అందరి దృష్టి బాలాపూర్ వైపే
*బాలాపూర్ లడ్డూ కోసం ఏటా పెరుగుతోన్న ఆదరణ
* నేటి వేలంపై ఆసక్తి బడంగ్‌పేట లడ్డూ కూడా..
హైదరాబాద్ : సామూహిక గణేశ్ నిమజ్జనం వేళ అందరి దృష్టి బాలాపూర్ వైపు మళ్లింది. ఇక్కడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు తీవ్రంగా పోటీపడుతుంటారు. లడ్డూను దక్కించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. లక్షలు వెచ్చించి లడ్డూను సొంతం చేసుకునేందుకు ఆసక్తిచూపుతారు. సోమవారం నిమజ్జన ఊరేగింపు ప్రారంభానికి ముందు ఇక్కడ లడ్డూను వేలం వేస్తారు. ఈసారి అది ఎవరి సొంతం అవుతుందోనని నగరవాసులంతా ఎదురుచూస్తున్నారు.
లడ్డూ ప్రస్థానం ఇలా..
ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల సుదీర్ఘ యానంలో ఏయేటికాయేడు చరిత్రను సృష్టిస్తోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో పలికిన లడ్డూ ఆ తరువాత లక్షలకు చేరింది.
బాలాపూర్‌లో పదేళ్ల కాలంలో లడ్డూను సొంతం చేసుకున్న వారు..
సం. దక్కించుకున్న వారు మొత్తం రూ. లక్షల్లో
2004 కొలను మోహన్‌రెడ్డి రూ.2.01
2005 ఇబ్రాం శేఖర్ రూ.2.08
2006 చిగురింత తిరుపతిరెడ్డి రూ.3.00
2007 జి.రఘునందనాచారి రూ.4.15
2008 కొలను మోహన్‌రెడ్డి రూ.5.07
2009 సరిత రూ.5.10
2010 శ్రీధర్‌బాబు రూ.5.30
2011 కొలను ఫ్యామిలీ రూ.5.45
2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ.7.50
2013 టీకేఆర్ విద్యాసంస్థలు మీర్‌పేట రూ.9.26
బడంగ్‌పేట లడ్డూకూ ఆదరణ..
బాలాపూర్ తరువాత బడంగ్‌పేట గణనాథుడి లడ్డూకు అంతటి డిమాండ్ ఉంది. ఇక్కడి లడ్డూను వేలంలో లక్షల రూపాయలకు సొంతం చేసుకుంటున్నారు భక్తులు. ఇక్కడ 1966 నుంచి మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకున్ని ప్రతిష్ఠిస్తున్నారు. 1995 నుంచి లడ్డూను వేలం వేస్తున్నారు. మొదటిసారి వేలం పాటలో అప్పటి గ్రామ సర్పంచ్ ఆశంగారి నిర్మలానర్సింహారెడ్డి రూ.7,200లకు అడ్డూను సొంతం చేసుకున్నారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడంతో ఆ యేడు వేలం పాట నిర్వహించలేదు. రూ.7,200తో మొదలైన లడ్డూ వేలం ఏటా పెరుగుతూ లక్షల్లోకి చేరింది. ఈసారి ఆ లడ్డూ ఎవరి సొంతం అవుతుందనే ఆసక్తి నెలకొంది.
మీరాలం మండిలో 108 ఏళ్లుగా..
నిజాం కాలంలో కూరగాయల విక్రయానికి ప్రధాన కేంద్రంగా కొనసాగిన మీరాలం మండిలో 108 ఏళ్ల నుంచి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజుల్లో ఇక్కడ గాజుల వెంకయ్య, బోగం మల్లయ్య, ఆవులు దుర్గయ్య, కాట నర్సయ్య తదితరులు వినాయక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించి తొమ్మిది రోజులపాటు పూజించి గులాబ్‌చంద్ బాడలోని బావిలో నిమజ్జనం చేసేవారు. 1986 నుంచి గాజుల అంజయ్య ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.