సాక్షి, రంగారెడ్డి: ‘మల్లేశన్నా.. గిదేందే గిట్లయింది.. పాపం గా రమేసన్న నిన్నట్నుంచి శానా పరేశాన్గ ఉన్నడు’ ఎంకటేసు ఏడ్పు ముకం ఏస్కొని అంటుంటే.. నాకర్తం కాలె. ఏందే ఏమైంది పొద్దున పొద్దున్నే గీ ఏడ్సుడేంది.. సక్కగ సెప్పుమల్ల.. జరంత కసిరిన. ‘నువ్ గూడ గుస్సానె. గిట్ల గుస్సా అయ్యే గా రమేసన్న గిప్పుడు తల పట్టుకున్నడు’ అని అన్నడు. ‘సర్లే గా రమేసన్న కోపం ఎందుకయ్యిండో సెప్పు’ అనంగానె ‘గీ రమేసన్నకి పార్టీవోల్లు టికెట్ ఇవ్వలేద్ గదా.. గప్పట్నుంచి అన్న పార్టీ ఆపీసుకాడ అర్తాల్ జేస్తుండు. నాలాంటోళ్లు నల్గురు తమ్ముల్ని పోగేసి.. లొల్లి మీద లొల్లి చేసిండు’ టెన్సన్ పట్లేక అడ్డంపడి ‘గట్లనా.. ఏమైంది.. దెబ్బకి టికెట్ ఇచ్చేసిండ్రా’ అనడిగిన. ‘ఏం ఇచ్చేది.. చేతిలో చిప్ప! నీ ఇస్టం మల్ల గంత గుస్స అయితే నీ దారి నువ్ చూస్కో అనేసిండ్రంట.. పార్టీ పెద్దోల్లు. దీంతో అన్న అరె తమ్మీ నా పని ఖల్లాస్! గీ పెద్దోల్లు నెత్తిపై గుడ్డేసిండ్రని ఏడ్సుడే ఏడ్సుడు.’ ఎంకటేసం అంటుంటె నాకు నవ్వు ఆగలే.
అసలు ఎందుకు నారాజ్ ఐతరు.. ‘అడిగేటోల్లుంటుండ్రని. మీకు దెల్వదు ఎవర్నయిన సతాయించాలంటె, గిట్ల కోపం వచ్చిందని మూతి బిగించి కూర్సొంటారు. అంటె ఎవరిపై కోపమైతమో ఆల్లు దగ్గర్కొచ్చి గడ్డం పట్కొని ‘ఏమైంది.. ఎందుకు కోపం’ అని అడగాలె. గప్పుడు గీల్లింక సురు చేస్తరు. నాకది కావాలె.. గిదెందుకు తేలె అని అనేటోల్లు కొందరయితే... గా దినం నన్నట్లంటివి.. అని పాత కతలు దీస్తరు.. సిన్నోల్ల లెక్క వేరు. పాపం ఆల్లు అంతా సూస్కొని గుస్సాలోకి దిగాలె. అందుకె ఇంటికి కొత్త సుట్టాలొచ్చినపుడే గిట్లాంటి పీట్లు చేస్తరు. కొత్తోల్ల ముందు తోకలిప్పిన గీల్లకి ఏం గాదు. గా పెద్దోల్లు గట్టిగ అర్వాలన్నా.. నాల్గు పీకాలన్నా.. యాడ ఇజ్జత్ పోతదోనని బయంతో సేతులు కట్టేస్కుని లోలోపల పండ్లు కొరుకుతూ ‘గీ సుట్టాల్ పోనీ బిడ్డా ! ఉంటాది నీకు ’అనుకోవాలంతె. అయితె అందర్కి గట్లా కల్సిరాదె. ఒక్కోసారి ఎంత కోపం వచ్చినా ఎవరూ లెక్కజేయరు.
అంతెందుకు.. గిప్పుడు ఎలచ్చన్లోనె సూడుండ్రి. పాపం టికెట్ రాలేదని అలిగి రోడ్డెకిండ్రు అందరు. ఇంకొందరయితే ఎన్కాల జనాల్నేసుకుని రచ్చరచ్చ జేసిండ్రు. తొడల్గొట్టి సవాల్లు సేసిండ్రు. గది జూసి పార్టీ వాల్లు రెండ్రెండు టికెట్లు యాడికెల్లి పట్కువచ్చేది. సరె మీరె జర సముదాయించండి కొంతమందిని పంపిండ్రు. గయితె ఆల్లు ఎంత కిందామీద పడినా గుస్సా సార్లు తగ్గలె. గిట్ల గాదని..’ సర్లే ఇగ మీ యిస్టం..’ అని సేతులెత్తేసిండ్రు. గీల్లతో మహా అయితే ఐదారు వేల ఓట్లు పోతయ్.. పోనీ చేసుడేముంది అంటుండ్రంట. అంతేగాదు.. గీ ఓట్లుగూడ గుస్సా సార్లు సెప్పినోల్లకే ఏసేస్తరనేముంది? అని లేచెల్లిపోయిండ్రు. పాపం ఈల్లకింక పరేసాన్. అరె జర కోపం వచ్చిందని సెప్తే అయిదో పదో పైసలిచ్చో.. గెల్సినంక ఏదైనా పదవిస్తం అనకుండా.. గిట్ల జేస్తిరేంది సార్లు అని తలపట్టుకున్నరట. ఊర్కుండ్లేక ఉబ్బసాన్కి మందు తీస్కొనిండంటే గిదే మల్ల!! – రామదుర్గం మధుసూదనరావు
గుస్సా రంగయ్య చాల్లే తగ్గయ్య !
Published Thu, Nov 22 2018 3:10 PM | Last Updated on Thu, Nov 22 2018 3:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment