రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న జిల్లా ఇదే. పల్లె, పట్నం కలబోత జిల్లాగా శరవేగంగా విస్తరిస్తూ ఐటీ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. మొదట్లో టీడీపీ, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ జిల్లా రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచింది. ఈ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటేందుకు అధికార బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, మళ్లీ పట్టు బిగించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది.
ప్రచారంలో జెట్ స్పీడులో కారు
ఇక్కడ మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా, 2014లో టీఆర్‌ఎస్ ఏడు స్థానాల్లో విజయం సాధించగా, ఆరు స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 2018 నాటికి టీడీపీ పూర్తిగా కనుమరుగైంది. 14 స్థానాలను టీఆర్‌ఎస్ దక్కించుకోగా, కేవలం మూడు స్థానాలే హçస్తగతమయ్యాయి. ఆ తర్వాత మహేశ్వరం నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి గెలుపొందిన దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, తాండూరు నుంచి గెలుపొందిన పైలెట్ రోహిత్‌రెడ్డి కూడా చేయిచ్చి ..కారెక్కారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులే కొనసాగారు.
ఇప్పుడు ఈ ఎన్నికల్లో అధిష్టానం ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడంతో పార్టీ బీ ఫాం తీసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణలు, సెటిల్‌మెంట్లు, అవినీతి వంటి ఆరోపణలున్నాయి. ఇక ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చడంతో ఆయన ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. మల్కాజిగిరి హన్మంతరావు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ అంతర్గత కుమ్ములాటలకు తోడు కాంగ్రెస్, బీజేపీల నుంచి గట్టి పోటీ ఎదరవుతుండటంతో అధికార పార్టీ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది.
చేరికలతో ‘చేతి’కి జీవం
తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుస పరాజయాలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్‌కు కీలక నేతల చేరికలు మళ్లీ జీవం పోశాయి. తుక్కుగూడ వేదికగా ఇటీవల నిర్వహించిన పార్టీ విజయోత్సవ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంతరావు, తాండూరులో డీసీసీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి, షాద్‌నగర్‌లో చౌల ప్రతాప్‌రెడ్డి సహా పలువురు జెడ్పీటీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మహేశ్వరంలో చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, ఇబ్రహీంపట్నంలో సిద్ధంకి కృష్ణారెడ్డి, శేరిలింగంపల్లిలో జగదీశ్వర్‌గౌడ్ చేరికలు ఆ పార్టీకి జీవం పోశాయి.
గత ఎన్నికల్లో పార్టీ నుంచి గెలుపొంది, ఆ తర్వాత పార్టీని వీడిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టార్గెట్‌గా మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని బరిలోకి దించింది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను రంగంలోకి దింపింది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన మల్‌రెడ్డి రంగారెడ్డిని ఇబ్రహీంపట్నం నుంచి బరిలోకి దింపింది. కారు దిగి హస్తం గూటికి చేరిన కసిరెడ్డిని కల్వకుర్తి నుంచి, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డిని తాండూరు నుంచి రంగంలోకి దింపి అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
బీజేపీ ఫోకస్
ఉమ్మడి జిల్లాపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2014లో ఉప్పల్ మినహా ఇతర నియోజకవర్గాల్లో గెలువలేక పోయింది. 2018 లోనూ కారు ధాటికి తట్టుకోలేక పోయింది. అర్బన్ ఓటర్లే లక్ష్యంగా ఈ సారి పావులు కదుపుతోంది. పార్టీ జాతీయ సమావేశాలు కూడా జిల్లా వేదికగా నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు జిల్లాలో పర్యటించి పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు.
శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, కల్వకుర్తి, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, వికారాబాద్, తాండూరు, పరిగి, నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సొంత గడ్డగా భావించే మహేశ్వరం నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది.
రాజకీయాస్తాలుగా 111జీఓ, ధరణి సమస్యలు
రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, గృహలక్మి, పథకం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఖాళీ స్థలాల పంపిణీ, జీఓ నంబర్ 58 ,59, 118(ఆక్రమిత ప్రభుత్వ స్థలాల, సీలింగ్ భూముల క్రమబద్దీకరణ), కొత్త పరిశ్రమలు, ఐటీ, ఉపాధి అవకాశాలే ప్రధాన ఎజెండాగా అధికార బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు మాత్రం జంట జలాశయాల పరిరక్షణకు తీసుకొచ్చిన 111 జీఓ ఎత్తివేత అంశంతో పాటు ధరణి సమస్యలు, ఫార్మాసిటీ, పారిశ్రామిక వాడల్లోని భూ బాధితులకు నష్టపరిహారం చెల్లింపులు, అబ్దుల్లాపూర్‌మెట్ మైన్స్ తవ్వకాలు వంటి అంశాలను రాజకీయ ఎజెండాగా ఎంచుకుంటున్నాయి.
రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా నుంచి ధరణి ఫోర్టల్‌కు 1.95 లక్ష లకుపైగా దరఖాస్తులు అందగా, మెజారిటీ దరఖాస్తులు వివిధ కారణాలతో పరిష్కారానికి నోచుకోకుండా పోయాయి. కాంగ్రెస్, బీజేపీలు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తి కాకపోవడం కూడా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది.
- శ్రీశైలం నోముల
Comments
Please login to add a commentAdd a comment