సాక్షి, తాండూరు: తాండూరు మున్సిపాలిటీలో పురపాలన గాడి తప్పింది. మున్సిపల్ కార్యాలయ పాలకమండలి ముగియడంతో పురపాలన అధికారాలన్నీ అధికారుల చేతికి వచ్చాయి. దీంతో కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఆడిందే ఆట..పాడిందే పాట అనే చందంగా మారింది. రెండు నెలలుగా కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. మున్సిపల్ కమిషనర్, మేనేజర్ పోస్టులు ఖాలీగా ఉండటంతో భాద్యతలన్నీ స్థానిక ఆర్డీఓకు అప్పగించారు. అయితే రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యే ఆర్డీఓ మున్సిపల్ పాలనపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా హాజరుశాతం తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుననాయి.
కొన్నాళ్లపాటు సాఫీగానే..
తాండూర మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం రెండేళ్ల క్రితం బయోమెట్రిక్ హాజరు నమోదును అమలులోకి తీసుకువచ్చారు. అయితే ఈ విధానం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగినప్పటికీ తరువాత బయోమెట్రిక్ మిషన్ మరమ్మతులకు గురైంది. దీంతో అప్పటి నుంచి ఎవరూ కూడా బయోమెట్రిక్ యంత్రంలో హాజరు నమోదుకాని పరిస్థితి. మాన్యువల్ పద్ధతిలో రిజిస్టర్లలో ఉద్యోగులు, కార్మికుల హాజరుశాతం నమోదు చేస్తున్నారు.
విధులకు రానప్పటికీ కొంత మందికి హాజరువేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనిచేసిన వారికి మాత్రం వేతనాలు సరిగా ఇవ్వడం లేదని గతంలో కొందరు సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం బయోమెట్రిక్ యంత్రానికి మరమ్మతులు చేయించేందుకు శ్రద్ధ తీసుకోవడంలేదు. కార్యాలయానికి రాకపోయినా రిజస్టర్‌లో సంతకాలు పెట్టి వేతనాలు పొందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులూ ఉపయోగించని
బయోమెట్రిక్..
మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ అధికారులు, ఉద్యోగులకు కూడా హాజరు నమోదుకు ప్రత్యేకంగా బయోమెట్రిక్ మిషన్ ఏర్పాటు చేశారు. అయితే యంత్రం పనిచేస్తున్నప్పటికీ మాన్యువల్ పద్ధతి ప్రకారమే ఎస్‌టీఓకు వేతనాల కోసం హాజరు రికార్డులను పంపిస్తున్నారని స్థానిక ప్రజా ప్రతినిధులు అంటున్నారు. దీంతో పురపాలన వ్యవస్థ గాడితప్పుతోందని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే బయోమెట్రిక్ యంత్రాలలో హాజరును సేకరించి అక్రమాలకు చెక్ పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment