కరెంటు కోతల వ్యథ | power cuts effects on Micro-, small-scale industries | Sakshi
Sakshi News home page

కరెంటు కోతల వ్యథ

Published Sun, May 11 2014 11:41 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

power cuts effects on Micro-, small-scale industries

 పరిగి/ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: రోజురోజుకూ తీవ్రమవుతున్న కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కరెంటు సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండుముఖం పడుతుండగా, పరిశ్రమలు, పౌల్ట్రీఫాంలు కుదేలవుతున్నాయి. పరిశ్రమలకు వారంలో ఒక రోజు పూర్తిగా కరెంటు సరఫరా నిలిపివేయడంతోపాటు సాధారణ రోజుల్లోనూ భారీ మొత్తంలో కోతలు విధిస్తున్నారు. రైతులకు అధికారికంగా ఆరు గంటలు కరెంటు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

అయితే రోజుకు మూడు గంటలకు మించి కరెంటు రావడం లేదని, అది కూడా విడతల వారీగా పగలు, రాత్రి సమయాల్లో సరఫరా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ మూడు గంటల కరెంటు కోసం రాత్రీ పగలూ తేడా లేకుండా పొలాల్లోనే జాగారం చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలతో నీరందక వరి, జొన్న, కూరగాయల పంటలు ఎండిపోతున్నాయన్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు కాస్త ఉపశమనాన్ని కలిగించాయన్నారు.

 ఒక్కో పరిశ్రమకు లక్షల్లో నష్టం
 కరెంటు కోతలతో పరిశ్రమలపై కోలుకోలేని దెబ్బపడుతోంది. పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోనె అత్యధికంగా పరిశ్రమలు, పౌల్ట్రీఫాంలు ఉన్న నియోజకవర్గం పరిగి. పూడూరు మండలంలో అగరబత్తీల కంపెనీ, టెక్స్‌టైల్స్ పరిశ్రమతో, బోన్స్‌ఫాక్టరీ, మరోస్టీల్ ఫ్యాక్టరీ ఉన్నాయి. పరిగి మండలంలో నాలుగు స్టీల్ ఫ్యాక్టరీలు, ఓ ప్లైవుడ్ కంపెనీతో కలుపుకొని ఐదు పరిశ్రమలున్నాయి. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలో ఒక్కోదానిలో 50 వేల నుంచి లక్ష వరకు కోళ్లను పెంచుతున్న ఆరు పెద్ద పౌల్ట్రీఫాంలు, మరో 15 చిన్న పౌల్ట్రీఫాంలు, 20 రైస్ మిల్లులు ఉన్నాయి. కరెంటు కోతలతో నెలకు ఒక్కో స్టీల్ ఫ్యాక్టరీకి రూ. 20 వేల నుంచి రూ. 30వేల వరకు నష్టం వాటిల్లుతోందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతల సమయంలో జనరేటర్లు వినియోగిస్తుండటంతో తమపై రోజుకు రూ. 15వేల అదనపు భారం పడుతుందని పౌల్ట్రీఫాంల యజమానులు చెబుతున్నారు.

 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలదీ అదే పరిస్థితి...
 పరిగి పట్టణంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో  ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ, చిన్నతరహా  పరిశ్రమలు కరెంటు కోతలతో దివాల తీస్తున్నాయి. వెల్డింగ్ షాపులు, మెకానిక్‌షెడ్లు, జిరాక్స్, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లు, మోటార్ వైండింగ్ దుకాణాల యజమానులు కరెంటు కోతలతో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. అంతేకాకుండా ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు కూడా ఉపాధి కోల్పోతున్నారు.

 ప్రత్యామ్నాయం..
 కరెంటు కోతల వల్ల చిరు వ్యాపారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గురించి ఆలోచిస్తున్నారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి ధర అధికంగా వుండటం.. ఆదాయానికి మించి వుండటంతో వీటి ఏర్పాటులో ఆచి తూచి అడుగేస్తున్నారు. మండల కేంద్రంలో జిరాక్స్ షాప్ నిర్వహించే ఓ చిరు వ్యాపారి ఇటీవల రూ.90వేలు పెట్టి జనరేటర్ కొనుగోలు చేశాడు. దానికయ్యే ఖర్చులో పావు వంతు కూడా వచ్చే పరిస్థితులు కనబడటం లేదని వాపోతున్నాడు. మంగల్‌పల్లిగేట్ సమీపంలో వుండే ఇంటర్నెట్ షాపు నిర్వహుకుడొకరు ఇన్వర్టర్ సహాయంతో ఇంటర్నెట్ నిర్వహిస్తున్నాడు. కరెంటు కోతలను దృష్టిలో ఉంచుకుని రూ. 45వేలు పెట్టి ఇన్వర్టర్ తీసుకున్నాడు. వీటి నిర్వహణ ఎక్కువగా ఉందని ఆయన ఇన్వర్టర్‌ను అమ్మేసేందుకు సిద్ధమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement