సాక్షి, ఆదిలాబాద్ : మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశవాహుల్లో రిజర్వేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ ముందే విడుదలై తర్వాత షెడ్యూల్ జారీ అవుతుందని అనుకున్నప్పటికీ దానికి భిన్నంగా ప్రక్రియ కొనసాగుతుండడంతో అందుకు తగ్గట్టుగా అటు పార్టీలు, ఇటు ఆశవాహులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకట్రెండు రోజుల ముందు మాత్రమే రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుండడంతో పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నా వాటిని దాటుకొని ఎన్నికలకు వెళ్లేందుకు సంసిద్ధులవుతున్నారు.
అశావహుల్లో...
గత మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ (మహిళ)కు కేటాయించగా, ఈసారి రిజర్వేషన్ ఎలా ఉంటుందోనని చైర్మన్ పదవీపై ఆశపెట్టుకున్న పలువురిలో టెన్షన్ మొదలైంది. పరోక్ష పద్ధతిలో చైర్మన్‌ను ఎన్నుకునే ఈ ప్రక్రియలో వార్డులో కౌన్సిలర్‌గా గెలిచిన తర్వాతే చైర్మన్ పదవీకి ఆ పార్టీ పరంగా పోటీ చేసే అవకాశం ఉండడంతో పలువురు ముఖ్య నాయకులు ఆ కేటాయింపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీలో పలువురు ముఖ్య నాయకులు చైర్మన్ పదవీపై కన్నేశారు. దీంతో రిజర్వేషన్ అనుకూలంగా వస్తే పోటీలో నిలవడం ఖాయమనే సంకేతాలు ఇదివరకే సూచనప్రాయంగా కార్యకర్తలకు తెలియజేశారు. ఒకవేళ చైర్మన్ రిజర్వేషన్ కేటాయింపు తమకు ప్రతికూలంగా ఉంటే మరి వారు కౌన్సిలర్‌గా బరిలోకి దిగుతారా.. లేదా అనేది ఆసక్తికరమే.
పోటీ అధికంగానే...
గత మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో అధికారం చేజిక్కిచ్చుకుంది. ఆ తర్వాత పలువురు కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు అధికార పార్టీతో జత కట్టారు. దీంతో పాలకవర్గం ఐదేళ్లు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగింది. అప్పుడు ఇతర పార్టీలో గెలిచిన వారు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నారు. దీంతో ఇప్పుడు వార్డుల్లో తాజా మాజీలతో గతంలో అధికార పార్టీ నుంచి వార్డుల్లో పోటీ చేసిన వారు మళ్లీ టిక్కెట్ కోసం ఆసక్తి కనబర్చితే అక్కడ నువ్వా.. నేనా అనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఇదిలా ఉంటే మూడునాలుగు నెలలుగా టీఆర్‌ఎస్, బీజేపీలు సంస్థాగత నిర్మాణం చేపట్టాయి. టీఆర్‌ఎస్ వార్డు కమిటీలను పూర్తి చేసినప్పటికీ పట్టణ కమిటీని నియమించలేదు.
ఇక బీజేపీ వార్డు కమిటీలను నియమించి పట్టణ కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు కమిటీలకు అనుబంధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, యువజన సంఘాలను ఏర్పాటు చేశారు. దీంతో వార్డు రిజర్వేషన్లు ఏ కేటగిరికి కేటాయించినా అందుకు అనుగుణంగా అక్కడ అభ్యర్థిని సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించలేదు. ఎంఐఎం పట్టు ఉన్న వార్డుల్లో పార్టీ అభివృద్ధికి ఈ మధ్యకాలంలో చర్యలు చేపట్టింది. అయితే ప్రధానంగా రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత ఆయా పార్టీల్లో టిక్కెట్ రాక ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి నిరాశవాహులు కప్పదాట్లు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీల్లోనే పోటీ అధికంగా కనిపించే అవకాశం లేకపోలేదు.
నోటిఫికేషన్ రాగానే...
జనవరి 7న నోటిఫికేషన్ రానుండగా, అంతకుముందు 5,6 తేదీల్లో చైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను కేటాయించనున్నారు. డిసెంబర్ 30న ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. 31 నుంచి జనవరి 2 వరకు ఈ ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉన్న పక్షంలో వాటికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరిస్తారు. జనవరి 3 వరకు అభ్యంతరాల పరిష్కారం చూపనున్నారు. 4న తుది ఓటర్ల జాబితా జారీ చేస్తారు. దీని ప్రకారంగా చూస్తే 5,6 తేదీల్లోనే ఈ రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు. దీంతో రిజర్వేషన్ల ప్రకటన నుంచి నామినేషన్ల గడువుకు స్వల్ప వ్యవధి మాత్రమే ఉండడంతో ఈ కొన్నిరోజుల్లోనే పార్టీల్లో ప్రధాన నిర్ణయాలు కనిపించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment