పరిగి, న్యూస్‌లైన్: విద్యుత్ కోతలు అన్ని వర్గాలను గుండెకోతకు గురిచేస్తున్నాయి. ఇటు వ్యవసాయంపై, అటు చిన్నతరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవంగా అందుతున్నది మాత్రం మూడు గంటల కరెంటే. కొన్ని ప్రాంతాల్లోనైతే 2 గంటల విద్యుత్తుతోనే రైతులు సరిపెట్టుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వరి నాట్ల సమయంలో విధించిన కోతలతో పొలాలకు నీరందడంలేదు. ప్రస్తుతం కరెంటు కోతలతో బోరుబావుల కింద కూరగాయాలు తదితర పంటలు సాగు చేస్తున్న రైతులు విలవిల్లాడుతున్నారు. పైనుంచే మూడు గంటలకు మించి కరెంటు రాకపోతుండగా స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఈ విషయం గురువారం నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో స్పష్టంగా కనిపించింది. కోతలకు బయపడి రైతులు ఎకరం, అరెకరం మాత్రమే సాగు చేసుకుంటుండగా.. సాగు చేసిన కాస్త పొలంకూడా పారటంలేదు. దీంతో నియోజకవర్గంలో సాగు ప్రమాదంలో పడింది.
పరిగి నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
కరెంటు కోతలపై నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. మండలానికి ఓ గ్రామం చొప్పున ఎంచుకుని రైతుల ద్వారా సమాచారం సేకరించగా ఎక్కడా మూడు గంటలకు మించి కరెంటు సరఫరాచేసిన దాఖలాలు లేవు. పరిగి మండలంలోని మిట్టకోడూర్‌లో కేవలం మూడు గంటలు మాత్రమే త్రీఫేజ్ కరెంటు రాగా అందులోనూ ఐదారుసార్లు ట్రిప్పయ్యింది. పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్‌లో మొత్తం 110 బోరుబావులు, బావులు ఉన్నాయి. వీటికింద 250 ఎకరాల వరకు పంటలు సాగవుతున్నాయి. గురువారం ఆ గ్రామంలో రోజు మొత్తంలో రెండు గంటలు మాత్రమే కరెంటు సర ఫరా చేశారు. ఇదే తరహాలో కుల్కచర్ల మండలం అంతారంలో పరిశీలించగా అక్కడ కూడా ఏడు గంటలకు రెండు గంటలే వచ్చింది. దోమలో, గండేడ్ మండలం గాధిర్యాల్ గ్రామంలో పరిశీలించగా అక్కడ కూడా ఏడు గంటలకు మూడు నుంచి నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా చేశారు.
ఆయా మండలాల్లోనూ ఐదు నుంచి ఎనిమిదిసార్లు మధ్యమధ్య ట్రిప్పయ్యింది. గ్రామాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ కరెంటు కోతల పరిస్థితి ఇలాగే నెలకొంది. దీంతో యువత మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రంలో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు కుదేలవుతున్నాయి. విద్యుత్ లేకపోవడంతో వాటిని మూసివేసి ఉపాధి హామీ పనులుకు వెళ్లాల్సి వస్తోందని ఓ యువకుడు ‘న్యూస్‌లైన్’ పేర్కొన్నాడు. కరెంటు కోతలు, లోఓల్టేజీ సమస్యలతో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు సైతం పదేపదే కాలిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
దివాలా దిశగా..
పరిగి పట్టణంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు కరెంటు కోతలతో దివాలా దిశగా పయనిస్తున్నాయి. వెల్డింగ్ షాపులు, మెకానిక్ షెడ్లు, జిరాక్స్, కంప్యూటర్ ఇనిస్టిట్యట్లు, మోటార్ వైండింగ్ దుకాణాలు తదితర చిన్న తరహా ఉపాధి పరిశ్రమలు కరెంటు కోతలతో గంటల తరబడి మూసివేసి ఖాళీగా కూర్చొవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిలో దుకాణాలను తెరవడం కంటే పూర్తిగా మూసివేయడమే మేలంటున్నారు. రోజంతా ఇలా కోతలు విధిస్తే తమ దగ్గర పనిచేసే ఒకరిద్దరు సహాయకులకు వేతనాలు ఎలా ఇవ్వాలని యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
7 కాదు 3 గంటలే!
Published Fri, May 23 2014 12:34 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement