
సాక్షి, తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు సందర్భంగా శుక్రవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, వేర్వేరు వార్డుల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా కౌన్సిలర్ స్థానానికి నామినేషన్‌లు వేశారు. తాండూరు పట్టణం ఇందిరా నగర్‌కు చెందిన అవిటి శ్రీశైలం స్థానిక ఇందిరాచౌక్‌లో చాయ్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అవిటి శ్రీశైలం 26వ వార్డు నుంచి, భార్య రాజకుమారి 28 వార్డు నుంచి, తల్లి వీరమణి 27 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌లు వేశారు. గతంలో శ్రీశైలం 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా కూడా నామినేషన్ వేసి బరిలో నిలిచారు. ఎమ్మెల్సీగా కూడా నామినేషన్ వేసినప్పటికీ తిరస్కరణ గురి కావడం జరిగింది.
తాజాగా తనొక్కడే కాకుండా ఇంట్లోని మరో ఇద్దరితో నామినేషన్ వేయించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో సకలజనుల సమ్మె సందర్భంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన శ్రీశైలంకు రాజకీయాలన్నా, ప్రజాసేవ అన్నా ఎంతో ఇష్టంగా భావిస్తారు. తాను ప్రజలకు సేవ చేసేందుకే కౌన్సిలర్‌గా బరిలో దిగానని, అలాగే తన భార్య, తల్లితో కూడా నామినేషన్ వేయించానన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో తన భార్య లేదా తల్లిని చైర్‌పర్సన్‌గా చూడాలనేది తన కోరిక అని శ్రీశైలం చెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment