ఫ్యాన్ జోరు
సాక్షిప్రతినిధి, కర్నూలు : మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటింది. జిల్లాలోని ఆదోని, నందికొట్కూరు మున్సిపాలిటీలు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలను వైఎస్‌ఆర్‌సీపీ దక్కించుకోగా.. నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ మున్సిపాలిటీలు టీడీపీ ఖాతాలో చేరిపోయాయి. జిల్లాలో ఒక కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీలు ఉండగా... కర్నూలు కార్పొరేషన్, బనగానపల్లి మున్సిపాలిటీ మినహా మిగిలిన మున్సిపాలిటీలకు మార్చి 30న ఎన్నికలు నిర్వహించారు.
సుమారు 45 రోజుల క్రితం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం పూర్తయింది. కర్నూలు శివారు ప్రాంతంలోని సెయింట్‌జోసెఫ్ బాలిల జూనియర్ కళాశాలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య చేపట్టిన ఓట్ల లెక్కింపులో ప్రారంభం నుంచి ఫ్యాను జోరు కనిపించింది. జిల్లా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారని నిరూపించారు. మొత్తం 219 వార్డులుండగా.. ఆళ్లగడ్డలో రెండు వార్డులు వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన 217 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. వైఎస్సార్‌సీపీ 104, టీడీపీ 102, కాంగ్రెస్ 2, ఎంఐఎం 5, ఆర్పీఎస్ ఒకటి, ఇండిపెండెంట్లు 3 వార్డుల్లో గెలిచారు.
ఆళ్లగడ్డలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ
ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఎదురులేదని మరోసారి నిరూపితమైంది. ఎన్ని కుట్రలు పన్నినా ఆ కుటుంబాన్ని
ఢీకొనలేరని తేలిపోయింది. ఈ మునిసిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉంటే... 18 వార్డులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ రెండు వార్డులకే పరిమితమైంది. వీటిని కూడా అతికష్టం మీద దక్కించుకోగలిగింది. 9వ వార్డులో 60 ఓట్లు, 20వ వార్డులో 56 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు గట్టెక్కారు. అదేవిధంగా ఆదోని మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుపై ప్రజలకున్న వ్యతిరేకతకు ఈ ఫలితాలు అద్దం పట్టాయి.
మొత్తం 41 వార్డుల్లో 23 వార్డులను వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు దక్కించుకోవడం విశేషం. టీడీపీ 13 స్థానాలకే పరిమితమైంది. ఇక నందికొట్కూరులోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించింది. మొత్తం 23 వార్డుల్లో అత్యధికంగా 15 వార్డులను కైవసం చేసుకుని సత్తా చాటింది. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినా నందికొట్కూరు వాసులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ గుండెల్లో ఉన్నారని చాటుకున్నారు. ఇక్కడ టీడీపీ, ఆర్‌పీఎస్ ఒక్కటై ఫ్యాన్ జోరును ఆపాలని చూసినా చుక్కెదురవడం గమనార్హం.
టీడీపీ.. మూడింటితో సరి
నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ మున్సిపాలిటీలను టీడీపీ దక్కించుకుంది. డోన్ మున్సిపాలిటీలో అతి కష్టంపై నెగ్గుకొచ్చింది. స్థానికంగా టీడీపీ, కాంగ్రెస్ నేతలు కుమ్ముక్కవడంతోనే ఈ ఫలితం చేజిక్కించుకున్నట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా నంద్యాలలోనూ కాంగ్రెస్, టీడీపీ తెరచాటు బాగోతం నడపటంతో పాటు దొంగ ఓట్లు వేయించినట్లు తెలుస్తోంది.
పోలింగ్ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు పోలింగ్ కేంద్రాల వద్ద దొంగ ఓటర్లను అడ్డుకోవడం ఇందుకు నిదర్శనం. టీడీపీ గెలుపొందిన ఆ మూడు మున్సిపాలిటీల్లో ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురి చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ వైఎస్‌ఆర్‌సీపీ జిల్లాలో అత్యధిక మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం.