Small-scale industry
-
లీజ్ గడువు తగ్గింపు
‘కేఎస్‌ఎస్‌ఐడీసీ’ సువర్ణమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు: రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందజేసే భూమికి సంబంధించిన ‘లీజ్’ సమయాన్ని 99ఏళ్ల కంటే తక్కువ చేసే యోచన ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిపి త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు తెలిపారు. మంగళవారమిక్కడి సెంట్రల్ కాలేజ్ ఆవరణలో నిర్వహించిన కర్ణాటక స్టేట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(కేఎస్‌ఎస్‌ఐడీసీ) సువర్ణ మహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలకు ఇస్తున్న భూమి లీజు వ్యవధి 99 ఏళ్లుగా ఉంది. దీన్ని మరో 10 సంవత్సరాలు తగ్గిస్తూ(అంటే 89ఏళ్ల వ్యవధి)నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ కేఎస్‌ఎస్‌ఐడీసీ అధ్యక్షుడు గురప్ప నాయుడు చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అనుసరించి తాము కూడా లీజ్ వ్యవధిని తగ్గించే దిశగా ప్రణాళికలు రచిస్తామని పారిశ్రామిక వేత్తలకు హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిశ్రమల స్థాపనకు సహాయ సహకారాలు అందించడంలో కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు ట్రేడ్ లెసైన్స్ పొందడం నుంచి రాయితీలు కల్పించామని, త్వరలోనే ఈ అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిపారు. ఏ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హీరో సంస్థ తెలంగాణకు తరలిపోవడంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ... కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ప్రారంభమయ్యే పరిశ్రమలకు వివిధ రాయితీలను కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిన నేపథ్యంలోనే ఆ కంపెనీ ఇక్కడి నుంచి తరలిపోయిందని తెలిపారు. కాగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించనందున తిరిగి ఆ సంస్థ కర్ణాటకకే వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక మహారాష్ట్రలోని కొల్హాపురకు చెందిన కొన్ని పరిశ్రమలు బెళగావిలో తమ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు పరిశ్రమలకు నిరంతర విద్యుత్ మంత్రి డి.కె.శివకుమార్ వెల్లడి సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని పరిశ్రమలకు 24గంటల పాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఇం దన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ వెల్లడించారు. మంగళవారమిక్కడి కేఎస్‌ఎస్‌ఐడీసీ సువర్ణమహోత్సవలో ఆయన మాట్లాడారు. రానున్న ఆరు నెలల్లో రాష్ట్రంలో విద్యుత్ కొరతను పూర్తిగా నివారించనున్నట్లు తెలిపారు. అనంతరం పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యేక ఫీడర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కాగా, బెంగళూరులోని జిగణి పారిశ్రామిక ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే తీగల ఏర్పాటుకు స్థలాభావం ఎదురవుతోందని, సొరంగ మార్గంలో విద్యుత్ తీగలను ఏర్పాటు చేయాలంటే సాధారణ ఖర్చుతో పోలిస్తే 800రెట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు. అయినా కూడా అన్ని సమస్యలను అధిగమించి పరిశ్రమలకు 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందజేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. -
7 కాదు 3 గంటలే!
పరిగి, న్యూస్‌లైన్: విద్యుత్ కోతలు అన్ని వర్గాలను గుండెకోతకు గురిచేస్తున్నాయి. ఇటు వ్యవసాయంపై, అటు చిన్నతరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవంగా అందుతున్నది మాత్రం మూడు గంటల కరెంటే. కొన్ని ప్రాంతాల్లోనైతే 2 గంటల విద్యుత్తుతోనే రైతులు సరిపెట్టుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వరి నాట్ల సమయంలో విధించిన కోతలతో పొలాలకు నీరందడంలేదు. ప్రస్తుతం కరెంటు కోతలతో బోరుబావుల కింద కూరగాయాలు తదితర పంటలు సాగు చేస్తున్న రైతులు విలవిల్లాడుతున్నారు. పైనుంచే మూడు గంటలకు మించి కరెంటు రాకపోతుండగా స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఈ విషయం గురువారం నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో స్పష్టంగా కనిపించింది. కోతలకు బయపడి రైతులు ఎకరం, అరెకరం మాత్రమే సాగు చేసుకుంటుండగా.. సాగు చేసిన కాస్త పొలంకూడా పారటంలేదు. దీంతో నియోజకవర్గంలో సాగు ప్రమాదంలో పడింది. పరిగి నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి కరెంటు కోతలపై నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. మండలానికి ఓ గ్రామం చొప్పున ఎంచుకుని రైతుల ద్వారా సమాచారం సేకరించగా ఎక్కడా మూడు గంటలకు మించి కరెంటు సరఫరాచేసిన దాఖలాలు లేవు. పరిగి మండలంలోని మిట్టకోడూర్‌లో కేవలం మూడు గంటలు మాత్రమే త్రీఫేజ్ కరెంటు రాగా అందులోనూ ఐదారుసార్లు ట్రిప్పయ్యింది. పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్లో మొత్తం 110 బోరుబావులు, బావులు ఉన్నాయి. వీటికింద 250 ఎకరాల వరకు పంటలు సాగవుతున్నాయి. గురువారం ఆ గ్రామంలో రోజు మొత్తంలో రెండు గంటలు మాత్రమే కరెంటు సర ఫరా చేశారు. ఇదే తరహాలో కుల్కచర్ల మండలం అంతారంలో పరిశీలించగా అక్కడ కూడా ఏడు గంటలకు రెండు గంటలే వచ్చింది. దోమలో, గండేడ్ మండలం గాధిర్యాల్ గ్రామంలో పరిశీలించగా అక్కడ కూడా ఏడు గంటలకు మూడు నుంచి నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా చేశారు. ఆయా మండలాల్లోనూ ఐదు నుంచి ఎనిమిదిసార్లు మధ్యమధ్య ట్రిప్పయ్యింది. గ్రామాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ కరెంటు కోతల పరిస్థితి ఇలాగే నెలకొంది. దీంతో యువత మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రంలో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు కుదేలవుతున్నాయి. విద్యుత్ లేకపోవడంతో వాటిని మూసివేసి ఉపాధి హామీ పనులుకు వెళ్లాల్సి వస్తోందని ఓ యువకుడు ‘న్యూస్‌లైన్’ పేర్కొన్నాడు. కరెంటు కోతలు, లోఓల్టేజీ సమస్యలతో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు సైతం పదేపదే కాలిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దివాలా దిశగా.. పరిగి పట్టణంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు కరెంటు కోతలతో దివాలా దిశగా పయనిస్తున్నాయి. వెల్డింగ్ షాపులు, మెకానిక్ షెడ్లు, జిరాక్స్, కంప్యూటర్ ఇనిస్టిట్యట్లు, మోటార్ వైండింగ్ దుకాణాలు తదితర చిన్న తరహా ఉపాధి పరిశ్రమలు కరెంటు కోతలతో గంటల తరబడి మూసివేసి ఖాళీగా కూర్చొవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిలో దుకాణాలను తెరవడం కంటే పూర్తిగా మూసివేయడమే మేలంటున్నారు. రోజంతా ఇలా కోతలు విధిస్తే తమ దగ్గర పనిచేసే ఒకరిద్దరు సహాయకులకు వేతనాలు ఎలా ఇవ్వాలని యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
కరెంటు కోతల వ్యథ
పరిగి/ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: రోజురోజుకూ తీవ్రమవుతున్న కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కరెంటు సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండుముఖం పడుతుండగా, పరిశ్రమలు, పౌల్ట్రీఫాంలు కుదేలవుతున్నాయి. పరిశ్రమలకు వారంలో ఒక రోజు పూర్తిగా కరెంటు సరఫరా నిలిపివేయడంతోపాటు సాధారణ రోజుల్లోనూ భారీ మొత్తంలో కోతలు విధిస్తున్నారు. రైతులకు అధికారికంగా ఆరు గంటలు కరెంటు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే రోజుకు మూడు గంటలకు మించి కరెంటు రావడం లేదని, అది కూడా విడతల వారీగా పగలు, రాత్రి సమయాల్లో సరఫరా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ మూడు గంటల కరెంటు కోసం రాత్రీ పగలూ తేడా లేకుండా పొలాల్లోనే జాగారం చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలతో నీరందక వరి, జొన్న, కూరగాయల పంటలు ఎండిపోతున్నాయన్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు కాస్త ఉపశమనాన్ని కలిగించాయన్నారు. ఒక్కో పరిశ్రమకు లక్షల్లో నష్టం కరెంటు కోతలతో పరిశ్రమలపై కోలుకోలేని దెబ్బపడుతోంది. పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోనె అత్యధికంగా పరిశ్రమలు, పౌల్ట్రీఫాంలు ఉన్న నియోజకవర్గం పరిగి. పూడూరు మండలంలో అగరబత్తీల కంపెనీ, టెక్స్టైల్స్ పరిశ్రమతో, బోన్స్ఫాక్టరీ, మరోస్టీల్ ఫ్యాక్టరీ ఉన్నాయి. పరిగి మండలంలో నాలుగు స్టీల్ ఫ్యాక్టరీలు, ఓ ప్లైవుడ్ కంపెనీతో కలుపుకొని ఐదు పరిశ్రమలున్నాయి. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలో ఒక్కోదానిలో 50 వేల నుంచి లక్ష వరకు కోళ్లను పెంచుతున్న ఆరు పెద్ద పౌల్ట్రీఫాంలు, మరో 15 చిన్న పౌల్ట్రీఫాంలు, 20 రైస్ మిల్లులు ఉన్నాయి. కరెంటు కోతలతో నెలకు ఒక్కో స్టీల్ ఫ్యాక్టరీకి రూ. 20 వేల నుంచి రూ. 30వేల వరకు నష్టం వాటిల్లుతోందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతల సమయంలో జనరేటర్లు వినియోగిస్తుండటంతో తమపై రోజుకు రూ. 15వేల అదనపు భారం పడుతుందని పౌల్ట్రీఫాంల యజమానులు చెబుతున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలదీ అదే పరిస్థితి... పరిగి పట్టణంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు కరెంటు కోతలతో దివాల తీస్తున్నాయి. వెల్డింగ్ షాపులు, మెకానిక్షెడ్లు, జిరాక్స్, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లు, మోటార్ వైండింగ్ దుకాణాల యజమానులు కరెంటు కోతలతో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. అంతేకాకుండా ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు కూడా ఉపాధి కోల్పోతున్నారు. ప్రత్యామ్నాయం.. కరెంటు కోతల వల్ల చిరు వ్యాపారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గురించి ఆలోచిస్తున్నారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటి ధర అధికంగా వుండటం.. ఆదాయానికి మించి వుండటంతో వీటి ఏర్పాటులో ఆచి తూచి అడుగేస్తున్నారు. మండల కేంద్రంలో జిరాక్స్ షాప్ నిర్వహించే ఓ చిరు వ్యాపారి ఇటీవల రూ.90వేలు పెట్టి జనరేటర్ కొనుగోలు చేశాడు. దానికయ్యే ఖర్చులో పావు వంతు కూడా వచ్చే పరిస్థితులు కనబడటం లేదని వాపోతున్నాడు. మంగల్‌పల్లిగేట్ సమీపంలో వుండే ఇంటర్నెట్ షాపు నిర్వహుకుడొకరు ఇన్వర్టర్ సహాయంతో ఇంటర్నెట్ నిర్వహిస్తున్నాడు. కరెంటు కోతలను దృష్టిలో ఉంచుకుని రూ. 45వేలు పెట్టి ఇన్వర్టర్ తీసుకున్నాడు. వీటి నిర్వహణ ఎక్కువగా ఉందని ఆయన ఇన్వర్టర్ను అమ్మేసేందుకు సిద్ధమయ్యాడు.