
అలుగుబెల్లి నర్సిరెడ్డి(ఫైల్‌ఫోటో)
నల్లగొండ జిల్లా : వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీ గా ఉన్న ఆయన.. ఈసారి ఓటమి పాలయ్యారు. నర్సిరెడ్డిపై పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.ఓటమి అనంతరం నర్సిరెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ ఈ ఓటమి నన్ను బాధించటం లేదు. గెలుపు ఓటములు సహజం. ఓటమిని అంగీకరిస్తున్నా. గెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నాను. ఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో. ప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని తెలిపారు.
ఇది ఉపాధ్యాయుల విజయం
ఇక నర్సిరెడ్డిపై విజయం సాధించిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి సైతం అదే కౌంటింగ్ కేంద్ర వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు విలువైనది. . ఉపాధ్యాయుల విజయం మండలి సభ్యుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తా. విద్యారంగాన్ని పటిష్టం చేసేలా అవసరం అయితే ఉద్యమాలు సైతం చేస్తా. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తాను. ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తాను. నా గెలుపు ముందుగా ఊహించిందే’ అని పేర్కొన్నారు పింగళి శ్రీపాల్ రెడ్డి.