సాక్షి,హైదరాబాద్: సంచలనం సృష్టించిన రియల్టర్ల జంట హత్యల కేసును రాచకొండ పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఇబ్రహీంపట్నం చెర్లపటేల్‌గూడలో నెలకొన్న భూ వివాదాలే హత్యలకు కారణమని విచారణలో బయటపడింది. హత్యలో ప్రధాన సూత్రధారి చైతన్యపురి కమలానగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేరెడ్డి మట్టారెడ్డి అలియాస్ మేరెడ్డి అశోక్‌రెడ్డి/సత్తిరెడ్డి/ భద్రి/ఏవీ రమణ, కృష్ణా జిల్లా జగన్నాథపురానికి చెందిన ఖాజా మోహియుద్దిన్, మెదక్ కొండపాక మేదిరిపూర్‌కు చెందిన బుర్రి భిక్షపతి, సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్‌కు చెందిన సయ్యద్ రహీమ్, బిహార్ రాష్ట్రం సివాన్ జిల్లా టెటారియా గ్రామానికి చెందిన సమీర్ అలీ, రాజు ఖాన్‌లను అరెస్ట్ చేశారు.
హత్యలో వినియోగించిన రెండు తుపాకులను తయారు చేసిన చందన్ సిబాన్, సోనూలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 19 లైవ్ రౌండ్లున్న రెండు 7.65 ఎంఎం తుపాకులు, రెండు ఖాళీ కాట్రిడ్జ్‌లు, బుల్లెట్ వెహికిల్, కారు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తి వివరాలను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ గురువారం మీడియాకు వెల్లడించారు.
ఇదీ వివాదం..
చర్లపటేల్‌గూడ గ్రామంలో 1369, 1370, 1371, 1372 సర్వే నంబర్లలోని భూమిని 20 ఏళ్ల క్రితం లేఅవుట్ చేశారు. వీటిలో చాలా మంది ఉద్యోగులు, ప్రవాసులు వాయిదా పద్ధతిలో కొనుగోలు చేశారు. ఈ లేవుట్ శివారు ప్రాంతంలో ఉండటంతో కొనుగోలుదారులు వారి ప్లాట్లను తనిఖీ చేయడం, చూసుకోవటం వంటివి చేయలేదు. 2014లో మట్టారెడ్డి ఈ వెంచర్‌లో 1111 గజాల చొప్పున నాలుగు ప్లాట్లను కొనుగోలు చేశాడు. ఇందులో ఫామ్ హౌస్ కట్టుకోవటంతో పాటు జామ తోటను పెంచాడు. ఆ తర్వాత 2018లో మరో నాలుగు ప్లాట్ల కొనుగోలు చేశాడు. ఈ సర్వే నంబర్ల పక్కనే ఉన్న 14 ఎకరాల 10 గుంటల భూమిని మృతుడు నవారి శ్రీనివాస్ రెడ్డి తన డ్రైవర్ దూడల కృష్ణ పేరు మీద కొనుగోలు చేశాడు.
భూ యజమానులైన శాంతాకుమారి, ఎం పురుషోత్తం రెడ్డిలతో అగ్రికల్చర్ ల్యాండ్ లీజు ఒప్పందం చేసుకున్నాడు.
అప్పట్నుంచి తన పార్ట్‌నర్ రాఘవేందర్ రెడ్డితో కలిసి రోజూ వ్యవసాయ భూమికి వచ్చేవాడు. ఈ క్రమంలో లేక్ విల్లా ఆర్చిడ్స్‌లో ప్లాట్ ఓనర్లు స్థానికంగా ఉండకపోవటాన్ని అవకాశంగా మలుచుకున్న శ్రీనివాస్‌రెడ్డి.. ఆ ప్లాట్ల లావాదేవీలలో తలదూర్చడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మట్టారెడ్డికి శ్రీనివాస్‌రెడ్డి మధ్య వైరం మొదలైంది. ప్లాట్ ఓనర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ తక్కువ ధరకు ప్లాట్లను కొనుగోలు చేస్తున్న మట్టారెడ్డికి శ్రీనివాస్ రెడ్డి వెంచర్‌లోకి ఎంటర్ కావటం నచ్చలేదు. వెంచర్‌లో అభివృద్ధి పనులకు తరుచూ అడ్డుతగులుతుండటంతో ఎలాగైనా శ్రీనివాస్ రెడ్డిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
బుల్లెట్‌పై ఒకరు, బస్సులో మరొకరు..
ఈ నెల 1న ఉదయం 6 గంటలకు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు ఏపీ09 ఏడబ్ల్యూ 0047 కారులో తమ వ్యవసాయ భూమికి వెళ్లారు. ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి కారు నడుపుతున్నాడు. అప్పటికే అక్కడ కాపు కాస్తున్న ఖాజా మోహియుద్దీన్, భిక్షపతిలు లిఫ్ట్ కావాలని అడిగారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి కారు ఆపగా.. ఆయన తలపై ఖాజా మోహియుద్దీన్ తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. దీంతో తనని తాను రక్షించుకునేందుకు శ్రీనివాస్‌రెడ్డి కారు దిగి పారిపోతుండగా.. ఖాజా అతన్ని వెంబడించి కాల్పులు జరిపాడు.
శ్రీనివాస్‌రెడ్డి అక్కడిక్కడే కుప్పకూలాడు. శ్రీనివాస్‌రెడ్డి పారిపోతున్న సమయంలో పక్క సీటు నుంచి డ్రైవర్ సీటులోకి వచ్చిన రాఘవేందర్ రెడ్డిపై భిక్షపతి కాల్పులు జరిపాడు. ఛాతీలోకి బుల్లెట్ దిగిన రాఘవేందర్ రెడ్డి అపస్మారక స్థితిలో కారును నడిపే ప్రయత్నం చేయగా.. వాహనం ఆగిపోయింది. కాల్పుల తర్వాత నిందితులు ఇద్దరూ మట్టారెడ్డి ఫామ్ హౌస్‌కు వెళ్లి ‘పని పూర్తయిందని’ తెలిపి, తుపాకులను అక్కడే పెట్టేసి వెళ్లిపోయారు. ఖాజా తన బుల్లెట్ వాహనంలో పారిపోగా.. భిక్షపతి నడుచుకుంటూ వెంచర్ నుంచి బయటికి వచ్చి బస్సు ఎక్కి ఇంటికి వెళ్లిపోయాడు.
మట్టారెడ్డి నేరచరితుడే..
ఈ హత్య కేసులో సూత్రధారి అయిన మేరెడ్డి మట్టారెడ్డి కూడా నేరచరితుడే. ఇతని మీద నారాయణగూడ, మలక్‌పేట, సరూర్‌నగర్ పీఎస్‌లలో మూడు చీటింగ్ కేసులున్నాయి. కర్మన్‌ఘాట్‌లో సొంత అపార్ట్‌మెంట్‌తో పాటూ ఇతర ప్రాంతాల్లో మొత్తం 78 ఎకరాల భూములు ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. నాలుగు లగ్జరీ కార్లున్నాయి.
యూట్యూబ్‌లో చూసి..
హత్యకు 20 రోజుల ముందే బిహార్ నుంచి రెండు తుపాకులను కొనుగోలు చేశారు. గతంలో ఖాజా మోహియుద్దీన్, భిక్షపతిలకు తుపాకీ పట్టుకున్న అనుభవం లేకపోవటంతో ఇద్దరూ యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నారని, ఫిబ్రవరి 28నే హత్యకు ప్రయత్నించగా విఫలమైందని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. లేక్‌విల్లా ఆర్చిడ్స్‌లో చాలా వరకు ప్లాట్లు 2–3 రిజిస్ట్రేషన్లు జరిగాయని, అసోసియేషన్ ప్రతినిధులను విచారించి, ఈ హత్య కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉందని ఆరా తీసి వారిని కూడా అరెస్ట్ చేస్తామని సీపీ పేర్కొన్నారు.
పోలీసులకు దృశ్యం సినిమా చూపించిన మట్టారెడ్డి
హత్య జరిగిన రోజు ఘటన స్థలంలో ఉన్న మట్టారెడ్డిపై మృతుల కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడంతో వెంటనే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణకు ఏమ్రాతం సహకరించలేదని సీపీ తెలిపారు. తమ మధ్య చంపుకొనేంత విభేదాలు లేవని పదే పదే వ్యాఖ్యానించినట్లు చెప్పారు. విచారణలో మట్టారెడ్డికి ఫామ్ హౌస్ ఉందని విషయం పోలీసులకు తెలిసింది. దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులకు.. ఫామ్‌హౌస్‌లో సీసీ కెమెరా కనిపించింది. ఫుటేజ్‌ను పరిశీలించగా.. హత్య జరిగిన అనంతరం పచ్చ చొక్కా వేసుకున్న వ్యక్తి ఫామ్ హౌస్‌లోకి హడావుడిగా రావటం కనిపించింది. ఆ వ్యక్తిని ఆరా తీయగా.. శ్రీనివాస్ రెడ్డిపై కాల్పులు జరిపిన ఖాజా మోహియుద్దీన్ అని తేలింది.
బిహార్‌లో తుపాకుల కొనుగోలు..
లేక్‌విల్లా ఆర్చిడ్స్ వాచ్‌మన్ ఖాజా మోహియుద్దీన్‌తో కలిసి మట్టారెడ్డి శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డిల హత్యకు పథకం రచించాడు. ఇందుకోసం ఖాజా.. తన స్నేహితుడైన బుర్రి భిక్షపతి సహాయం తీసుకున్నాడు. హత్య చేసేందుకు వీరిరువురికీ తలా 1,111 గజాల ప్లాట్‌ను ఇస్తానని మట్టారెడ్డి హామీ ఇచ్చాడు. తుపాకుల కోసం ఆరా తీయగా.. తన మామ సయ్యద్ రహీంకు బిహార్ గ్యాంగ్‌లతో పరిచయం ఉందని, తుపాకులు సమకూరుస్తాడని తెలపడంతో మట్టారెడ్డి రూ.1.20 లక్షల నగదు ఇచ్చాడు. కారులో బిహార్‌కు వెళ్లి సమీర్ అలీ నుంచి రెండు తుపాకులను కొనుగోలు చేశారు. వీటిని బిహార్‌కు చెందిన చందన్ సిబాన్, సోనులు తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment