బడంగ్‌పేట్: వినాయక చవితి వచ్చిందంటే ఇటు ఖైరతాబాద్ మహాగణపతి, అటు బాలాపూర్ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. బాలాపూర్ గణనాథుడికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గణనాథుడి వెంటే నగరంలోని పెద్ద గణపతులు నిమజ్జనానికి బయలుదేరుతాయి. ఈ విఘ్నేశుడికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈయన లడ్డూకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. లడ్డూ దక్కించుకునేందుకు పోటీ పెద్ద ఎత్తున ఉంటుంది. రూ.వందలతో మొదలైన ఈ లడ్డూ ప్రస్థానం ఇప్పుడు రూ.లక్షలకు చేరింది.
బాలాపూర్ గణేశుడి లడ్డూ భక్తులకు కొంగుబంగారమైంది. లక్కీ లడ్డూగా కీర్తినందుకొంది. తాము దక్కించుకున్న లడ్డూను పంటపొలాల్లో చల్లి అధిక దిగుబడులు సాధించామని, వ్యాపారంలోనూ లాభాలు ఆర్జించామని భక్తులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో లడ్డూపై భక్తులకు నమ్మకం, విశ్వాసం పెరిగిపోయాయి. దీనిని కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూగా బాలాపూర్ వాసులు పేర్కొంటారు.
1980లో ప్రస్థానం ప్రారంభం...
బాలాపూర్ గణనాథుడి ప్రస్థానం 1980లో ప్రారంభమైంది. అయితే 1994 నుంచి లడ్డూ వేలంపాట మొదలైంది. 1994లో రూ.450 పలికిన తొలి లడ్డూ... 2017లో రూ.15.60 లక్షలకు చేరుకుంది. మరి ఈసారి ఎంత ధర పలుకుతుందోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో బాలాపూర్ వాసులు మద్యం, మాంసాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. గణేశుడి లడ్డూను కూడా ప్రతిరోజు ప్రత్యేకంగా పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో లడ్డూ వేలంపాట వేసే సంప్రదాయం బాలాపూర్ గణనాథుడి నుంచే ప్రారంభమైంది. ఇక ఈ గణనాథుడి నిమజ్జన శోభాయాత్రకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
లడ్డూ ఫ్రమ్ తాపేశ్వరం...
బాలాపూర్ లడ్డూను తొలుత చార్మినార్‌లోని గుల్‌జల్ ఆగ్రా స్వీట్ హౌస్ వారు తయారు చేసేవారు. బరువు 21 కిలోలు ఉండేది. అయితే గత నాలుగేళ్లుగా అంతే బరువుతో తాపేశ్వరంలోని హనీ ఫుడ్స్ లడ్డూను తయారు చేస్తోంది. వేలంపాట విజేతకు లడ్డూను ఉంచే రెండు కిలోల వెండి గిన్నెను ఇస్తున్నట్లు హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వర్ తెలిపారు.
దేవాలయాల అభివృద్ధి...
వేలంపాట డబ్బులతో గ్రామంలో నూతనంగా శ్రీఆంజనేయస్వామి సహిత వేంకటేశ్వరస్వామి, లక్ష్మీ గణపతి దేవాలయాన్ని సుందరంగా నిర్మించారు. అదే విధంగా గ్రామంలోని పురాతన వేణుగోపాలస్వామి, శివాలయం తదితర దేవాలయాల ఆధునికీకరణకు వేలంపాట నిధులు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment