ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నం.43 విద్యానగర్‌లో టీఆర్‌ఎస్ నుంచి నలుగురు నామినేషన్లు వేశారు. దాదాపు అన్నివార్డుల్లోనూ ఇదే పరిస్థితి. వార్డు నం.41 టీచర్స్ కాలనీలో బీజేపీ నుంచి పది నామినేషన్లు దాఖలయ్యాయి. పలు వార్డుల్లో ఈ పార్టీది ఇదే పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి కొన్ని వార్డుల్లో ఇలాగే ఉంది.
సాక్షి, ఆదిలాబాద్: నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక బుజ్జగింపుల పర్వం మొదలుకానుంది. పార్టీల్లో అసంతృప్తి సెగలు ఇప్పటికే మొదలయ్యాయి. వార్డుల నుంచి ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఆయా పార్టీల నుంచి పలువురు నామినేషన్లు వేయడంతో ఇప్పుడు పార్టీలకు ఎవరినైన ఒకరిని ఎంపిక చేయాల్సిన పరిస్థితిలో బీ–ఫామ్ ఎవరికిస్తుందోననేది ఆసక్తి నెలకొంది. అయితే పార్టీ నుంచి సూచనప్రాయంగా ఒక అభ్యర్థికి బీ–ఫామ్ ఇస్తామనే సంకేతాలు ఉండడం, మిగతా వారు అటు పార్టీ పరంగా ఇటు స్వతంత్రంగా నామినేషన్ వేసి రంగంలో ఉంటామనే సంకేతాలు ఇస్తున్నారు. ఇది పార్టీలకు తలనొప్పిగా మారింది. వారిని పిలిచి బుజ్జగించడం, వారు దిగొస్తే సరే.. లేనిపక్షంలో పార్టీ నుంచి వేటు వేస్తామని హెచ్చరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామం ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తి కలిగిస్తోంది.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులకు సంబంధించి 400లకుపైగా నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది. నామినేషన్ల చివరి రోజు శుక్రవారం రాత్రి వరకు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అధికారికంగా ఈ సమాచారం రావాల్సి ఉంది. అనేక వార్డుల్లో టీఆర్‌ఎస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు పడడం ఆసక్తి కలిగిస్తుంది. ఈనెల 14న ఉపసంహరణ గడువు ఉండగా, ఎంతమంది ఉపసంహరించుకుంటారనేది వేచి చూడాల్సిందే. పార్టీలకు రెబల్స్ బెడద తప్పేటట్టు లేదు. తమకు పార్టీ పరంగా బీ–ఫామ్ వచ్చే పరిస్థితి లేదని తెలిసి పలువురు పార్టీ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థిగా కూడా మరో నామినేషన్ వేసి ఉండడంతో వారు రంగంలో ఉండేందుకే సంసిద్ధులై ఉన్నారని స్పష్టమవుతోంది. ఇది ఆయా వార్డుల్లో పార్టీలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. టీఆర్‌ఎస్ మున్సిపల్ తాజామాజీ చైర్‌పర్సన్ రంగినేని మనీశ వార్డు నం.48లో టీఆర్‌ఎస్ నుంచి మరో ఇద్దరు నామినేషన్లు వేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారమే పార్టీ పరంగా నామినేషన్ వేసిన మనీశ శుక్రవారం మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమెకు పార్టీ పరంగా బీ–ఫామ్ ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పార్టీ నుంచి నామినేషన్ వేసిన శైలేందర్ అనే వ్యక్తికి బీ–ఫామ్ ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు చర్చ సాగుతుంది. ఈ పరిణామం పార్టీలో ఎలాంటి సంఘటనలకు దారి తీస్తుందోననేది ఆసక్తి కలిగిస్తుంది.
ఒకవేళ మనీశకు పార్టీ పరంగా బీ–ఫామ్ లభించని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి మున్సిపల్ ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం ముందు నుంచి సాగింది. అయితే పాయల శంకర్‌కు తన వార్డులో రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో ఆయన మరేదైన జనరల్ వార్డు నుంచి బరిలోకి దిగుతారని అనుకున్నా పోటీలో దిగలేదు. అలాగే సుహాసిని రెడ్డికి ఆమె వార్డు నుంచి రిజర్వేషన్ అనుకూలంగా నామినేషన్ వేయలేదు. ప్రధానంగా పార్టీ పరంగా తనను చైర్‌పర్సన్‌గా ప్రకటిస్తే వార్డు నుంచి బరిలోకి దిగాలని ఆమె ఆలోచనలో ఉండగా, పార్టీ ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతోనే ఆమె మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ నుంచి 34వ వార్డులో పోటీ చేస్తున్న జోగు ప్రేమేందర్‌కు పోటీగా బీజేపీ, ఇతర పార్టీల నుంచి కూడా నామినేషన్లు పడినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment