తాండూరు టౌన్, అనంతగిరి, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వాయిదా పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కూడా ఎక్స్‌టెన్షన్ అయింది. షెడ్యూల్ ప్రకారం నేడే (బుధవారం) కౌంటింగ్ జరగాలి. కానీ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాలను ఈనెల 9వ తేదీన వెల్లడించాలని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో మరో వారం రోజులపాటు అభ్యర్థులకు, పార్టీ పెద్దలకు టెన్షన్ తప్పేలా లేదు. మార్చి 30న మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఫలితాలు వెలువడితే అభ్యర్థుల్లో టెన్షన్ పెద్దగా ఉండేది కాదు. కానీ మారిన పరిస్థితులు అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో, ఎవరు గెలుస్తారో అన్న విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
తాండూరు పట్టణంలోని 31 వార్డుల్లో 16 మంది ఏ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధిస్తారో ఆ పార్టీ అభ్యర్థే చైర్‌పర్సన్ అయ్యే అవకాశం ఉంది. బరిలో ఉన్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం వంటి ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజారిటీ రాదనే ప్రచారం జరుగుతోంది. అయితే చైర్ పర్సన్ అభ్యర్థి పీఠం దక్కాలంటే కావాల్సిన మెజార్టీ కోసం, ఖచ్చితంగా విజయం సాధించనున్న అభ్యర్థులెవరో గమనించి వారిని బుట్టలో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫలితాలు సైతం వాయిదా పడడంతో ఈ ప్రక్రియను పార్టీలు కూడా వాయిదా వేసుకున్నాయి. ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఏప్రిల్ 9న ఉంటుందని వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జైత్రాం నాయక్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆ రోజు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
టెన్షన్.. ఎక్స్‌టెన్షన్!
Published Tue, Apr 1 2014 11:38 PM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement