United Rangareddy District BRS Leaders Under ED, IT Focus, Details Inside - Sakshi
Sakshi News home page

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలపై నజర్‌

Published Fri, Dec 23 2022 4:11 PM | Last Updated on Fri, Dec 23 2022 6:05 PM

United Rangareddy District BRS Leaders Under ED, IT Scan - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయి. విచారణ పేరుతో ఇప్పటికే ఒకరి తర్వాత మరొకరికి నోటీసులు జారీ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యనేతలు, వారి కుటుంబ సభ్యులపై ఈడీ, ఐటీ దాడులు నిర్వహిస్తుండటంతో ఇన్నాళ్ల పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన బంధువులు, ముఖ్య అనుచరులు, వ్యాపార భాగస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం వీరిని చూస్తే చాలు ముఖం చాటేస్తున్నారు. ఈ కేసుల్లోకి తమను ఎక్కడ లాగుతారోననే భయంతో బెంబేలెత్తిపోతున్నారు.

ఆరు నెలల క్రితం వరకు ఆయా నేతల దృష్టిలో పడేందుకు రోజంతా వారి ఇళ్లు, క్యాంపు ఆఫీసుల ఎదుట పడిగాపులుగాసిన వారు సైతం అటువైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. విదేశాల్లో క్యాసినో గేమ్స్‌తో మొదలు.. మెయినాబాద్‌ ఫాం హౌస్‌ కేంద్రంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వరకూ ఇలా ప్రతి కేసు జిల్లా నేతలకు, వారి ముఖ్య అనుచరులకు, ఆర్థిక బినామీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.   


మనీలాండరింగ్‌ కేసులో మంచిరెడ్డికి 

మనీలాండరింగ్‌కు పాల్పడిన అభియోగంపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఆగస్టులో ఈడీ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు తమ ఆఫీసుకు పిలిపించి 14 గంటలకుపైగా విచారించింది. 2014లో మంచిరెడ్డి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించారు. ఈ సమయంలో చేసిన ఖర్చులతో పాటు 2015లో ఇండోనేషియా వేదికగా గోల్డ్‌మైన్స్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టారనే అభియోగంపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లోనే ఉంది. సాక్షాత్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడిపై మనీలాండరింగ్‌ ఆరోపణ లు రావడం, ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారణకు సైతం హాజరు కావడంతో జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించింది. అప్పటి వరకు ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం రోజుల తరబడి ఎదురు చూసిన వారు ఆ తర్వాత మంచిరెడ్డి ఎదురుపడితే సైలెంట్‌గా సైడై పోతుండటం గమనార్హం. 


అక్రమ ఆస్తుల కేసులో మంత్రికి 

మెడికల్‌ కాలేజీల్లో ఫీజుల వసూలు, పన్నుల ఎగవేత వంటి పక్కా సమాచారంతో మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిపై ఇటీవల ఐటీ సోదాలు నిర్వహించింది. నవంబర్‌ 22న ఏకకాలంలో  50 బృందాలు బోయిన్‌పల్లిలోని ఆయన ఇల్లుతో సహా విద్యా సంస్థలు, ఆస్పత్రుల్లో సోదాలు చేపట్టింది. వరుసగా మూడు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో మంత్రి అల్లుడు, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు, వ్యాపార భాగస్వాముల బ్యాంకు లావాదేవీల వివరాలు, లాకర్లు తెరిపించి పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారు. ఈ సమయంలో మంత్రితో పాటు 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఆర్థిక అవకతవకల కోణంలో విచారించేందుకు ఈడీకి లేఖ రాసినట్లు ప్రచారం సాగుతోంది. అప్పటి వరకు మంత్రి వెంట మౌనంగా ఉన్న జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్రస్తుతం ఆయనపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం మైనంపల్లి ఫాంహౌస్‌ వేదికగా ముఖ్యనేతలంతా భేటీ కావడం, మంత్రి వ్యవహారశైలిపై బహిరంగ విమర్శలు చేస్తుండటం గమనార్హం.  


ప్రస్తుతం పైలెట్‌  

మెయినాబాద్‌ ఫాం హౌస్‌(ఎమ్మెల్యేల ఎర) కేసులో కీలక ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిపై ఈడీ దృష్టి సారించింది. బెంగళూరు డ్రగ్స్‌ కేసులోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ఇటీవలే పైలెట్‌కు నోటీసులు జారీ చేయగా, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత సోమవారం మధ్యాహ్నం విచారణ సంస్థ ముందు హాజరయ్యారు. ఏడు గంటల పాటు విచారించిన ఈడీ మరుసటి రోజు మళ్లీ హాజరు కావాల్సిందిగా సూచించింది. దీంతో రెండో రోజైన మంగళవారం కూడా ఆయన ఈడీ ముందుకు వెళ్లారు. 

ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన చూపిన స్థిర, చర ఆస్తులు, ఆ తర్వాత ఆయన కూడబెట్టిన ఆస్తులు, విద్యార్హత, బ్యాంకు ఖాతాలు, పాస్‌పోర్టు, పాన్, ఆధార్‌ కార్డు వంటి వ్యక్తిగత వివరాలను ఆరా తీసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో ఆయనపై అనేక ఆరోపణలు రావడం, సిట్‌ విచారణ కొనసాగుతుండటం, మరో వైపు ఈ కేసును సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుండటం, ఇదే సమయంలో ఆయనకు ఈడీ నోటీసులు రావడం వంటి వరుస పరిణామాలు అధికార బీఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పటి వరకు ఎమ్మెల్యేతో అంటకాగిన నేతలు, అనుచరులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార భాగస్వాములు ప్రస్తుతం పైలెట్‌ వెంట వెళ్లేందుకు జంకుతున్నారు. (క్లిక్ చేయండి: ప్లాట్‌ కొంటున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement