కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తాండూరు నాపరాతి పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. అన్‌లాక్ ప్రక్రియతో కాస్త ఊరట లభిస్తున్న తరుణంలో భారీ వర్షాలతో పరిస్థితి మొదటికొచ్చింది. క్వారీల్లో చేరిన నీటితో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. క్వారీ నుంచి ముడి సరుకు బయటకు రాకపోవడంతో దానికి అనుబంధంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు సైతం దిక్కులు చూస్తున్నాయి. ఇప్పట్లో పనులు ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడంతో క్వారీల యజమానులు డోలాయమానంలో పడ్డారు.ఇక పరిశ్రమపై ఆధారపడ్డ 25వేల మంది కార్మికులకు పూటగడవడమే కష్టమైంది.
‘ఉపాధి’ని ముంచేసిన వానలు
వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలో దాదాపు 300 నాపరాతి క్వారీలున్నాయి. వీటికి అనుబంధంగా 1,250 పాలిషింగ్ యూనిట్లు, ఇతర మార్కెటింగ్ స్టోర్లు కొనసాగుతున్నాయి. వీటిల్లో పనిచేసే వారిలో ఎక్కువ మంది బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారే. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కూలీలు సైతం వలస వచ్చి పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నాపరాతి పరిశ్రమ మూతపడటంతో 95 శాతం కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. అన్‌లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు చివరి నుంచి క్రమంగా యూనిట్లను తెరిచేందుకు యాజమాన్యాలు ఉపక్రమించగా.. సెప్టెంబర్ నెలాఖరు నుంచి కార్మికులు, కూలీలు తిరిగి వచ్చారు. పనులు మొదలవుతున్న తరుణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కాగ్నా నది ఉప్పొంగడంతో క్వారీలన్నీ నీటితో నిండిపోయాయి.
ఇప్పటికీ క్వారీల్లోకి నీళ్లు వస్తున్నాయి. తొలుత కురిసిన వానలు కాస్త తెరపివ్వడంతో భారీ ఖర్చుతో క్వారీ యజమానులు పెద్ద మోటార్లను బిగించి నీటిని బయటకు తోడారు. అంతలోనే మళ్లీ వానల తీవ్రత పెరగడంతో క్వారీలు నిండా మునిగాయి. భూమిలోతులోకి క్వారీలు ఉండడంతో ఇప్పటికీ పలుచోట్ల ఊటగా నీరు వస్తోంది. ఈ నీటిని తోడాలంటే లక్షల్లో వెచ్చించాల్సి రావడంతో క్వారీల యజమానులు ఆ పనులను విరమించారు. దీంతో ఇప్పటికే నెలల తరబడి మూతబడ్డ క్వారీలు.. ఇప్పట్లో గాడినపడేలా లేవు. మరోవైపు క్వారీల నుంచి రాయి ఉత్పత్తి లేకపోవడంతో పాలిషింగ్ యూనిట్లకూ పనిలేకుండా పోయింది. తక్కువ విస్తీర్ణంలో ఉన్న మినీ క్వారీలను ఇప్పుడిప్పుడే తెరుస్తున్నా.. ఆశించిన స్థాయిలో పనిలేదు. ముడిసరుకు సిద్ధంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లలో ఒకరిద్దరికే పని దొరుకుతోంది.
దిక్కుతోచని స్థితిలో కార్మికులు
క్వారీలు, పాలిషింగ్ యూనిట్లలో ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికులకు ఇప్పుడు దిక్కుతోచట్లేదు. లాక్‌డౌన్ సమయంలో సొంతూళ్లకు వెళ్తే అక్కడ తగిన ఉపాధి దొరకలేదు. అన్‌లాక్ సమయంలో గంపెడాశతో తిరిగొస్తే.. క్వారీలను వానలు నిండా ముంచేశాయి. రోజువారీ కూలీపై ఆధారపడ్డ వారందరికీ ప్రస్తుతం బతుకు గగనమైంది. చేతిలో డబ్బుల్లేక, అప్పు దొరక్క పస్తులుంటున్నారు. దీనిపై కార్మిక సంఘాల నేతలు యాజమాన్యాలతో చర్చించినా ఫలితం లేదు. అడ్వాన్స్ రూపంలో కొంత మేర డబ్బులు తీసుకున్నప్పటికీ నెలల తరబడి పనిలేకపోవడంతో ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చు కావడంతో మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది.
తాండూరు, షాబాద్ బండలంటే దక్షిణ భారతమంతా పేరు
దక్షిణ భారతదేశంలో తాండూరు నాపరాతికి మంచి పేరుంది. క్వారీల నుంచి రాయిని బయటకు తీయడం.. దానిని పాలిషింగ్ చేసి మార్కెట్లో విక్రయించడం ఇక్కడ ప్రధానంగా జరిగే పని. నాపరాతిని నిర్ణీత రూపంలో కటింగ్ చేసిన తర్వాత నేరుగా వాడుకోవచ్చు. పాలిష్ చేసిన రాక్‌షీట్లకైతే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో తాండూర్ బండలు, షాబాద్ బండల పేరుతో వీటిని విక్రయిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు ఇక్కడి నుంచి భారీగా ఎగుమతులు చేస్తారు. నాపరాతి పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి రాయల్టీ, ఇతర పన్నుల రూపంలో ఏటా రూ.150 కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇక్కడ ఏటా దాదాపు రూ.2,500 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయి. లాక్‌డౌన్‌తో పాటు, ఇటీవలి వర్షాల కారణంగా నాపరాతి పరిశ్రమ దాదాపు రూ.600 కోట్ల వరకు నష్టపోయి ఉంటుందని అంచనా. ఈ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లలో వివిధ కేటగిరీల్లో పనిచేసే కార్మికులు, కూలీలు 25 వేలకు పైమాటే.
నెల వరకు కష్టమే..
క్వారీల్లో భారీగా చేరిన నీటిని తోడాలంటే రూ.లక్షలు ఖర్చు చేయాలి. పెద్ద మోటార్లతో రోజుల తరబడి పంపింగ్ చేయాలి. మోటార్లకు కిరాయి భారీ మొత్తంలోనే ఉంటుంది. ప్రస్తుతం తాండూరు పరిధిలోని 70 శాతం క్వారీలు నీటితో నిండిపోయాయి. వీటన్నింటి నుంచి నీళ్లు తొలగించి మళ్లీ గాడిన పడటానికి కనీసం నెల పట్టొచ్చు. మమ్మల్ని నమ్ముకున్న కూలీలు, కార్మికులకు కొంత నగదు అడ్వాన్స్ ఇచ్చి పోషిస్తున్నాం.
– వెంకటరామిరెడ్డి, క్వారీ యజమాని, తాండూరు
2 నెలలుగా పనిలేదు
క్వారీలో పనిచేస్తే రోజుకు రూ.500 కూలి వచ్చేది. ప్రస్తుతం రెండు నెలలుగా పని లేదు. నా దగ్గరున్న డబ్బులు పూర్తిగా ఖర్చయిపోవడంతో భార్య, పిల్లల పోషణ కష్టంగా మారింది. గతనెల అప్పుచేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చా. ఇప్పుడిక వేరే పని దొరికినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. – వడ్డే నగేశ్, కార్మికుడు
Comments
Please login to add a commentAdd a comment