సాక్షి, వికారాబాద్: తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. సెల్‌ఫోన్‌ను లోపలికి అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వశ్చన్ పేపర్ లీకేజ్‌పై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.
ముగ్గురు సస్పెండ్
పేపర్ లీక్ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ బందప్ప, మరొకరిపై వేటు వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా పేపర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో లీక్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. 2017లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పాఠశాల గదిలో ఒక విద్యార్థినిని వేధించడంతో కేసు నమోదు చేశారు. బందప్ప భార్య అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది.
కేసు నమోదు
టెన్త్ పేపర్ బయటకు పంపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే పేపర్ ఎక్కడా లీక్ కాలేదని పోలీసులు చెబుతున్నారు. పరీక్ష మొదలైన తర్వాతే పేపర్ బయటకు వచ్చిందని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్‌ను మీడియా గ్రూప్‌లో పెట్టిన్నట్లు గుర్తించారు. ఉదయం 9:30 గంటలకు పదో తరగతి పరీక్ష ప్రారంభమవ్వగా.. 9:37 గంటలకు పేపర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో షేర్‌చేశారని పోలీసులు తెలిపారు. ఎగ్జామ్ హాల్‌నుంచి పేపర్ పంపినందుకు ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
టెన్త్ పేపర్ లీక్ కలకలం
ఆదివారం ఉదయం వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పేపర్ బయటకు లీక్ కావడం, వాట్సప్‌లో వైరల్ కావడంపై తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసు శాఖతోపాటు విద్యాశాఖ విచారణ ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment