సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పుర’పోరులో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అసలు సమరం ఆసన్నమైంది. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేనాటికి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, ఇబ్రహీం పట్నం, బడంగ్‌పేట్, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో 1,185 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్లకు చివరిరోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
నిన్నటివరకు స్తబ్దుగా సాగిన నామినేషన్ల పర్వం శుక్రవారం పోటాపోటీగా సాగింది. ఐదు మున్సిపాలిటీల పరిధిలో 576 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. బ్యాండుమేళాలు, టపాకాయలతో అభ్యర్థులు, పార్టీ నేతలు హడావుడి సృష్టించారు.
ఇక ప్రజల్లోకి..
తాజాగా నామినేషన్ల ప్రక్రియకు తెరపడడంతో ప్రచార పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు ప్రత్యర్థి వర్గాలను చిత్తుచేసేందుకు వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీల నేతలు బిజీ అయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుని చైర్మన్‌గిరీని కైవసం చేసుకునేలా నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు.
‘పుర’పోరుకు నామినేషన్లు
Published Fri, Mar 14 2014 11:10 PM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement