నిందితుడు పరమేశ్
రంగారెడ్డి జిల్లా రాయపోల్‌లో పరువు హత్య
సొంత అక్కను అతి కిరాతకంగా చంపిన తమ్ముడు
హయత్‌నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి
కులాంతర వివాహం,ఆస్తి తగాదాలే హత్యకు కారణమని భావిస్తున్నామన్న పోలీసులు
ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందని, అక్కపై కక్ష పెంచుకున్న తమ్ముడు ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. స్కూటీపై వెళుతున్న ఆమెను కారుతో ఢీకొట్టాడు. కిందపడిపోయిన ఆమె మెడ, చెంప భాగంలో వేట కొడవలితో దాడి చేశాడు. రక్తపు మడుగులో విలవిల్లాడిన ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం రాయపోల్ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. రాయపోల్‌కు చెందిన కొంగర నాగమణి (27) హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
ఏడేళ్ల క్రితమే ఈమెకు వివాహం జరగగా, కొద్దిరోజులకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం ఇదే గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌ను ప్రేమించి గత నెల 10న యాదగిరిగుట్టలో కులాంతర వివాహం చేసుకుంది. ముందుజాగ్రత్తగా తమకు రక్షణ కల్పించాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు ఇరు కుటుంబాలను పిలిపించి నచ్చజెప్పారు. అనంతరం దంపతులు మన్సురాబాద్‌లో కాపురం పెట్టారు. అయితే తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఊరిలో తమ కుటుంబ పరువు తీసిందని నాగమణిపై కక్ష పెంచుకున్న ఆమె తమ్ముడు పరమేశ్ అవకాశం కోసం ఎదురు చూడటం ప్రారంభించాడు.
విధులకు వెళ్తుండగా..
తన తల్లిదండ్రులు హంసమ్మ, సత్తయ్యను చూసేందుకు శ్రీకాంత్ రెండురోజుల క్రితం భార్య నాగమణితో కలిసి రాయపోల్ వచ్చాడు. సోమవారం ఉదయం హయత్‌నగర్ పీఎస్‌లో విధులకు హాజరయ్యేందుకు నాగమణి ఒక్కరే స్కూటీపై బయలుదేరారు. ఊరు దాటగానే అప్పటికే దారికాచిన పరమేశ్ కారులో వెంబడించాడు. మన్నెగూడ సబ్ స్టేషన్ జంక్షన్ వద్ద స్కూటీని కారుతో వేగంగా ఢీకొట్టి, కిందపడిన ఆమెపై దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
పరమేశ్ వెంటాడుతున్నాడని చెప్పింది
నాగమణి, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాలుగేళ్లు హాస్టల్‌లో ఉండి చదువుకుందని, ఆ సమయంలో అన్నీ తానై చూసుకున్నానని శ్రీకాంత్ తెలిపారు. యాదగిరిగుట్టలో తమ వివాహం జరిగిందని, నాగమణి పేరున ఉన్న ఎకరా భూమి తమకు వద్దని చెప్పామని కన్నీటి పర్యంతమయ్యారు. అయినా కనికరం లేకుండా అక్కను చంపాడని రోదించారు. పరమేశ్ తనను వెంటాడుతున్నాడని నాగమణి ఫోన్ చేసి చెప్పిందని, వెంటనే తన సోదరుడిని పంపించినా అప్పటికే దారుణం జరిగిపోయిందని వాపోయారు.
మా కుమారుడికి ప్రాణహాని ఉంది
సొంత అక్కనే చంపిన పరమేశ్‌తో తమ కుమారుకు శ్రీకాంత్‌కు ప్రాణహాని ఉందని హంసమ్మ, సత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌ను కూడా పరమేశ్ చంపేస్తాడంటూ రోదించారు. అతనికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్ ఎదుట బంధువులతో కలిసి ఆందోళన నిర్వహించారు. సీపీఎం నేతలు వీరికి మద్దతు తెలిపారు. కాగా పరారీలో ఉన్న పరమేశ్‌ను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు.
స్కూటీని ఢీ కొట్టినప్పుడు కారు నంబర్ ప్లేట్ ఘటనా స్థలంలో పడిపోయిందని, హత్యకు వాడిన కత్తి (వేట కొడవలి)తో పాటు నంబర్ ప్లేట్‌ను స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. కులాంతర వివాహం, ఆస్తి వ్యవహారాలే హత్యకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నామని సీఐ స్పష్టం చేశారు. అయితే నాగమణిని హత్య చేసిన తర్వాత పరమేశ్ నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పరారీలో ఉన్నాడని చెబుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment