ఓరుగల్లు.. పోటీ ఫుల్లు! | In the joint Warangal district war is raging | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు.. పోటీ ఫుల్లు!

Published Tue, Nov 21 2023 4:40 AM | Last Updated on Tue, Nov 21 2023 4:40 AM

In the joint Warangal district war is raging - Sakshi

 ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజల తీర్పుపై తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓరుగల్లు జనంనాడిపై అందరి దృష్టి ఉంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీఆర్‌ఎస్‌ ఇక్కడ బలంగా ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్‌ బలపడి నువ్వానేనా అన్నట్టు పోటీలో ఉంది. తొమ్మిదిన్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో బీఆర్‌ఎస్‌ ముందుకెళుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకత,  బీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై అసంతృప్తికి తోడుగా తమ గ్యారంటీల మేనిఫెస్టోకు మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని బీజేపీ బలంగా చెబుతోంది. 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఎన్నికల పరిస్థితిపై  సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌. 

వరంగల్‌ తూర్పు: ఉదయించేది ఎవరో? 
గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా రెండున్నరేళ్ల అనుభవం, ఆ తర్వాత ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నన్నపునేని నరేందర్‌ బీఆర్‌ఎస్‌ తరపున మరోమారు అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. ఈ సెగ్మెంట్‌నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్‌ పార్టీ తరపున, మంత్రి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. గత రెండేళ్లుగా భారీ వర్షాలు వరంగల్‌ నగరాన్ని కుదిపేయడంతో స్థానికంగా ప్రజల్లో ఆగ్రహం ఉంది.

అయితే వరద నివారణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడం, దీనికితోడు కేడర్‌ను పట్టించుకోడనే ప్రచారం ఉండడం, కిందిస్థాయి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయనే భావనలో బీఆర్‌ఎస్‌ ఉండగా, ప్రభుత్వ వ్యతిరేకత, అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడాన్ని కొండా సురేఖ అనుకూలంగా మార్చుకుని విజయం కోసం కష్టపడుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో బలమైన నేతగా పేరున్న బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సైతం ప్రచారంలో ముమ్మరంగా దూసుకెళ్తున్నారు. బీజేపీ అగ్రనేతలు సైతం ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్డడంతో పోటీ త్రిముఖంగా ఉంది. 

పరకాల: గెలుపుపై ’చల్లా’రని ఆశలు 
అధికార పార్టీ నుంచి చల్లా ధర్మారెడ్డి పోటీలో ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ నుంచి కాళీప్రసాద్‌ పోటీలో ఉన్నారు. అభ్యర్థి స్థానికంగా పట్టున్న నేత కావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ దఫా గట్టెక్కిస్తాయని బీఆర్‌ఎస్‌ పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి స్థానికేతరుడు కావడంతో క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీసీ ముఖ్యమంత్రి అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం, నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉండడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

స్టేషన్‌ఘన్‌పూర్‌: గెలుపు కూత ఎటు? 
బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బరిలో నిలవగా, కాంగ్రెస్‌ నుంచి ఇందిర, బీజేపీ తరపున విజయరామారావు పోటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్యకు బదులుగా కడియంకు టికెట్‌ ఇవ్వడం పట్ల కేడర్‌లో కొంత అసంతృప్తులు బయటపడ్డాయి.

పార్టీ నాయకత్వం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ రాజయ్య వర్గం కడియం గెలుపు కోసం ఏమేరకు సహకరిస్తుందో వేచిచూడాలి. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న ఇందిర మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు అధిక సంఖ్యలో ఉండడంతో ఆమెకు కలిసి వస్తుందని భావిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు బీజేపీ సైతం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. 

డోర్నకల్‌: ఏ ’నాయక్‌’ నిలిచేనో 
గిరిజనుల ప్రభావమున్న ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి డీఎస్‌ రెడ్యానాయక్, కాంగ్రెస్‌ నుంచి జాటోత్‌ రామచంద్రునాయక్, బీజేపీ నుంచి భూక్యా సంగీత పోటీలో ఉన్నారు. 1989 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2009 ఎన్నిక మినహా మిగతా ఆరుసార్లు రెడ్యానాయక్‌ గెలుపొందారు. ఏడోసారి గెలిచేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయనే ధీమాతో ఆయనున్నారు.

 అయితే ప్రభుత్వం, ఎమ్మెల్యేపై  వ్యతిరేకత ఉందని, దీంతో గెలుపు తమదేనన్న ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. గత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోవడంతో సానుభూతి, పార్టీలో రెబల్స్‌ లేకుండా ఐక్యంగా పనిచేస్తున్న పరిస్థితులు గట్టెక్కిస్తాయనే భావన కాంగ్రెస్‌లో ఉంది. బీఆర్‌ఎస్‌లో ఉన్న సంగీత చివరి నిమిషంలో బీజేపీలో చేరి పోటీలో ఉన్నారు. 

పాలకుర్తి: ‘దయ’ ఉంటుందా? 
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికార బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉండగా, అత్యంత పిన్న వయసు్కరాలైన యశస్వినిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి, బీజేపీ నుంచి రామ్మోహన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పట్టున్న వ్యక్తిగా పేరుండడం, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం  దయాకర్‌రావుకు కలిసొచ్చే అంశం.

ఏళ్లుగా ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడంతో ఉండే వ్యతిరేకత, దీనికి తోడు ప్రభుత్వంపై ఉండే అసంతృప్తి పాటు, కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు సైతం పలుమార్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండడం తనకు కలిసివస్తుందని యశస్వినిరెడ్డి  భావిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న రామ్మోహన్‌రెడ్డి స్థానిక మంత్రాన్ని జపిస్తున్నారు. 

మహబూబాబాద్‌: త్రిముఖ పోటీ  
అధికార పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన శంకర్‌నాయక్‌ మూడోసారి అదృష్టాన్ని పరిశీలించుకుంటుండగా, స్థానికంగా వైద్యుడిగా మంచిపేరు పొందిన మురళీనాయక్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలిసారి బరిలో నిలిచారు. బీజేపీ తరపున హుస్సేన్‌నాయక్‌ పోటీలో ఉన్నారు. వరుసగా ఎమ్మెల్యే కావడంతో ఉండే వ్యతిరేకత, క్షేత్రస్థాయిలో పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటుండడం, కిందిస్థాయి నాయకు­ల్లో అసంతృప్తి అధికార పార్టీ అభ్యర్థికి ప్రతికూలాంశాలు. మురళీనాయక్‌ స్థానికంగా కలుపుగోలు వ్యక్తి కావడంతో గెలుపు పట్ల ధీమా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు 35వేల ఓట్లు సాధించిన హుస్సేన్‌నాయక్‌ ఈసారి బీజేపీ తరపున పోటీ చేస్తుండడగా సానుభూతి కలిసివస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. 

నర్సంపేట: ఇద్దరి మధ్యే హోరాహోరీ  
బీఆర్‌ఎస్‌ నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి రెండోసారి గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా విజయం సాధించిన దొంతి మాధవరెడ్డి తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీలో ఉండగా, బీజేపీ నుంచి పుల్లారావు పోటీలో ఉన్నారు. ప్రధానంగా అధికారపార్టీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది.

ఉద్యమనేపథ్యం ఉండడం, ప్రతి గ్రామంలో మంచి పరిచయాలుండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయనే ధీమా బీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్న దొంతి మాధవరెడ్డి సైతం క్షేత్రస్థాయిలో మంచి పరిచయాలు కలిగి ఉండి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు ముమ్మరంగా కష్టపడుతున్నారు. 

జనగామ: ఎవరికి జై కొడుతుందో? 
అధికార బీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, బీజేపీ తరపున ఆరుట్ల దశమంతరెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి బదులుగా పల్లాను బరిలోకి దింపడంతో కలిసివస్తుందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మరోవైపు గతంలో పీసీసీ చీఫ్‌గా చేసిన మాజీ మంత్రి పొన్నాలను బీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకోవడంతో గెలుపు పట్ల ధీమాగా ఉంది.

ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గం సహకారం, పొన్నాల బలం ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. ఇక కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న కొమ్మూరి గతంలో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఈసారి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు బీజేపీ కేడర్‌ సైతం గట్టిపోటీ ఇచ్చేందుకు శ్రమిస్తోంది. 

ములుగు: సీతక్క ముందు నిలిచేనా 
బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ములుగు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి పోటీలో ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ బ్రాండ్‌ సీతక్క, బీజేపీ తరపున మాజీమంత్రి చందూలాల్‌ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్‌ పోటీ పడుతున్నారు. నాగజ్యోతి  జెడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగిన అనుభవం, మావోయిస్టు నేపథ్యమున్న కుటుంబం కావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఎజెండాగా ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన వ్యక్తి కావడం, స్థానికంగా ప్రతి తండాలోనూ కలుపుగోలుగా ఉండడం కలిసొచ్చే అంశం. ఈసారి రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఆదివాసీ తెగకు చెందిన వారు కావడంతో ఓట్ల చీలక ఎలా ఉంటుందనేది చూడాలి. బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్‌ లంబాడా వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గం ఓట్లను పూర్తిగా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీలో గెలుపు ఎటువైపు ఉంటుందో చూడాలి. 

భూపాలపల్లి: ’బాస్‌’ ఎవరు? 
బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి గండ్ర సత్యనారాయణ రావు, బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌   నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్‌ఎస్‌ చేరిన తర్వాత ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ బలంగా ఉన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గం అధికారపార్టీ అభ్యర్థికి ఏమేరకు అనుకూలంగా పనిచేస్తుందో చూడాలి.

ప్రభుత్వ సంక్షేమ పథకాల, అభివృద్ధి కార్యక్రమాలపైనే ఆయన ఆధారపడ్డారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి స్థానికంగా ఓటర్లను ఆకట్టుకున్న సత్యనారాయణ ఈసారి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా వలసలు, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కలిసివస్తుందని భావిస్తుండగా, బీజేపీ తరపున రెండోసారి పోటీలో ఉన్న కీర్తిరెడ్డి సైతం గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 

వరంగల్‌ పశ్చిమ: ఫలితమెటో.. 
వరంగల్‌ వెస్ట్‌ నుంచి వరుస విజయాలు సాధిస్తున్న దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఈసారి కూడా బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి రాజేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి రావు పద్మారెడ్డి పోటీలో ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా గెలిచిన వినయ్‌ భాస్కర్‌ ఈసారి విజయం దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, బలమైన బీఆర్‌ఎస్‌ కేడర్‌తో గట్టెక్కుతాననే ధీమా బీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్షుడిగా, ఎన్‌ఎస్‌యూఐ నేతగా పనిచేసిన రాజేందర్‌రెడ్డికి ఈసారి అధిష్టానం టికెట్‌ ఇవ్వడంతో విజయం కోసం ముమ్మరంగా శ్రమిస్తున్నారు.

ఇటీవల వచ్చిన వరదలు, జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, వరద నివారణ చర్యలు పూర్తికాకపోవడం లాంటి అంశాలు, సుదీర్ఘ కాలంగా ఒకే వ్యక్తి ఉండడంతో వచ్చే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ కష్టపడుతుండగా... బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా, ప్రతి బస్తీలో పరిచయమున్న నేతగా కేంద్ర పథకాలను ప్రచారం చేస్తూ ప్రచారంలో పద్మ దూసుకుపోతున్నారు. ముస్లిం ఓట్లు కీలకం కానున్నాయి. 

వర్ధ్దన్నపేట: విజయం ఎవరిని వరించేను? 
అత్యధిక మెజారిటీతో రెండుసార్లు విజయం సాధించిన ఆరూరి రమేశ్‌ మూడోసారి కూడా బీఆర్‌ఎస్‌ తరపున పోటీ పడుతుండగా, మాజీ పోలీసు అధికారి కేఆర్‌ నాగరాజు కాంగ్రెస్‌ తరపున, బీజేపీ తరపున కొండేటి శ్రీధర్‌ బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు కిందస్థాయి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ పార్టీలో చేరడం, కేడర్‌ను పట్టించుకోకపోవడం, నాయకులకు అందుబాటులో ఉండకపోవడం లాంటివి ప్రతికూలాంశం.

కాంగ్రెస్‌ అభ్యర్థి ఉన్నతహోదా నుంచి వచ్చిన వ్యక్తి కావడం, స్థానికంగా మంచి పేరుండడం, కాంగ్రెస్‌ కేడర్‌ బలపడడం అనుకూలాంశాలు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కొండేటి శ్రీధర్‌ 2009 ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యం ఉండడంతో ఆయన సైతం విస్తృతంగా ప్రచారం చేస్తూ విజయం కోసం కష్టపడుతున్నారు. 

ఉద్యోగాలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి 
ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలను పెద్ద ఎత్తున భర్తీ చేస్తామని చెప్పి చివరకు ప్రకటనలకే పరిమితం చేయడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశ పడ్డారు. టీచర్‌ పోస్టులతో పాటు గ్రూప్‌ ఉద్యోగాలకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని సిద్ధమైనా,  పరీక్షలన్నీ నిలిచిపోయాయి. ఉద్యోగాలు మానేసి పరీక్షలకు సిద్ధమైన నాలాంటి అభ్యర్థులు మానసికంగా ఆందోళనలో ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలంటూ ఊదరగొట్టడమే కాకుండా ఉపాధి కల్పనపైన దృష్టి సారించాలి.  – షేక్‌ నాజీమ్‌ బాబా, నిరుద్యోగి, ఏటూరునాగారం

వరదల నుంచి నగరాన్ని కాపాడాలి 
రెండేళ్ల క్రితం వచ్చిన వరదలతో నగరం విలవిలలాడింది. పట్టణమంతా నీటిలో మునిగింది. పేదలే తీవ్రంగా నష్టపోయారు. మునకకు ప్రధాన కారణం నాలాల ఆక్రమణలు.  వరదల నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. ఆక్రమణలు, నాల ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాల తొలగింపు  చేపట్టాలి.  – తిరుణహరి శేషు, వరంగల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement