Reservations process
-
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కేసుపై సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత ధర్మాసనం ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేజన్ల కేసుపై శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పనపై తామేలాంటి ప్రమాణాలను నిర్దేశించలేమని తెలిపింది. ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి న్యాయస్థానం వద్ద ఎలాంటి కొలమానం లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలే లెక్కలు సేకరించాలని తెలిపింది. మొత్తం సర్వీసు ఆధారంగా కాక, రిజర్వేషన్ల ఆధారంగానే డేటాను సేకరించాలని స్పష్టం చేసింది. అదే విధంగా ప్రమోషన్ల డేటా సమీక్షకు వ్యవధి సహేతుకుంగా ఉండాలని తెలిపింది. రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్రాలు తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. దామాషా ప్రాతినిధ్యం, తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలన్నీ రాష్ట్రాలే చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కాగా, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనలో ప్రమాణాలను నిర్దేశించడంలో ఎదురవుతున్న అయోమయాన్ని దూరం చేయాలని కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: ‘సిద్ధూ డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టాడు’ -
రిజర్వేషన్‌పై ఉత్కంఠ
సాక్షి, ఆదిలాబాద్ : మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశవాహుల్లో రిజర్వేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ ముందే విడుదలై తర్వాత షెడ్యూల్ జారీ అవుతుందని అనుకున్నప్పటికీ దానికి భిన్నంగా ప్రక్రియ కొనసాగుతుండడంతో అందుకు తగ్గట్టుగా అటు పార్టీలు, ఇటు ఆశవాహులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకట్రెండు రోజుల ముందు మాత్రమే రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుండడంతో పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నా వాటిని దాటుకొని ఎన్నికలకు వెళ్లేందుకు సంసిద్ధులవుతున్నారు. అశావహుల్లో... గత మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ (మహిళ)కు కేటాయించగా, ఈసారి రిజర్వేషన్ ఎలా ఉంటుందోనని చైర్మన్ పదవీపై ఆశపెట్టుకున్న పలువురిలో టెన్షన్ మొదలైంది. పరోక్ష పద్ధతిలో చైర్మన్‌ను ఎన్నుకునే ఈ ప్రక్రియలో వార్డులో కౌన్సిలర్‌గా గెలిచిన తర్వాతే చైర్మన్ పదవీకి ఆ పార్టీ పరంగా పోటీ చేసే అవకాశం ఉండడంతో పలువురు ముఖ్య నాయకులు ఆ కేటాయింపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలో పలువురు ముఖ్య నాయకులు చైర్మన్ పదవీపై కన్నేశారు. దీంతో రిజర్వేషన్ అనుకూలంగా వస్తే పోటీలో నిలవడం ఖాయమనే సంకేతాలు ఇదివరకే సూచనప్రాయంగా కార్యకర్తలకు తెలియజేశారు. ఒకవేళ చైర్మన్ రిజర్వేషన్ కేటాయింపు తమకు ప్రతికూలంగా ఉంటే మరి వారు కౌన్సిలర్‌గా బరిలోకి దిగుతారా.. లేదా అనేది ఆసక్తికరమే. పోటీ అధికంగానే... గత మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో అధికారం చేజిక్కిచ్చుకుంది. ఆ తర్వాత పలువురు కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు అధికార పార్టీతో జత కట్టారు. దీంతో పాలకవర్గం ఐదేళ్లు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగింది. అప్పుడు ఇతర పార్టీలో గెలిచిన వారు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నారు. దీంతో ఇప్పుడు వార్డుల్లో తాజా మాజీలతో గతంలో అధికార పార్టీ నుంచి వార్డుల్లో పోటీ చేసిన వారు మళ్లీ టిక్కెట్ కోసం ఆసక్తి కనబర్చితే అక్కడ నువ్వా.. నేనా అనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఇదిలా ఉంటే మూడునాలుగు నెలలుగా టీఆర్ఎస్, బీజేపీలు సంస్థాగత నిర్మాణం చేపట్టాయి. టీఆర్ఎస్ వార్డు కమిటీలను పూర్తి చేసినప్పటికీ పట్టణ కమిటీని నియమించలేదు. ఇక బీజేపీ వార్డు కమిటీలను నియమించి పట్టణ కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు కమిటీలకు అనుబంధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, యువజన సంఘాలను ఏర్పాటు చేశారు. దీంతో వార్డు రిజర్వేషన్లు ఏ కేటగిరికి కేటాయించినా అందుకు అనుగుణంగా అక్కడ అభ్యర్థిని సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించలేదు. ఎంఐఎం పట్టు ఉన్న వార్డుల్లో పార్టీ అభివృద్ధికి ఈ మధ్యకాలంలో చర్యలు చేపట్టింది. అయితే ప్రధానంగా రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత ఆయా పార్టీల్లో టిక్కెట్ రాక ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి నిరాశవాహులు కప్పదాట్లు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీల్లోనే పోటీ అధికంగా కనిపించే అవకాశం లేకపోలేదు. నోటిఫికేషన్ రాగానే... జనవరి 7న నోటిఫికేషన్ రానుండగా, అంతకుముందు 5,6 తేదీల్లో చైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను కేటాయించనున్నారు. డిసెంబర్ 30న ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. 31 నుంచి జనవరి 2 వరకు ఈ ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉన్న పక్షంలో వాటికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరిస్తారు. జనవరి 3 వరకు అభ్యంతరాల పరిష్కారం చూపనున్నారు. 4న తుది ఓటర్ల జాబితా జారీ చేస్తారు. దీని ప్రకారంగా చూస్తే 5,6 తేదీల్లోనే ఈ రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు. దీంతో రిజర్వేషన్ల ప్రకటన నుంచి నామినేషన్ల గడువుకు స్వల్ప వ్యవధి మాత్రమే ఉండడంతో ఈ కొన్నిరోజుల్లోనే పార్టీల్లో ప్రధాన నిర్ణయాలు కనిపించే అవకాశం ఉంది. -
అవసరమున్నంత కాలం రిజర్వేషన్లు: ఆరెస్సెస్
పుష్కర్: సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి కనుకనే రిజర్వేషన్ల అవసరం ఉన్నదనీ, లబ్ధిదారులకు రిజర్వేషన్ల అవసరమున్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్పష్టం చేసింది. మంచినీటి విషయంలోనూ, శ్మశానాల్లోనూ, దేవాలయాల్లోనూ అందరికీ ప్రవేశం ఉండాలనీ, నీటి వనరుల వాడకాన్ని కులంపేరుతో నిరాకరించడం తగదనీ ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధానకార్యదర్శి దత్తాత్రేయ హోసబేల్ తేల్చి చెప్పారు. సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలున్నాయనీ, అందుకే రిజర్వేషన్ల కొనసాగింపు అవసరమనీ ఆర్ఎస్ఎస్ భావిస్తోం దన్నారు. రాజస్తాన్‌లోని పుష్కర్‌లో మూడు రోజుల పాటు జరిగిన సంఘ్‌పరివార్ కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి 35 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల నుంచి 200 మంది ప్రతిని«ధులతోపాటు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా, జనరల్ సెక్రటరీ బి.ఎల్.సంతోష్‌లు హాజరయ్యారు. -
ఈడబ్ల్యూఎస్ కోటాలో వివక్ష!
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఎంబీబీఎస్ సీట్లను పెంచడంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పక్షపాత ధోరణిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణకు ఎంసీఐ తీవ్ర అన్యాయం చేసిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నిబంధనలను అతిక్రమించి అత్యధికంగా ఎంబీబీఎస్ సీట్లు పెంచిన ఎంసీఐ, తెలంగాణకు మాత్రం నిబంధనల మేరకు కాకుండా తక్కువ పెంచి ఇవ్వడంపై మండిపడుతున్నాయి. ఇంత పక్షపాత ధోరణి చూపడం పట్ల కేంద్రానికి తమ నిరసన తెలపాలని భావిస్తున్నట్లు సమాచారం. 190 సీట్లకే పరిమితం... దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2019ృ20 నుంచి అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఎంసీఐ సీట్ల పెంపుపై ప్రతిపాదనలు కోరింది. పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలంటే, ప్రస్తుతమున్న రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా 25 శాతం సీట్లు పెంచాల్సి ఉంటుందని ఎంసీఐ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రతిపాదనలను తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) ఎంసీఐకి ప్రతిపాదనలు పంపించారు. కానీ కొన్ని కాలేజీలకు 25 శాతం సీట్లకు బదులు కేవలం 20 శాతమే పెంచి ఎంసీఐ చేతులు దులిపేసుకుంది. గాంధీ మెడికల్ కాలేజీ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ, నిజామాబాద్, సిద్ధిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం 900 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 25 శాతం చొప్పున వాటిల్లో 225 ఎంబీబీఎస్ సీట్లను ఎంసీఐ అదనంగా పెంచాల్సి ఉంది. కానీ కేవలం 190 సీట్లు మాత్రమే పెంచింది. ఏకంగా 35 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ నష్టపోయింది. ఉదాహరణకు మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 150 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఆ ప్రకారం 38 సీట్లు పెంచాల్సి ఉండగా, కేవలం 25 సీట్లనే పెంచారు. ఆ ఒక్క కాలేజీనే 13 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయింది. అలాగే సిద్దిపేటలోనూ ప్రస్తుతం 150 సీట్లుంటే, కేవలం 25 సీట్లే పెంచారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 100 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఆ ప్రకారం అదనంగా 25 సీట్లు పెరగాల్సి ఉండగా, కేవలం 20 సీట్లే పెంచారు. అలాగే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లోనూ 100 సీట్లు ప్రస్తుతముంటే, 20 సీట్లే పెంచారు. ఇక సూర్యాపేట, నల్లగొండ మెడికల్ కాలేజీలు ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్నందున వాటికి పెంచలేదు. ఈఎస్ఐ కాలేజీకి కూడా సీట్ల పెంపు జరగలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ కనబరచడంపై విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రకు 50 శాతం వరకు పెంపు... మహారాష్ట్రలోని అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 25 శాతానికి బదులు ఏకంగా 50 శాతం వరకు సీట్లు పెంచడంలో ఆంతర్యమేంటో అంతుబట్టడంలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉదాహరణకు నాందేడ్‌లోని డాక్టర్ శంకర్రావు చవాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 100 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇప్పుడు ఆ కాలేజీకి అదనంగా మరో 50 సీట్లు పెంచారు. అంటే ఏకంగా 50 శాతం పెంచారు. అలాగే జలగాంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 100 ఎంబీబీఎస్ సీట్లుంటే, దానికి కూడా మరో 50 సీట్లు పెంచారు. మొత్తం ఆ రాష్ట్రంలో 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుంటే ఆరు కాలేజీల్లో 100 సీట్ల చొప్పున ప్రస్తుతమున్నాయి. వాటన్నింటికీ 50 సీట్ల చొప్పున పెంచారు. అంతేకాదు ఎనిమిది కాలేజీలకు ప్రస్తుతం 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటికి 38 సీట్ల చొప్పున పెంచాల్సి ఉండగా, వాటికి కూడా 50 సీట్ల చొప్పున పెంచేశారు. ముంబైలోని సేథ్ జీఎస్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 180 ఎంబీబీఎస్ సీట్లుంటే, 25 శాతం చొప్పున ఆ కాలేజీకి 45 సీట్లు పెంచాలి. కానీ ఏకంగా 70 సీట్లు పెంచారు. ఇలాగైతే రిజర్వేషన్ల అమలు ఎలా? పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలంటే, ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా 25 శాతం సీట్లు పెంచాల్సి ఉంటుంది. అప్పుడే ప్రస్తుతమున్న సీట్లకు రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బంది రాదు. పైగా రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినదు. ఇది శాస్త్రీయమైన నిబంధన. కానీ 25 శాతం సీట్లు కాకుండా 20 శాతమే పెంచితే అనేక చట్టపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో విద్యార్థులు కోర్టుకు వెళ్లే ప్రమాదమూ ఉందని అంటున్నారు. ఇక మహారాష్ట్రలో 25 శాతానికి బదులు 50 శాతం వరకు పెంచడం వల్ల కూడా రిజర్వేషన్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయని అంటున్నారు. దీనిపైనా ఇతర వర్గాల ప్రజలు కూడా కోర్టుకు వెళ్లే ప్రమాదముందని అంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల పెంపులో ఎంసీఐ నిర్వాకంపై విమర్శలు వస్తున్నాయి. -
కోటా ఖరారు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియను ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలోనే జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంపీటీసీల ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం.. మంగళవారం మండల ప్రజా పరిషత్, జెడ్పీటీసీల రిజర్వేషన్లను ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో 20 మండలాలకుగాను.. 6 ఎంపీపీ స్థానాలను ఎస్టీలకు, 6 స్థానాలను ఎస్సీలకు, 8 స్థానాలను జనరల్ స్థానాలుగా ప్రకటించారు. ఇందులో ఎస్సీలకు రిజర్వు చేసిన 6 స్థానాల్లో మూడు మహిళలకు, ఎస్టీలకు రిజర్వు చేసిన 6 స్థానాల్లో మూడు మహిళలకు కేటాయించగా.. జనరల్ స్థానాలుగా ఉన్న ఎనిమిదింట్లో 4 స్థానాలు మహిళలకు, 4 జనరల్ స్థానాలుగా ప్రకటించారు. ఇక జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్సీలకు 4, బీసీలకు 2, ఎస్టీలకు 4, జనరల్‌కు 10 స్థానాలు కేటాయించారు. ఎస్సీలకు కేటాయించిన నాలుగింట్లో రెండు మహిళలకు, బీసీల్లో కేటాయించిన రెండింట్లో ఒకటి మహిళకు, ఎస్టీలకు కేటాయిం చిన నాలుగింట్లో రెండు మహిళలకు, జనరల్‌కు కేటాయించిన పది స్థానాల్లో 5 మహిళలకు రిజర్వు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 మండలాలకుగాను.. 18 ఎంపీపీ స్థానాలను ఎస్టీలకు కేటాయించగా.. అందులో మహిళలకు 9 స్థానాలు కేటాయిం చారు. ఇక జనరల్ స్థానాలు రెండు కేటాయించగా.. అందులో ఒక ఎంపీపీ స్థానం మహిళకు కేటాయించారు. ఒక స్థానం ఎస్సీ మహిళకు కేటాయించారు. అలాగే జెడ్పీటీసీల్లో 10 స్థానాలు ఎస్టీలకు కేటాయించగా.. అందులో ఐదు మహిళలకు రిజ ర్వు చేశారు. 11స్థానాలను జనరల్‌కు కేటాయిం చారు. అందులో 6 మహిళలకు రిజర్వు చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఎంపీటీసీల రిజర్వేషన్లు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీటీసీలు మొత్తం 220 స్థానాలు ఉన్నాయి. వాటిలో ఎస్టీ మహిళలు 62, ఎస్టీ జనరల్ 56, ఎస్సీ మహిళలు 3, ఎస్సీ జనరల్ 2, జనరల్ మహిళలకు 45, జనరల్ విభాగానికి 52 స్థానాలను కేటాయించారు. -
3 లేదా 4లోగా ‘పంచాయతీ’ నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల మూడు లేదా నాలుగు తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోల్చితే బీసీ రిజర్వేషన్లు గణనీయంగా తగ్గిపోవడంపై కొన్ని వర్గాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా న్యాయపరంగా ఏవైనా చిక్కులు ఎదురైతే తప్ప అనుకున్న తేదీకే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన విడుదల కావొచ్చునని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ శుక్రవారానికల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీంతో శనివారంలోగా పూర్తి జాబితాను అందజేయాలని జిల్లా కలెక్టర్లు, డీపీఓలను పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై జిల్లా, మండల స్థాయిలో కసరత్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే సగానికిపైగా జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు పూర్తయినట్లు సమాచారం. కొన్నిచోట్ల మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల నిర్ధారణలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కిందిస్థాయి అధికారులు ఎదుర్కొంటున్న సాంతికేతిక, ఇతరత్రా సమస్యలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారానికల్లా రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు పీఆర్ కమిషనర్‌కు అందే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వాటికి అనుగుణంగానే జిల్లాల్లో రిజర్వేషన్లపై కలెక్టర్లు గెజిట్లు విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. జిల్లాల నుంచి వచ్చిన గెజిట్లను క్రోడీకరించి పీఆర్ ముఖ్యకార్యదర్శి లేదా కమిషనర్ వైపు నుంచి శనివారానికల్లా రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) రిజర్వేషన్ల జాబితా అందించవచ్చని తెలుస్తోంది. ఈ జాబితాను అన్ని కోణాల్లో పరిశీలించి వాటిపై న్యాయ సలహా తీసుకున్నాక ఎస్ఈసీ కూడా రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
మా ఊరు ఎవరికి?
జోగిపేట(అందోల్): సార్ మా ఊరు ఎవరికి, ఏ రిజర్వేషన్ వచ్చింది..ఇంకా కాలేదా? ఎవరికి వచ్చే అవకాశం ఉంది? అంటూ రాజకీయ నాయకులు మండలాల్లోని ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ స్థాయి అధికారులకు ఫోన్ చేస్తూ రిజర్వేషన్లు తెలుసుకునే ఆత్రుతను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు కూడా తమ గ్రామాల్లోని నాయకులకు ఫోన్ చేస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. రేపో, మాపో రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో అటు ఆశాశహులు, ఇటు సాధారణ జనం సైతం ఉత్సుకతను కనబరుస్తున్నారు. హైదరాబాద్, బొల్లారం, పటాన్చెరు, ఇస్నాపూర్ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు వారి గ్రామాల్లోని రాజకీయ నాయకులు, మిత్రులకు ఫోన్ చేసి మన ఊరు సర్పంచి ఎవరికొచ్చింది? అంటూ ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆశావహుల్లో మాత్రం టెన్షన్ నెలకొంది. రిజర్వేషన్ తమకు వ్యతిరేకంగా వస్తే రాజకీయ భవిష్యత్తు ఏమవుతోందోననే భయం చాలా మందిని వెంటాడుతోంది. తమ గ్రామం ఫలానా కేటగిరీకి రిజర్వు అయిందనే పుకార్లు చాలా గ్రామాల్లో షికారు చేస్తున్నాయి. కొందరు నాయకులు ఏ రిజర్వేషన్ వస్తే ఆ రిజర్వేషన్‌కు అనుకూలమైన, సమర్థులైన అభ్యర్థులను వెతికే పనిలో ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలించకపోయినా తమ చెప్పు చేతల్లో ఉండే అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామంలో మంచి పేరు, కులం, వర్గం, డబ్బు, హోదా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరికొందరు ఆశావహులు పోటీ చేస్తాను మీ మద్దతు కావాలని కోరుతున్నారు. ఓసీ అయితే మీరు.. బీసీ అయితే మాకు మద్దతివ్వండి అంటూ ఒప్పం దాలు కుదుర్చుకుంటున్నారు. ఒకే పార్టీలో ఇద్దరు ఆశావహులుంటే ఒకరు ఎంపీటీసీ, మరొకరు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పరస్పర అంగీకారాలకు వస్తున్నారు. సర్పంచ్‌స్థానాలకు పోటీఎక్కువగా ఉండనుంది. ఒక్కో అడుగు ముందుకు.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే జిల్లాల వారీగా కోటా లు ఖరారవగా 29లోగా పంచాయతీల వారీ గా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు జనవరి 10వ తేదీలోగా మొదటి విడత ఎన్నికల నిర్వాహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అధికార యంత్రాంగం ముందుకు కదులుతోంది. అధికారుల శిక్షణ, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల వంటి ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు. రిజర్వేషన్ల కోటా ప్రకటించడంతో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. జిల్లాలో 647 పంచాయతీలు జిల్లాలో 647 పంచాయతీలు ఉన్నాయి. ఇం దులో పూర్తిగా ఎస్టీలు ఉన్న 74 పంచాయతీలు ఎస్టీలకు కేటాయించారు. ఇందులో 37 ప్రత్యేకంగా కేటాయించారు. మరో 37 స్థానాలను జనరల్‌గా మహిళ లేదా పురుషులు పో టీచేసేందుకు వీలు కల్పిస్తూ రిజర్వేషన్ కల్పిం చారు. జిల్లాలోని పంచాయతీల్లో 285 స్థానాలను మహిళలకు కేటాయించారు. ఒకటి, రెండు రోజుల్లో పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈనెల 29లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి పంచాయతీ రాజ్ కమిషనర్‌కు నివేదిస్తే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందని భావించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. -
పంచాయతీ కొలిక్కి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సం‘గ్రామం’లో కీలక క్రతువు ముగిసింది. పంచాయతీల రిజర్వేషన్లకు జిల్లా యంత్రాంగం తుదిరూపునిచ్చింది. వివిధ కేటగిరీల కింద రాష్ట్ర సర్కారు జిల్లాకు నిర్దేశించిన కోటాను మండలాల వారీగా కేటాయించింది. ఈ జాబితాలను బుధవారం ఆర్డీఓలకు పంపిన కలెక్టర్ లోకేశ్‌కుమార్.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించారు. ఎల్లుండి (29వ తేదీ)లోపు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీంతో ఆగమేఘాల మీద గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ఖరారును అధికారయంత్రాంగం చేపట్టింది. మండలాలవారీగా పంచాయతీల రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఏ గ్రామం ఎవరికి కేటాయించారనే ఉత్కంఠకు నేడో, రేపో తెరపడనుంది. మరోవైపు జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల పరిధిలోని 5,020 వార్డుల రిజర్వేషన్లపై ఎంపీడీఓ, ఈవోపీఆర్డీలు కసరత్తు మొదలు పెట్టారు. ఇదిలావుండగా, ప్రతి కేటగిరీలోనూ మహిళలకు సగం సీట్లను రిజర్వ్ చేశారు. కాగా, జనరల్ కేటగిరీలో