జోగిపేట, న్యూస్‌లైన్: ఎన్నికల జాతర ముగిసింది. ఫలితాల కోసం అందరూ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. జయాపజయాలపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొని ఉండగా, మద్దతుదారులంతా తమ నాయకుడే గెలవాలన్న ఆశ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఇపుడు 12, 13, 16 తేదీలపైనే పడింది. 12న మున్సిపల్, 13న ప్రాదేశి, 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువరించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మార్చి 30వతేదీన మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగా, లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేయాలని పలు రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టుకెక్కాయి.
మున్సిపల్ ఫలి తాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై చూపుతుందని వారంతా కోర్టుకు విన్నవించారు. స్పందించిన సుప్రీంకోర్టు సార్వత్రిక ఎన్నికల అనంతరమే ఫలితాలు విడుదల చేయాలంటూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై పడింది. ప్రస్తుతం అ భ్యర్థులంతా గెలుపోటములపై తల మునకలై ఉన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేయవచ్చని కొందరు భావిస్తుండగా, మున్సిపల్ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికకు సంబంధం ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఒకే నెలలో ఇలా మూడు ఎన్నికల ఫలితాలు వెలువరించాల్సి రావడంతో అధికారులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుపనుండగా, ప్రాదేశిక నియోజకవర్గాల లెక్కింపు పాత తాలుకా కేంద్రాల్లో జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఎప్పటిలాగే జిల్లా కేంద్రంలో నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం.
అందరి చూపు 12,13,16 ఈ తేదీలపైనే
Published Sun, May 4 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement
Advertisement