సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రనేతలకు పెద్ద తంటా వచ్చి పడింది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు... అదికూడా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సిన సందర్భంలో ఈ ఎన్నికల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం జాతీయ కార్యవర్గ సభ్యుడు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి రాజీనామా ఓ పెద్ద షాక్‌లా తగిలింది.
కొన్నిరోజుల ముందు జాతీయ కార్యవర్గ సభ్యుడు, అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల వివరాలు, ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడానికి ముందే ఏయే అంశాలపై బీజేపీ దృష్టి కేంద్రీకరిస్తోంది, తదితర ఎన్నికలకు సంబంధించి అంతర్గత విషయాలు, అదేవిధంగా బీజేపీ అగ్రనాయకత్వం భేటీల్లో వెల్లడించిన అంశాలు, ఆయా అంశాలపై వారి అభిప్రాయాలు, ఇతర ప్రాధాన్యత సంతరించుకున్న విషయాలపై అంతర్గత సమాచారం వంటివి ప్రత్యర్థి పార్టీలకు తెలిసే అవకాశాలు ఏర్పడ్డాయనే ఆందోళ న వ్యక్తమవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న పరిణామా లే తెలంగాణలోనూ రిపీట్ అవుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్‌లో బీజేపీ గెలిచేంతస్థాయిలో పుంజుకున్నా, టీఎంసీ నుంచి చేరిన ఎంపీ, ఇతర కీలక నేతలు ఎన్నికలకు ముందు పార్టీని వీడటంతో కోలుకోలేని దెబ్బ తగిలిందని ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు.
బెంగాల్ తరహాలోనేనా...
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పోటీచేసి 4 ఎంపీ సీట్లను గెలుపొందింది. దీంతో తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పెరుగుతోందన్న అంచనాల మధ్య తమ రాజకీయ భవిష్యత్‌ను పరీక్షించుకునేందుకు విడతల వారీగా ప్రస్తుత ఎన్నికలకు కొంతకాలం ముందుదాకా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి పలువురు మాజీ ఎంపీలు ఇతర నేతలు బీజేపీలో చేరారు.
కొంతకాలం వరకు బాగానే ఉన్నా, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుతో ము ఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల అసంతృప్త స్వరాలు ఒక్కసారిగా పెరిగాయి. పార్టీ జాతీ య నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వరుసగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్, ఏనుగు రవీందర్‌రెడ్డి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి అసంతృప్త నేతలు భేటీలు నిర్వహించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని, తమకు పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత లేదంటూ వివిధ అంశాలపై నేరుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ డిమాండ్లు చేశారు. ఆ తర్వాత వారి లో రాజగోపాల్‌రెడ్డికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా, వివేక్‌కు మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా, విజయశాంతికి ఉద్యమ కమిటీలో ప్రాధాన్యత కల్పించారు.
సరిగ్గా ఎన్నికలకు ముందు...
అయినప్పటికీ చివరకు సరిగ్గా ఎన్నికలు జరగడానికి నెలరోజుల ముందు బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యులుగా, ఎన్నికలకు సంబంధించి కీలక బాధ్యతల్లో ఉన్న రాజగోపాల్‌రెడ్డి, ఆ తర్వాత వివేక్ పార్టీని వీడటంతో నాయకుల్లో గందరగోళం నెలకొంది. ఇంకా కొందరు కూడా బీజేపీని విడిచిపెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కూడా...ఆయా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించిన నేతలు చివరి నిమిషంలో పార్టీకి రాజీనామా చేసి అధికార బీఆర్‌ఎస్‌లో చేరడం కలకలం సృష్టించింది.
పార్టీకి సంబంధించిన కీలకమైన అంశాలు, పోల్ మేనేజ్‌మెంట్, ఇతర ముఖ్య సమాచారం వారి ద్వారా ప్రత్యర్థి పార్టీలకు చేరి ఉంటుందనే అనుమానాలు కూడా అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. తాజాగా అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ, మేనిఫెస్టో కమిటీల చైర్మన్లు పార్టీకి గుడ్‌బై చెప్పడం రాజకీయంగా బీజేపీకి ఏ మేరకు నష్టాన్ని కలిగిస్తుందనేది వేచిచూడాల్సి ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment