అల్వాల్: నగరశివారులో ఉన్న బాలాపూర్ గణపతి మండపంలోని లడ్డూ వేలంపాటలో ఈసారి రూ.24.60 లక్షలు పలుకగా, అల్వాల్ కానాజీగూడ లడ్డూ దానిని బ్రేక్ చేసింది. కానాజీగూడకు చెందిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ మండపంలో లడ్డూను నగరానికి చెందిన డాక్టర్ తాళ్లూరు వెంకట్రావు, గీతప్రియ దంపతులు రూ.45,99,999కి దక్కించుకున్నారు. వెంకట్రావు విదేశాలలో లార్డ్ ఇన్‌స్టిట్యూషన్స్, లోక్‌ప్రదీప్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు.
ఈ దంపతులు ఆ ఆలయానికి గత కొంతకాలంగా భక్తులుగా ఉన్నారు. గతేడాది కూడా వీరే రూ.17,81,999కు ఇక్కడి లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి కూడా పలువురు వేలంపాటలో పాల్గొనగా, చివరికి వెంకట్రావు దంపతులే రికార్డు స్థాయిలో పాటపాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. మరకత గణపతిపై అచంచల విశ్వాసం ఉందని, ఈ లడ్డూను దక్కించుకోవడం వల్ల తమకు మరింత మేలు జరుగుతుందన్న విశ్వాసం ఉందని వారు అన్నారు. వేలం ద్వారా వచ్చిన లడ్డూ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, నిత్యాన్నదానానికి ఉపయోగిస్తామని ఆలయ నిర్వాహకులు మోత్కూరు సత్యనారాయణశాస్త్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment