ఆలస్యం.. ఆపై దూరం.. | waiting for Municipal election results | Sakshi
Sakshi News home page

ఆలస్యం.. ఆపై దూరం..

Published Fri, May 2 2014 12:30 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

ఆలస్యం.. ఆపై దూరం.. - Sakshi

ఆలస్యం.. ఆపై దూరం..

మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు అభ్యర్థుల్లో ఇంకా టెన్షన్‌కు గురిచేస్తూనే ఉన్నాయి. మార్చి 30వ తేదీన మున్సిపల్ ఎన్నికలు ముగియగా.. ఏప్రిల్ 2వ తేదీనే వాటి లెక్కింపు జరగాల్సి ఉంది. కానీ.. పలు రాజకీయ పార్టీలు ఫలితాలు నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ ఫలితాలు కాస్త ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ వ్యవధి కూడా సరిపోదని, ఆ ఫలితాలు వెల్లడిస్తే వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని పార్టీలు మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీంతో సుప్రీం కోర్టు కూడా సార్వత్రిక ఎన్నికల అనంతరమే ఫలితాలు వెల్లడించాలని తీర్పు వెలువరించింది. ఇక.. అభ్యర్థులేమో నిర్వేదంలో పడ్డారు. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో వారి దృష్టంతా ప్రస్తుతం మున్సిపల్ ఫలితాలపైనే పడింది. ఈనెల 12న మున్సిపల్, 13న ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు వరుసగా ఉంది. దీంతో ప్రస్తుతం అభ్యర్థులంతా గెలుపోటములపై తలమునకలయ్యారు.
 
 దూరభారంపై ఆందోళన...
 మంచిర్యాల మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డుకు ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 169 మంది కౌన్సిలర్ అభ్యర్థులు గా పోటీ చేశారు. దాదాపు 45 రో జులపాటు లె క్కింపు సమయం ఉండటంతో కలెక్టర్ బాబు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ తేజావత్ వెంకన్న ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించారు. అయితే.. లెక్కింపు ఈసారి జిల్లా కేంద్రంలోనే ఉండడంతో అభ్యర్థులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధానంగా బరిలో ఉన్న 169 మంది అభ్యర్థులు, అనుచరులు, స్నేహితులు, ఇతర ముఖ్యులు ఇలా అంతా జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఇటు ఖర్చులు.. అటు మానసిక ఒత్తిడి ఇలా అన్ని రకాల ఇబ్బందులకు గురికావాల్సిందే.
 
 జిల్లా కేంద్రంలో అరకొర వసతులు...
 జిల్లా కేంద్రంలో ఈనెల 12న చేపట్టనున్న మున్సిపల్ ఎన్నికల లెక్కింపుతో మంచిర్యాల నుంచి వెళ్లే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లా కేంద్రంలో వసతులు అరకొరగా ఉండటం, ఒక్క మంచిర్యాలే కాకుండా కాగజ్‌నగర్, బెల్లంపల్లి, నిర్మల్, భైంసా, ఆదిలాబాద్ మున్సిపాలిటీల ఎన్నికల లెక్కింపు కూడా అదే రోజు ఉండటంతో పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి ఆయా పార్టీ ముఖ్య నేతలు, అభ్యర్థులు, స్వతంత్రులు తరలివస్తారు. మంచినీరు, ఆహారం, వసతి తదితర ఎలాంటి సౌకర్యాలకైనా అవస్థలకు గురికాక తప్పదు. వేసవి కాలం కావడంతో దూర ప్రాంతాన ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లడం ఒక పరీక్ష అయితే.. అక్కడ ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు వేచి ఉండటం మరో పరీక్ష.  
 
 మంచిర్యాలలో అయితేనే సౌలభ్యం..
 మంచిర్యాలలోనే మున్సిపల్ ఎన్నికల లెక్కింపు చేపడితే సౌలభ్యంగా ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు. జిల్లా కేంద్రంలో ఎన్నికల లెక్కింపు చేపడితే అభ్యర్థుల్లో నిరాశ తలెత్తి తీవ్ర మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే.. ఓడిపోయిన అభ్యర్థులు తనదైన వారు తోడుగా లేకుండా మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల గెలుపుపై పందేలు సైతం నడుస్తున్నారు. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఈ పందెం కాశారు. అయితే.. ఈ పందెం కాసిన వారు కూడా జిల్లాలో చేపట్టే లెక్కింపుతో ఉత్కంఠకు గురికాక తప్పదు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి మంచిర్యాల కేంద్రంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని అభ్యర్థిస్తున్నారు.
 
 సంబరాలకు దూరమే..
 మంచిర్యాలలో ఎన్నికల లెక్కింపుతో సంబరాలు చేసుకునే పరిస్థితే లేకుండాపోతోంది. జిల్లా కేంద్రంలో లెక్కింపుతో గెలిచిన అభ్యర్థులు ఆత్మీయులు, స్నేహితులు, బంధువులతో సంబరాలు జరుపుకోవాలనే ఆశతో ఉంటారు. కానీ.. సుదూర ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతానికి చేరాలంటే దూర భారం ఎక్కువగా ఉంది. దీంతో సంబరాల సంతోషం ఆవిరయ్యేలా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement