కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట కొనసాగుతున్న హెలిపాడ్ నిర్మాణ ఏర్పాట్లు
సాక్షి, వికారాబాద్ : ఎన్నికల వేళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ప్రచార అస్త్రంగా వినియోగించుకునేందుకు ఏఐసీసీ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే సూత్రప్రాయంగా ప్రణాళిక రెడీ చేసిన కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుత ఎన్నికల్లో రేవంత్‌ను స్టార్ క్యాంపేయినర్‌గా వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు రూట్ మ్యాప్‌ను ఖరారు చేయనుంది. కొడంగల్‌ను సమన్వయం చేసుకుంటూనే ఇతర సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేయాలని ఆదేశించింది.
తెలంగాణలోని 69 సెగ్మెంట్ల లో నిర్వహించే సభలు, సమావేశాల్లో రేవంత్ పాల్గొననున్నారు. సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు చాపర్ సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి సైతం ధ్రువీకరించారు. దీనికి అనుగుణంగానే కొడంగల్‌లోని ఆయన నివాసం ఎదుట హెలిపాడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇందుకోసం పోలీసు శాఖ అనుమతులు రాలేదని సమాచారం. పర్మిషన్ వ్యవహారాన్ని అధిష్టానమే చూసుకుం టుందని రేవంత్ వాఖ్యానించారు.
స్టార్ క్యాంపెయినర్.. రేవంత్‌రెడ్డి
పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం అధిష్టానం ఎలా వినియోగించుకుంటే అలా సేవలందిస్తా.. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపి.. ఇంటికి పంపడమే లక్ష్యంగా పనిచేస్తా.. రాష్ట్ర వ్యాప్త పర్యటనల కోసం అధిష్టానం ప్లాన్ చేస్తోంది. వారిచ్చి న షెడ్యూల్‌ను అనుసరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. ఈ నెల 19న నామినేషన్ వేశాక ప్రచారం ప్రారంభిస్తాను. – రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
19న నామినేషన్..
రేవంత్‌రెడ్డి ఈ నెల 19న నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. నామినేషన్ రోజున భారీ జన సమీకరణకు సన్నద్ధమవుతున్నారు. మరుసటి రోజైన 20వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. కొడంగల్‌లోనూ ఏమాత్రం తగ్గకుండా ప్రచారానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకున్నారు. 20 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు రేవంత్ ప్రచారం కొనసాగనుంది.
69 సెగ్మెంట్లలో పర్యటన..
అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపేయినర్‌గా ప్రచార బరిలో దిగనున్న రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మొ త్తం 69 సెగ్మెంట్లలో నిర్వహించనున్న సభలు, సమావేశాలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఈయన ప్రచారానికి తన సొంత నియోజకవర్గం కేంద్ర బిందువు కానుంది.
రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు హెలికాప్టర్ వినియోగించనున్న నేపథ్యంలో.. రేవంత్ నిత్యం కొడగంల్‌లోని తన నివాసం నుంచే బయలుదేరి తిరిగి రాత్రి ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. వరుసగా రెండు రోజులు రాష్ట్రంలోని పలు సెగ్మెంట్లలో పర్యటించనున్న ఆయన ఒక రోజు తన సొంత నియోజకవర్గంలో పర్యటిం చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇలా కొడంగల్‌లోనూ గ్యాప్ రాకుండా ఎన్నికలు పూర్తయ్యే వరకూ బిజీబిజీగా ఉండనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment