సాక్షి, వికారాబాద్ అర్బన్: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు (67) గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. హైదరాబాద్ చింతల్‌బస్తీలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఛాతీనొప్పి రావడంతో ఆయన్ను కుటుంబీకులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో మృతిచెందారు. ఆయనకు భార్య మధురవేణి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్పత్రిలో సంజీవరావు మృతదేహానికి నివాళులర్పించారు.
ఉన్నత ఉద్యోగం వదిలి..
వికారాబాద్ జిల్లా గేట్‌వనంపల్లి గ్రామానికి చెందిన బేగరి కమలమ్మ, దేవదాస్‌కు సంజీవరావు మొదటి సంతానం. సంజీవరావు బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. గ్రూప్–2 ఉద్యో గం సాధించి ఏఓగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాలపై ఆసక్తితో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1994లో వికారాబాద్ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వికారాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా, ధారూర్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
టీడీపీ, వైఎస్సార్‌సీపీలో పనిచేశారు. 2014లో ఎన్నికల సమయం లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరి వికారాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల నాటికే సంజీవరావు అనారోగ్యానికి గురవడంతో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనలేదు. కాగా, వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం గేట్‌వనంపల్లిలో బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సంజీవరావు ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్‌రెడ్డి సంతాపం ప్రకటిస్తూ, సంజీవరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment