోలింగ్ శాతం 38.70కు చేరింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరిగినప్పటికీ పోలింగ్ ప్రక్రియ స్థిరంగా సాగుతూ 56.36శాతానికి చేరింది. ఆ తర్వాత మూడు గంటల ప్రాంతంలో కొంత మందకొడిగా సాగి 66.75 శాతానికి చేరింది. సాయంత్రం మళ్లీ ఊపందుకోవడంతో జిల్లా వ్యాప్తంగా 76.35 శాతం పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో అధికంగా 86.37శాతం పోలింగ్ నమోదు కాగా, బడంగ్‌పేటలో తక్కువగా 67.47 శాతం నమోదైంది. పోలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఓట్ల లెక్కింపు వరకు అవి అక్కడే భద్రపరచనున్నారు. తాండూరు మున్సిపాలిటీ కార్యాలయం, వికారాబాద్‌కు సంబంధించి స్థానిక మహవీర్ కాలేజీ, పెద్దఅంబర్‌పేటకు సంబంధించి కుంట్లూరు జెడ్పీహెచ్ఎస్, బడంగ్‌పేటకు సంబంధించి స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ఉత్కంఠ..! పురపాలిక సంఘాల పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ.. ఓట్ల లెక్కింపుపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల ప్రకటన ప్రకారం ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ఫలితాల ప్రభావం తదుపరి నిర్వహించే ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలపై పడుతుందనే ఉద్దేశంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు సైతం వాయిదా పడినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అంశం న్యాయస్థానం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ అంశం రేపు (మంగళవారం) విచారణకు రానుండడంతో ఫలితాల అంశం అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది.