‘పుర’ ఫలితంపై తెర తొలగేదెన్నడు?
Published Sun, Apr 6 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
సాక్షి, రాజమండ్రి :పురాధిపత్యం ఎవరిదో ఓటర్లు కొన్నిరోజుల క్రితమే నిర్ణయించేసినా.. ఆ నిర్ణయం ఏమిటన్నది ఎప్పుడు తేలుతుందో ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల తొమ్మిదిన పూర్తిచేసి అదే రోజు ఫలితాలను వెల్లడించేలా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. విషయంపై సోమవారం తుది విచారణ జరిపేందుకు నిర్ణయించింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉండనుంది, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు ఎప్పటికి వెలుగు చూడనుంది, పురపౌరులు ఏ పార్టీకి పట్టం కట్టారు, ఏ అభ్యర్థి వైపు మొగ్గారు అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం ఆదివారం జరిగే తొలివిడత ప్రాదేశిక ఎన్నికలపై దృష్టి సారించింది. ఇది పూర్తయిన వెంటనే 11న జరిగే రెండో విడత పోలింగ్‌కు రంగం సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు అనుమతిని ఇస్తే హుటాహుటిన సిబ్బందిని సన్నద్ధం చేసి, ఒక్కరోజులోనే ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది.
వాయిదానే కోరుకుంటున్న పలు పార్టీలు..
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు కోసం అభ్యర్థులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుండగా పలు రాజకీయ పార్టీలు మాత్రం ఫలితాలు వాయిదా పడాలనే కోరుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం కచ్చితంగా సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని పార్టీల నాయకులు భావిస్తున్నారు. పురపోరు జరిగిన రాజమండ్రి నగర పాలక సంస్థ రాజమండ్రి సిటీ, రూరల్ నియోజక వర్గాల పరిధిలో ఉండగా పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలు పెద్దాపురం నియోజక వర్గంలో, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. తుని, మండపేట, రామచంద్రపురం, అమలాపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీ నియోజకవర్గ కేంద్రాలుగా ఉన్నాయి. ఏలేశ్వరం నగర పంచాయతీ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రధాన పట్టణంగా ఉంది. జిల్లాలోని 19 నియోజక వర్గాల్లో 10 నియోజక వర్గాలపై మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
పురపాలనలో స్తబ్దత
మున్సిపాలిటీల్లో పాలన కూడా స్తబ్దుగా సాగుతోంది. గత నెల మూడు నుంచి 30 వరకూ పురపాలక సిబ్బంది ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉన్నారు. దానికి తోడు ఎన్నికల కోడ్ అమలు, రాష్ట్రపతి పాలన తదితర కారణాల వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడి, నూతన పాలకవర్గాలు పగ్గాలు చేపడితేనే పురపాలన గాడిలో పడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
Advertisement
Advertisement