ఆదుకుంటా..అండగా ఉంటా | Manchireddy Kishan Reddy visit venkata ramana colony as sakshi reporter | Sakshi
Sakshi News home page

ఆదుకుంటా..అండగా ఉంటా

Published Sun, Dec 14 2014 11:15 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

ఆదుకుంటా..అండగా ఉంటా - Sakshi

ఆదుకుంటా..అండగా ఉంటా

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా  వెంకటరమణ కాలనీని అన్నివిధాలుగా అభివృద్ధిపరుస్తా ..ఐటీ హబ్‌గా ఇబ్రహీంపట్నం ఇప్పటికే బహుళ ప్రాచుర్యం పొందుతోంది. మండలంలోని ఆదిబట్లలో టీసీఎస్‌తో ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా కొత్త గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా రాష్ట్ర రాజధానికి నిమిషాల వ్యవధిలో చేరుకునేంత సమీపంలో ఉన్న ఈ ప్రాంతం పలువురు పారిశ్రామిక దిగ్గజాల దృష్టినీ ఆకర్షిస్తోంది. నూతన పారిశ్రామిక విధానానికి అనువైన అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నా.. ఈ మండలంలో కనీస వసతులు లేని కాలనీలూ ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరంలేదు.

మౌలిక సదుపాయాలు కొరవడటంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో అభివృద్ధికి నోచుకోని వెంకటరమణ కాలనీకి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వచ్చారు. ‘పెద్దాయనా ఎలా ఉన్నావు.. ఏమ్మా పింఛన్ వస్తోందా.. బ్రదర్ మీ కాలనీలో సమస్యలేంటి’ అంటూ.. స్థానిక ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆదుకుంటానని.. అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. కాలనీలో ఆయన దాదాపు 3 గంటల పాటు  గడపగడపకూ తిరిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రజల సమస్యలను సావధానంగా వినడమే కాకుండా.. వాటిని నోట్ చేసుకున్నారు. రిపోర్టర్‌గా ఎమ్మెల్యే తీసుకున్న చొరవకు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.. మీ అభిమానానికి సర్వదా రుణపడి ఉంటామని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
 
ఎమ్మెల్యే హామీలు...
వెంకటరమణ కాలనీలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు తక్షణం చేతి పంపుల ఏర్పాటు
శ్మశానవాటికలో మౌలిక సదుపాయాల కల్పన
సామాజిక భవన నిర్మాణానికి కృషి
అర్హులైన పేదలకు వినోబానగర్‌లో గృహ వసతి
చదువుకున్న నిరుద్యోగులకు ఈ ప్రాంతంలో నెలకొల్పే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు
అర్హులైన నిరుపేదలందరికీ పింఛన్లు
సీసీ రోడ్ల ఆధునికీకరణకు చర్యలు
వీధి దీపాల ఏర్పాటు  

ఎమ్మెల్యే: పెద్దాయనా బాగున్నావా?
భిక్షపతి: ఏం బాగు సార్.. పింఛన్ డబ్బులు అందడంలేదు.
ఎమ్మెల్యే: ఏం ఎందుకు.. నీ వయసెంత.. సర్టిఫికెట్లు ఇక్కడే ఉన్నాయా?
భిక్షపతి: నా వయస్సు 65 ఏళ్లు. సర్టిఫికెట్లు ఇంటి వద్ద ఉన్నాయి.
ఎమ్మెల్యే: ఏమయ్యా.. ఏంటి వెంకటరమణ కాలనీలో సమస్యలు?
రఘుపతి: కాలనీ మధ్యలో స్మశానం ఉందిసార్.. ప్రహరీ లేక పోవడంతో విషసర్పాల భయం వెంటాడుతోంది.
ఎమ్మెల్యే: ప్రహరీ నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటా.
ఎమ్మెల్యే: ఏమ్మా .. ఎంతమంది బిడ్డలు. బతుకుదెరువు బాగుందా?
పోచమ్మ: నాకు ముగ్గురు కొడుకులు. బతుకుదెరువు కోసం వలస వెళ్లారు. రెండునెళ్ల నుంచి పింఛన్ వస్తలేదు.  
ఎమ్మెల్యే: బాబూ .. మీ కాలనీలోని సమస్యలను వివరించు?  
ఇబ్రహం: సార్ .. నాకు పింఛన్ రావడంలేదు. మా కాలనీలో రోడ్డు సరిగ్గాలేదు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి మినీ ఫంక్షన్‌హాల్‌గా మారిస్తే బాగుంటుంది.  
ఎమ్మెల్యే: అమ్మాయ్.. ఏం చదువుకున్నావు.. ఇంటి వద్దే ఉంటావా?
రాణి: సార్.. నాకు పోలీస్‌శాఖలో ఉద్యోగం చేయాలనుంది. డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాక పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాను.
ఎమ్మెల్యే: మీ కాలనీలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలేంటి?
దశరథ్: మంచినీటి సరఫరా లేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ డబ్బులు వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నారు.
ఎమ్మెల్యే: పింఛన్లపై అపోహలు వద్దు. అర్హులైన వారందరికీ పింఛన్ సౌకర్యం అందించేందుకు చర్యలు తీసుకుంటా.
ఎమ్మెల్యే: ఏం పెద్దమ్మ.. పింఛన్ వస్తోందా..? కొడుకులు ఏం చేస్తుంటారు?
రాములమ్మ: సార్.. నా కొడుకులు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ బతుకుదెరువు సాగిస్తున్నారు. నాకే పింఛన్ రాక ఇబ్బంది పడుతున్నా.
ఎమ్మెల్యే: ఏం పెద్దమనిషి.. నీపేరేంటి.. బాగున్నావా?
మైసయ్య: సార్ నాకు ఇంటి స్థలం లేదు. కూలి పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నా. అదికూడా సరిగ్గా దొరకంలేదు.
ఎమ్మెల్యే: ఏమ్మా .. ఏంటి మీ కాలనీలో సమస్య ?
మణెమ్మ: మా కాలనీలో అసలే రోడ్డు సౌకర్యం లేదంటే.. ఉన్న రోడ్డునే ఆక్రమించుకున్నారు. రాత్రివేళ వీధిదీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నాం.
ఎమ్మెల్యే: ఏం తల్లి.. ఎందుకు బాధలో ఉన్నావు?
స్వరూప: సార్.. నా భర్త చనిపోయాడు. పిల్లలు ఉన్నారు. ఎలా బతకాలో తెలియడంలేదు.  
ఎమ్మెల్యే: బాధపడొద్దు. పిల్లల కోసం ధైర్యంగా ఉండాలి. మీ కుటుంబానికి ప్రభుత్వపరంగా అందే సహకారాన్ని అందజేస్తా.
ఎమ్మెల్యే: ఏమ్మా.. మీ కాలనీలో ఏమైనా సమస్యలున్నాయా?
సత్తెమ్మ: మా కాలనీలో మురుగు కాలువలు లేవు. రోడ్లపైనే మరుగునీరు పారుతోంది. దోమలతో రోగాల బారిన పడుతున్నాం.
ఎమ్మెల్యే: నీ పేరేంటి.. కొడుకులున్నారా?
బుగ్గమ్మ: సార్..
నా కొడుకులు వారి బతుకుదెరువు వారు చూసుకున్నారు. నాకు నెలనెలా వచ్చే పింఛన్ రావడం లేదు.
ఎమ్మెల్యే : మీకొచ్చిన కష్టాలేంటో చెప్పండి?
బాలకృష్ణ : సార్.. మా కాలనీలో అన్నీ సమస్యలే. డ్రైనేజీ కాలువలు లేవు. మంచినీటి సౌకర్యం, రహదారి సౌకర్యం లేదు. పందులు, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. మినీ నీటి ట్యాంక్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
ఎమ్మెల్యే: బాబూ.. మీ కేమైనా సమస్యలున్నాయా?
రంగయ్య: సార్.. మా కాలనీలో కుక్కలు, పందుల బెడద అధికంగా ఉంది. ఇళ్లస్థలాలు లేవు.  
ఎమ్మెల్యే: ఏమ్మా .. నీ బాధలేంటో చెప్పు?  
 మహిళ: సార్.. ఈమె పేరు పెంటమ్మ. ఈమెకు చెవులు వినపడవు. కొడుకులు లేరు. పింఛన్ రావడంలేదు (పక్కన ఉన్న మహిళ).
ఎమ్మెల్యే: ఏమ్మా.. మీ ప్రాంతంలో సమస్యలేమున్నాయ్?
ప్రేమమ్మ: సార్.. మా కాలనీలో రోడ్డు సమస్య ఉంది. మంచినీటిని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది.  
ఎమ్మెల్యే: ఏమ్మా మీరంతా ఒకే చోట ఉన్నారు.. ఏంటీ మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు?
మహిళలు: సార్ .. మంచినీళ్ల కోసం ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నాం. డ్రైనేజీలు లేకపోవడంతో మురుగువాసన విపరీతంగా వస్తోంది.
ఎమ్మెల్యే: బోరు వేస్తే నీళ్లు పడతాయా ?
మహిళలు: బోరువేస్తే నీరుపడుతుంది సార్.. కాలనీలో రెండు బోర్లు వేయిస్తే ప్రజల అవసరాలు తీరుతాయి.
ఎమ్మెల్యే: ఏం కౌన్సిలర్ గారూ.. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు?
రవీందర్ (కౌన్సిలర్): మా వార్డులో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రూ.15లక్షలతో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరలో పనులు ప్రారంభిస్తాం.

సమస్యలు తెలిశాయి.. పరిష్కారం చూపుతా..
‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఇబ్రహీంపట్నం వెంకటరమణ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నా. సాధ్యమైనంతవరకు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తా. సామాజిక స్పృహతో ‘సాక్షి’ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తుంది. ప్రజలను కలుసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి.    - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement