ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఎప్పుడు వెలువడుతాయనే దానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. 20 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అంశం మంగళవారం కోర్టు పరిశీలనకు రానున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. పట్నం నగర పంచాయతీలోని ఆయా వార్డుల్లో రికార్డు సంఖ్యలో మొత్తం 125 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో గెలుపోటములపై సందిగ్ధత ఏర్పడింది. పలు వార్డుల్లో బహుముఖ పోటీ ఉండడంతో ఓటర్లు ఎవరిని విజేతగా నిలపబోతున్నారనేనది అయోమయంగా మారింది. కాంగ్రెస్ పార్టీని రెబల్స్ భయం వెంటాడుతోంది.
పలు వార్డుల్లో టికెట్ రాని వారు రెబల్స్‌గా పోటీ చేయడంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు మెజార్టీ వార్డులను దక్కించుకుంటామని ధీమాతో ఉన్నాయి. కాంగ్రెస్‌లోని గ్రూపు తగాదాలతో పాటు రెబల్స్ కారణంగా తమ విజయావకాశాలు మెరుగుపడ్డాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మెజార్టీ వార్డులను కైవసం చేసుకోవడం ద్వారా చైర్మన్ పదవిని దక్కించుకుంటామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు పోలింగ్ లో పెరిగిన ఓటింగ్ శాతం (86.37) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓటింగ్ సరళి తమకే అనుకూలంగా ఉందని ఒకరంటే కాదు తమకే అనుకూలమని మరొకరు అంటున్నారు. ఆయా వార్డుల్లో ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి అనే విషయాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఏ నలుగురు గుమిగూడినా ఎన్నికల ఫలితాల గురించే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈవీఎంలలో భద్రంగా ఉన్న ఓటర్ల తీర్పు ఎప్పుడు వెలువడుతుందనేదే ఆసక్తికరంగా మారింది.
ఎవరి ధీమా వారిదే
వికారాబాద్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ తమకే మెజార్టీ స్థానాలు వస్తాయని భావిస్తున్నాయి. తెలంగాణ సాధన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషించింది కాబట్టి ఓటర్లు తమ అభ్యర్థులనే ఆదరిస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని చైర్మన్ పీఠం దక్కించుకుంటామని అంటున్నారు. పట్టణంలో టీఆర్‌ఎస్‌కు క్యాడర్ అంతగా లేనందున పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోయిందని భావిస్తున్నారు.
ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైర్మన్ పదవిని నిర్ణయించడంలో మాత్రం క్రియశీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయంటున్నారు.ఇక పట్టణంలో తమకు బలమైన క్యాడర్ ఉందని అత్యధిక కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకుని చైర్మన్ పీఠం దక్కించుకుంటామని టీడీపీ నేతలు జోస్యం చెబుతున్నారు. చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీకైనా 15 సీట్లు రావాల్సిందే. ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఏం చేయాలనేదానిపై ఆయా పార్టీల నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఒకటి, రెండు సీట్లు తక్కువైతే ఎవరిని ఆశ్రయించాలనే దానిపై కూడా ఇప్పటి నుంచే మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఎవరికి వారు అంచనాలు..
టీడీపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 8 నుంచి 10 సీట్లు వచ్చినా చైర్మన్ పదవిని దక్కించుకోవచ్చని యోచిస్తున్నారు. బీజేపీ 2 నుంచి 4 స్థానాలు , ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు చెరో రెండు సీట్లు గెలుచుకుంటాయని భావిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలకు పూర్తి స్థాయిలో సీట్లు రాకపోతే మాత్రం టీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు చైర్మన్ పదవిని నిర్ణయించే కీలక శక్తులుగా మారుతారని చర్చించుకుంటున్నారు.
ఫలితాలపై ఉత్కంఠ
Published Mon, Mar 31 2014 11:11 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement