badangpet
-
అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది? సైలెంట్ అవ్వడం తాత్కాలికమేనా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీలో అసమ్మతి స్వరం పెరుగుతోంది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా, తాజాగా మహేశ్వరంలో మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సబితారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం అభివృద్ధే ధ్యేయమంటూ హస్తం పార్టీకి బైబై చెప్పి.. గులాబీ కండువా వేసుకున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక్కడ అధికార పార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలైన నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి అధిష్టానం హామీతో తాత్కాలికంగా సైలెంట్ అయ్యారు. కోడలు అనితారెడ్డికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టడంలో సఫలీకృతుడయ్యారు. ఇదిలా ఉండగా పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో తనకు సరైన ప్రాధాన్యః దక్కడం లేదంటూ ఇటీవల ధిక్కార స్వరం అందుకున్నారు. భగ్గుమంటున్న విభేదాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. తుక్కుగూడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్కు మెజార్టీ స్థానాలు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఆయనను చైర్మన్‌గా ఎన్నుకుంది. ఆ తర్వాత మంత్రితో చైర్మన్‌కు పొసగకపోవడంతో ఆయన టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. అధికార పార్టీ ఇక్కడ మేయర్లుగా ఎన్నికయ్యారు. వీరిలో బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత.. మంత్రి సబితకు మధ్య అంతర్గత విబేధాలు తార స్థాయికి చేరాయి. మంత్రితో పొసగక మేయర్ దంపతులు, మరో ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అసమ్మతి వర్గం కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్న సమయంలోనే అనూహ్యంగా గత మంగళవారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మంత్రినే టార్గెట్ చేస్తూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఇదంతా టీ కప్పులో తుఫాను వంటిదేనని, అన్నతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతానని సబిత ప్రకటించారు. నేతల చూపు.. కాంగ్రెస్ వైపు పరిస్థితి చక్కబడకముందే బుధవారం అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత కొత్త మనోహర్‌రెడ్డి మంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. మొదటి నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న మనోహర్‌రెడ్డితో పాటు మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు బడంగ్పేట్, మీర్‌పేటకు చెందిన మరికొందరు కార్పొరేటర్లు కూడా అసమ్మతి స్వరం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన జిల్లా అధిష్టానం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతి స్వరం పెంచిన సీనియర్లంతా త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. -
Hyderabad: కారు దిగిన మేయర్.. కాంగ్రెస్‌లో చేరిక
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్‌పేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడంగ్‌పేట కార్పొరేషన్ అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన తాను ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అహర్నిశలు కష్టపడ్డామని, అంకితభావంతో సేవలు అందించామన్నారు. ఆత్మాభిమానం చంపుకోలేకే టీఆర్ఎస్ను వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా మేయర్‌తో పాటు 23వ కార్పొరేటర్ రాళ్లగూడం సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డి సైతం టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వీరంతా సోమవారం హస్తినలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. -
TS: బీజేపీ సభ వేళ టీఆర్ఎస్కు ఊహించని షాక్
Badangpet Mayor Chigirintha Parijatha Narasimha Reddy: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్లాన్స్ రచిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో గులాబీ పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని అనివార్య, వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీలో తనకు సహాకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బడంగ్ పేట అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని ఆమె పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సమావేశాలు.. తెలంగాణ పోలీస్ అత్యుత్సాహం -
ఆ ఇద్దరూ లంచం తీసుకుంటూ దొరికిపోయారు!
హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దొరికిపోయారు. సరూర్ నగర్ మండలం బడంగ్‌పేట నగర పంచాయతీపై ఏసీబీ అధికారులు ఈరోజు దాడి చేశారు. కమిషనర్ త్రిలేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ నరేష్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.72వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి రూ.23,57,752 బిల్లు మంజూరు కోసం ఎన్.శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ నుంచి కమిషనర్, సీనియర్ అసిస్టెంట్ ఇద్దరూ కలిపి 3 శాతం కమిషన్, సుమారు రూ.72వేలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం నెలరోజులుగా కాంట్రాక్టర్‌ను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నట్టు సమాచారం. -
లంబో ‘ధర’ం
* వేలం పాటలో రికార్డు స్థాయి ధర పలికిన గణపతి లడ్డూలు హైదరాబాద్: భక్తుల కొంగుబంగారం.. లంబోదరుని మహా ప్రసాదం. సోమవారం రాజధాని వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేలం పాటల్లో గణపతి లడ్డూలు రికార్డు స్థాయి ధర పలికాయి. చారిత్రక ప్రసిద్ధి పొందిన బాలాపూర్ వినాయకుని లడ్డూను అదే ప్రాంతానికి చెందిన సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి రూ.9.50 లక్షలకు దక్కించుకున్నారు. లడ్డూల వేలంలో బాలాపూర్ గణపతితో పోటీపడే బడంగ్‌పేట విఘ్నేశ్వరుని లడ్డూ ఈసారి అమాంతం తగ్గిపోయింది. గతేడాది రూ.6.30 లక్షలు పలికిన ఈ లడ్డూ ధర ఈసారి రూ.4.05 లక్షలకు పడిపోయింది. దీనిని బడంగ్‌పేట నగర పంచాయతీ అధ్యక్షుడు (టీఆర్ఎస్) కర్రె కృష్ణ దక్కించుకున్నారు. లడ్డూని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు అంకితమిస్తున్నట్టు కృష్ణ ప్రకటించారు. ఈసారి గణపతి లడ్డూలను దక్కించుకునేందుకు ముస్లింలు సైతం ముందుకు రావడం విశేషం. -
రూ. 9.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
హైదరాబాద్ : ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది రూ.9.50 లక్షలు పలికింది. ఆది నుంచి పోటా పోటీగా సాగిన వేలం పాటలో బాలాపూర్ లంబోదరుడి లడ్డూను సింగిరెడ్డి జయేందర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రూ.116 నుంచి ప్రారంభమైన వేలం పాట ...చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 24మంది భక్తులు పోటీ పడ్డారు. చివరకు గణేష్ లడ్డూ సింగిరెడ్డి జయేందర్ రెడ్డిని వరించింది. గత ఏడాది రూ.9.26 లక్షల పలికిన ఈ లడ్డూ ఈసారి మరో 24వేల అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోంది. కాగా బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ యానంలో ఏయేటికాయేడు చరిత్రను సృష్టిస్తోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో పలికిన లడ్డూ ఆ తరువాత లక్షలకు చేరటం విశేషం. -
అందరి దృష్టి బాలాపూర్ వైపే
*బాలాపూర్ లడ్డూ కోసం ఏటా పెరుగుతోన్న ఆదరణ * నేటి వేలంపై ఆసక్తి బడంగ్‌పేట లడ్డూ కూడా.. హైదరాబాద్ : సామూహిక గణేశ్ నిమజ్జనం వేళ అందరి దృష్టి బాలాపూర్ వైపు మళ్లింది. ఇక్కడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు తీవ్రంగా పోటీపడుతుంటారు. లడ్డూను దక్కించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. లక్షలు వెచ్చించి లడ్డూను సొంతం చేసుకునేందుకు ఆసక్తిచూపుతారు. సోమవారం నిమజ్జన ఊరేగింపు ప్రారంభానికి ముందు ఇక్కడ లడ్డూను వేలం వేస్తారు. ఈసారి అది ఎవరి సొంతం అవుతుందోనని నగరవాసులంతా ఎదురుచూస్తున్నారు. లడ్డూ ప్రస్థానం ఇలా.. ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ యానంలో ఏయేటికాయేడు చరిత్రను సృష్టిస్తోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో పలికిన లడ్డూ ఆ తరువాత లక్షలకు చేరింది. బాలాపూర్‌లో పదేళ్ల కాలంలో లడ్డూను సొంతం చేసుకున్న వారు.. సం. దక్కించుకున్న వారు మొత్తం రూ. లక్షల్లో 2004 కొలను మోహన్‌రెడ్డి రూ.2.01 2005 ఇబ్రాం శేఖర్ రూ.2.08 2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ.3.00 2007 జి.రఘునందనాచారి రూ.4.15 2008 కొలను మోహన్‌రెడ్డి రూ.5.07 2009 సరిత రూ.5.10 2010 శ్రీధర్‌బాబు రూ.5.30 2011 కొలను ఫ్యామిలీ రూ.5.45 2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ.7.50 2013 టీకేఆర్ విద్యాసంస్థలు మీర్‌పేట రూ.9.26 బడంగ్‌పేట లడ్డూకూ ఆదరణ.. బాలాపూర్ తరువాత బడంగ్‌పేట గణనాథుడి లడ్డూకు అంతటి డిమాండ్ ఉంది. ఇక్కడి లడ్డూను వేలంలో లక్షల రూపాయలకు సొంతం చేసుకుంటున్నారు భక్తులు. ఇక్కడ 1966 నుంచి మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకున్ని ప్రతిష్ఠిస్తున్నారు. 1995 నుంచి లడ్డూను వేలం వేస్తున్నారు. మొదటిసారి వేలం పాటలో అప్పటి గ్రామ సర్పంచ్ ఆశంగారి నిర్మలానర్సింహారెడ్డి రూ.7,200లకు అడ్డూను సొంతం చేసుకున్నారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆ యేడు వేలం పాట నిర్వహించలేదు. రూ.7,200తో మొదలైన లడ్డూ వేలం ఏటా పెరుగుతూ లక్షల్లోకి చేరింది. ఈసారి ఆ లడ్డూ ఎవరి సొంతం అవుతుందనే ఆసక్తి నెలకొంది. మీరాలం మండిలో 108 ఏళ్లుగా.. నిజాం కాలంలో కూరగాయల విక్రయానికి ప్రధాన కేంద్రంగా కొనసాగిన మీరాలం మండిలో 108 ఏళ్ల నుంచి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజుల్లో ఇక్కడ గాజుల వెంకయ్య, బోగం మల్లయ్య, ఆవులు దుర్గయ్య, కాట నర్సయ్య తదితరులు వినాయక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి తొమ్మిది రోజులపాటు పూజించి గులాబ్‌చంద్ బాడలోని బావిలో నిమజ్జనం చేసేవారు. 1986 నుంచి గాజుల అంజయ్య ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. -
‘పుర’పోరుకు నామినేషన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పుర’పోరులో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక అసలు సమరం ఆసన్నమైంది. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేనాటికి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, ఇబ్రహీం పట్నం, బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో 1,185 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్లకు చివరిరోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నిన్నటివరకు స్తబ్దుగా సాగిన నామినేషన్ల పర్వం శుక్రవారం పోటాపోటీగా సాగింది. ఐదు మున్సిపాలిటీల పరిధిలో 576 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. బ్యాండుమేళాలు, టపాకాయలతో అభ్యర్థులు, పార్టీ నేతలు హడావుడి సృష్టించారు. ఇక ప్రజల్లోకి.. తాజాగా నామినేషన్ల ప్రక్రియకు తెరపడడంతో ప్రచార పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు ప్రత్యర్థి వర్గాలను చిత్తుచేసేందుకు వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీల నేతలు బిజీ అయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుని చైర్మన్‌గిరీని కైవసం చేసుకునేలా నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు.