నారాజ్‌ వద్దు నాయనా.. | Feel Free Said Congress | Sakshi
Sakshi News home page

నారాజ్‌ వద్దు నాయనా..

Published Mon, Nov 19 2018 3:37 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Feel Free Said Congress - Sakshi

మూతిమీద గొట్టి.. మందులేసుడంటే గిదే! అగ్గల్లే అంటించిండ్రు.. గిప్పుడు దాన్ని ఆర్పుతామని నల్గురు మనుసుల్ని నీల్ల కుండలిచ్చి పంపిండ్రంట గా డిల్లీ కాంగ్రెస్‌ పెద్దోలు. గిదేమన్న పనికొచ్చె పనేనా? అరె బై ఊర్కే ఉండేటోల్ని గిచ్చుడేంది?. మల్లీ నొప్పిగుంద.. మంటగుంద అంటూ అడుగుడేంది? బేకార్‌ కాకపోతె. నిన్న మొన్నటి దాక టికెటొస్తది.. నీకే వస్తదని మస్తు ఆసబెట్టిండ్రు. గిప్పుడేమో సేతులెత్తి.. సారీ.. గీసారి నీకు ఇస్తలేం! అంటే గా ఆశావహ సారు ఏం గావాలె? టికెట్‌ కోసం గాంది బవన్‌ కాడ.. డిల్లీలో పార్టీ ఆపీసు కాడ గూర్కా లెక్క గస్తీల్గాస్తె.. సివారకర్కి తియ్యలేక పోతె ఇంట్లో ఊర్లో.. ఇజ్జత్‌ ఉంటదా మల్ల. నెత్తిపై తువ్వాలేస్కొని నల్గురికి ముకం సూపలేక దిరగాలంటె ఎంత నామోషీ.

సాక్షి, రంగారెడ్డి:  కాంగ్రెసోల్లు తెలుగు తమ్ముల్లతో గాల్లతో గీల్లతో జట్టు కట్టి కూటమి అంటూ కొత్త కొట్టుపెట్టిండ్రు గాదె. గప్పట్నుంచి గీల్ల లెక్కలన్ని దప్పుతున్నయ్‌.  అసలు ఎవరికైన గాని ఆసపెట్టుడే బడా గలత్‌. కొందరు ఇండ్లల్ల చిన్నపిల్లల్కి నీకు గది కొనిస్త గిది కొనిస్త అంటూ ఊరిస్తరు. పాపం గీ పిలగాల్లు ఎప్పుడు మల్ల.. ఎప్పుడు మల్ల అంటూ సతయిస్తుంటరు. లాస్ట్‌కి ఇప్పుడు గాదులె మల్లీ.. అనగానె గా పిల్లలు తుస్సుమంటరు. కొందరు పిల్లల్ది గీ లెక్కగాదు.

మాటిచ్చినంక కొన్లేదంటె నరకం సూపిస్తరు. గట్లాంటోల్ల విసయంలో జర జాగ్రత్తగ ఉండాలె. మా తమ్ముడి కొడుకున్నడు. గాడు గిదే బాపత్‌. ఏదైన కొనిస్త అంటె.. పక్కానా అని అడుగుతడు. పొరపాట్న మాటిచ్చినం అంటె ఇంగ సచ్చినట్లే.

తగుల్కుంటే తలపట్టుకోవాలె. నువ్‌ గది కొనిచ్చేదంక గంట గంటకి అడుగుతునే ఉంటడు. అరె నేం కొనిస్తా బిడ్డా! జర ఆగరాదె.. అన్నా ఆడు వదలడు. ఎప్పుడో చెప్పు అంటునే ఉంటడు. గీ బాద పడ్లేక ‘రారా బై కొనిస్త గాని.. సావగొడ్తున్నవ్‌’ అని తీసుకెల్లాల్సిందె. గందుకే మా తమ్మినింటికెవరైనా వచ్చినపుడు అరె నీకేం గావాల్నో చెప్పు.. అంటె సాలు...‘మీకు తెల్వదు గమ్మునుండండి. కొనిస్తమంటె గాడు వదలిపెట్టడు అంటూ అడ్డంపడ్తుంటడు. నిజం చెప్పాలంటె గిట్లనే ఉండాలె.

ఎవరైనా మాట ఇస్తె ఎంట పడుడే. గప్పుడు గాని ఆల్లు ఎనకాముందు చూస్కోక మాటివ్వరు.  గీ ఆశావహుల కతలూ పిల్లల్లెక్కె. ఇంట్లో కూసున్నోల్లకి ఆశపెట్టి.. డబ్బులు కర్చు పెట్టించి.. గిప్పుడు లేద్లేదు అంటె గాళ్లు అల్లాడుతుండ్రు. గిదేంది సార్‌ మొన్ననే ఇస్తమంట్రి కదా అంటే మాట్లాడకుండ తప్పించుకుంటుండ్రు. లిస్ట్‌ల పేరు లేదని దెల్సినప్పుడే అగ్గిమీద గుగ్గిలం అయిండ్రు. కొందరు పార్టీ ఆపీస్ల ఆగమాగం చేసిండ్రు.

ఇంకొందరు సొంత దుకానం పెట్టుకుంటం అంటూ రెబల్‌గా బరిలో దిగుతుండ్రు. కొందరు పేరున్నోల్ల లీడర్లకే టికెట్లు గల్లంతయినయ్‌. ఆల్లు గిప్పుడు ఊర్కున్నట్లు కన్పించినా...ముందు ముందు గేం లొల్లి పెడ్తారో అని డిల్లీ పెద్దలనుకుంటుండ్రు.

పాపం గీ పొత్తులని వచ్చిన కోదండరాం సారు కత మరీ దీనం. జనగామ నుంచి జగడం చేస్త అంటున్నా.. అయ్యో మా రాహుల్‌ దొర చెప్పిండ్రు మీరు గా సీటు పొన్నాల కోసం త్యాగం జెయాలె అన్నంక.. గా సారు మాత్రం ఏం జేస్తడు? చిక్కిందే శివప్రసాదమనుకుండు. గానీ పాతోల్లు గట్ల కాదె. కాంగ్రెస్‌ల గీ తిరుగుబాటు పోతురాజులు దగ్గరదగ్గర ఇరవై మంది దాకా తేలిండ్రు. గాల్లు గట్ల గిట్ల కాదు. పోటీలో ఉన్నోల్లకి అగ్గిపెడ్తరు.

కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోతేనేం నేనే పోటీ జేస్తనంటుండు విజయరామారావు సారు. గీపోట్లు టీఆర్‌ఎస్‌లోనూ ఉన్నయ్‌. ఖమ్మం అశ్వారావుపేట మరికొన్నిట్ల టీఆర్‌ఎస్‌ తిరుగు జెండాలు కనిపిస్తున్నయ్‌! సిటీలో ముషీరాబాద్‌ టికెట్‌ లొల్లి గట్లనే ఉంది. కాంగ్రెస్‌  డిల్లీ పెద్దలు గిది గమనించె ఏకంగా బుజ్జగింపు కమిటీ ఏసిండ్రు. ఆల్లు వచ్చి ఈల్లని సముదాయించి ఏ లొల్లి జరక్కుండ చూసుకెవాలె! గిదయ్యే పనేనా అంటె ...ఏమో చూడాలె!                  – రామదుర్గం మధుసూదనరావు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement