సాక్షి, ఆదిలాబాద్: టీఆర్‌ఎస్ పార్టీలోని తాజామాజీల్లో టికెట్ టెన్షన్ నెలకొంది. ఇందులో ఎందరికి అభయం లభిస్తుందో.. ఎంతమందికి మొండి చెయ్యి ఎదురవుతుందో అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడం, టీఆర్‌ఎస్ నుంచి పలు వార్డుల్లో అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండడంతో ప్రస్తుతం దీనిపై చర్చ సాగుతోంది. అయితే తాజామాజీల్లో పలువురికి ఆమోదం లభించలేదన్న ప్రచారం పార్టీలో ఉంది. నామినేషన్ల ఘట్టం పూర్తయితేనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న వార్డుల్లోనూ కొందరిని ఆరోపణలు, వివిధ కారణాలతో తప్పిస్తున్నారని కార్యకర్తలు పేర్కొంటున్నారు.
టీఆర్‌ఎస్ నుంచి తొలి రోజే పది మంది నామినేషన్లు వేశారు. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తనయుడు జోగు ప్రేమేందర్‌తోపాటు మరో తొమ్మిది మంది ఉన్నారు. ఆ తొమ్మిదిలో ముగ్గురు తాజామాజీ కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, బండారి సతీశ్, కొండ మీన ఉండగా, గతంలో సంద నర్సింగ్ భార్య కౌన్సిలర్‌గా ఉండగా ప్రస్తుతం ఆయన ఆ స్థానం నుంచి రంగంలో దిగారు. గత పాలకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ గెలిచిన స్థానాలపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. దీంతోనే నామినేషన్ల తొలి రోజే ఆ పార్టీల ప్రాతినిధ్యం ఉన్నచోట టీఆర్‌ఎస్ పార్టీ నుంచి వార్డుల్లో బరిలోకి దింపింది. ఇదిలా ఉంటే జోగు ప్రేమేందర్ బరిలోకి దిగిన 34వ వార్డులో ఇదివరకు టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌గా సత్యనారాయణ వ్యవహరించారు. ఆయన అనారోగ్య కారణాలతో ఈసారి పోటీ చేయనని ముందుగానే పార్టీకి తెలియజేసినట్లు కొంతమంది చెబుతున్నారు. ఏదేమైనా ఈ పరిణామం మాత్రం పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఇక గతంలోనూ కోఆప్షన్ సభ్యుడిగా వ్యవహరించిన తిరుమన్ వామన్‌ను 3వ వార్డు తిర్పెల్లి నుంచి బరిలోకి దించారు.
తాజా మాజీల్లో కొంతమందికి వార్డుల్లో రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నప్పటికీ వారికి ఇప్పటి వరకు టికెట్ అభయం లభించనట్లు తెలుస్తోంది. ఆ వార్డుల్లో ఇతరులకు టికెట్లు ఇచ్చే అవకాశం లేకపోలేదన్న ప్రచారం కూడా సాగుతోంది. దీంతో టీఆర్‌ఎస్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ ఆసక్తి కలిగిస్తోంది. పార్టీలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జీగా లోక భూమారెడ్డి ఉండగా, ఇటీవల అధిష్టానం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు అభ్యర్థులకు బీ–ఫామ్ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీలో ఎంపికలపై చర్చ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ గురు, శుక్రవారాలు కొనసాగనుండగా, ఇప్పుడు ఎవరెవరు బరిలోకి దిగుతారు.. చివరికి ఎవరెవరికి బీ–ఫామ్ దక్కుతుంది.. టికెట్ ఆశిస్తున్న వారు ఒకవేళ సమ్మతి లేకున్నా బరిలోకి దిగుతారా.. చివరకు పరిస్థితులు ఎలా ఉండబోతాయనేది అధికార పార్టీలో ఆసక్తి కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment