కంచుకోటల్లో పంచనామా
* టీడీపీ దుస్థితికి తాజా తార్కాణమిదుగో
* తెలంగాణలో ఒకనాడు బలమున్న జిల్లాలపైనా నేడు ఆశలు గల్లంతు
* ఆయా చోట్ల బీజేపీతో పొత్తుతో గట్టెక్కాలని ప్రయత్నం
* ప్రాదేశిక ఎన్నికల్లో పోటీపడలేని దైన్యం
పోలంపల్లి ఆంజనేయులు: ప్రతికూల పరిస్థితుల్లోనూ టీడీపీకి కంచుకోటల్లా నిలిచిన జిల్లాలకు చంద్రబాబు నాయుడు నీళ్లు వదిలారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ అపకీర్తిని మూటగట్టుకున్న బాబు... తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు నివసించే ప్రాంతాలను మాత్రమే ‘తనవి’గా భావిస్తున్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా తెలంగాణ లో బీజేపీకి ఆయన కేటాయించిన సీట్లను చూస్తే... టీడీపీని కేవలం ైెహ దరాబాద్ పరిసర ప్రాంతాల కు మాత్రమే పరిమితం చేస్తారేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. కాంగ్రెస్ గాలి బలంగా వీచిన 1989, 2004, 2009 ఎన్నికల్లో కూడా టీడీపీకి అండ గా నిలిచిన పలు అసెంబ్లీ స్థానాలను బాబు ఈసారి బీజేపీకి వదిలేసుకున్నారు. వాటిల్లో గెలిచే పరిస్థితి లేదని ముందే అంచనాకు వచ్చి, అక్కడ పసుపు జెండాపీకేశారు.
2009లో ఆరు జిల్లాల్లో విజయాలు
2009 ఎన్నికల్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో కూడా తెలంగాణలో టీడీపీ 39 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీకి అధిక స్థానాలు లభించాయి. ఉత్తర తెలంగాణలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీ డీపీ తరఫున గెలిచారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడారు. ఇప్పుడు వాటిలో 80 శాతం సీట్లను పొత్తులో భాగంగా బీజేపీకిచ్చారు. అంటే ఉత్తర తెలంగాణలో టీడీపీ జెం డా పీకెయ్యడానికే సిద్ధమయ్యారని అర్థమవుతోంది.
ఎంత తేడా!
2004 ఎన్నికల్లో వైఎస్ పాదయాత్ర ధాటికి జిల్లాలకు జిల్లాల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. అంతటి వ్యతిరేకతలో కూడా కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో టీడీపీ రెండేసి స్థానాలు సాధించింది. 2005లో జరిగిన జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలంగాణ జిల్లాల్లో టీడీపీ పుంజుకుంది. 2009 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ విజయబావుటా ఎగరేసింది. అదే కరీంనగర్‌లో ఇప్పుడు ఏడు స్థానాలను బీజేపీకి ఇచ్చేసింది! ఆది లాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా బీజేపీ వద్దు వద్దంటున్నా దానికి అధిక స్థానాలు కేటాయించి తప్పుకొంది.
ప్రాదేశిక ఎన్నికల్లో దారుణ పరిస్థితి
గతంలో స్థానిక ఎన్నికలు వచ్చాయంటే టీడీపీ కేడర్‌లో ఎంతో ఉత్సాహం కన్పించేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మునిసిపల్ ఎన్నికల్లో కుదేలవడమే గాక ప్రాదేశిక ఎన్నికల్లో కూడా టీడీపీ తేలిపోయింది. తెలంగాణలో 2000 పైచిలుకు గ్రామాల్లో పోటీ చేసేం దుకు అభ్యర్థులు కూడా దొరకలేదు. మహబూబ్‌నగర్‌లో 932 ఎంపీటీసీ స్థానాలకు 645 చోట్లే పోటీ చేసిం ది. ఐదేళ్ల కిత్రం జిల్లాలో తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు గెలిచిన టీడీపీకి ఇప్పుడు ఈ దుస్థితి కలిగిందంటే బాబే కారణమన్నది స్థానిక నేతలు వాపోతున్నారు.