మాత్రం ఒక మండలంలో ఏడు స్థానాలుంటే అందులో నాలుగింటిని మహిళలకు, మూడు పురుషులకు ఖరారు చేశారు. మొత్తం సర్పంచ్ పదవుల్లో 50శాతం అన్‌రిజర్వ్ చేశారు. వీటిలో ఎవరైనా పోటీచేసే వెసులుబాటు ఉంటుంది. పల్లెల్లో రాజకీయ వేడి గ్రామపంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుండడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్ల అమలులోప్రభుత్వం సమూల మార్పులు చేసింది. రొటేషన్ విధానానికి స్వస్తి పలికిన సర్కారు.. రెండు పర్యాయాలు ఒకే కేటగిరీ కింద పంచాయతీలను రిజర్వ్ చేస్తోంది. పదేళ్ల వరకు ఇదే రిజర్వేషన్ కొనసాగనుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. -
రిజర్వేషన్ల రోస్టర్ ప్రకటించకపోవడం తప్పే
సాక్షి, హైదరాబాద్: ఉర్దూ అధికారులు గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టుల భర్తీ సమయంలో రిజర్వేషన్ల కోటాను పేర్కొనకుండా భర్తీ ప్రకటన జారీ చేయడం చట్ట వ్యతిరేకమనే అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. అందుకే ఈ కేసులో ఇప్పటికే గ్రేడ్–2 పోస్టుల ఫలితాలు వెలువడినందున ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశించినట్లు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రోస్టర్ విధానాన్ని అమలు చేయకపోవడం తప్పుకాక ఏమవుతుందని ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ను నిలదీశారు. ఉద్యోగ భర్తీ ప్రకటనలో రిజర్వేషన్ల ప్రక్రియను ఎందుకు పేర్కొనలేదో వివరించాలని ఉర్దూ అకాడమీని ఆదేశించా రు. పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తామని, అందుకు గడువు కావాలని ఉర్దూ అకాడమీ తరఫు న్యాయవాది కోరారు. అందుకు అనుమతించిన న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. కాగా, మైనార్టీ సంక్షేమ శాఖలోని ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గత మార్చి 28న గ్రేడ్–1, గ్రేడ్–2లకు చెందిన 60 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. ఈ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లను అమలు చేయకపోవడం చెల్లదని, సర్వీస్ కమిషన్ ద్వారా కాకుండా నేరుగా ఉర్దూ అకాడమీ పోస్టుల భర్తీ ప్రకటన విడుదల చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ మహ్మద్ ముత్తాబి అలీఖాన్ ఇతరులు హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సర్వీస్ రూల్స్‌లోని 22వ నిబంధన ప్రకారం రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని, ఈ భర్తీ ప్రకటన చెల్లదని పిటిషనర్ల వాదన. గ్రేడ్–2 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడంతో వారి వాదన వినా ల్సి ఉందని, కాబట్టి వారందరినీ ప్రతివాదులుగా చేయాలని గత విచారణ సమయంలో పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఉర్దూ అకాడమీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. రోస్టర్ ప్రకటించకపోవడం చిన్నపాటి తప్పిదమన్నారు. రోస్టర్ ప్రకటించకపోవడం చిన్న తప్పు కాదని, పెద్ద తప్పిదమేనని న్యాయమూర్తి అన్నారు. ఎంపికైన అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చడంపై న్యాయవాది అభ్యంతరం చెప్పగా, ఎంపికయ్యారు కాబట్టే వారి వాదన వినా ల్సి ఉంటుందని, అందుకే ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించామని, సమగ్ర విచారణ జరపాల్సి ఉందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. -
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయండి
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఉన్నతాధికారుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సుప్రీం తీర్పును అనుసరించి పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ అన్ని విభాగాలకు ఉత్తర్వులు జారీచేస్తూ.. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి. అదే సమయంలో ఉత్తర్వుల్లో తప్పనిసరిగా .. ‘పదోన్నతి సుప్రీం కోర్టు తుది ఆదేశాలకు లోబడి ఉంటుంది’ అని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఒక అధికారి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని జూన్ 5న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చని పేర్కొంది. -
లోక్‌సభలో కొనసాగిన టీఆర్ఎస్ ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బూర నరసయ్య గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, జి.నగేష్, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు వెల్‌లో నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఏఐడీఎంకే సభ్యులు కూడా కావేరి నది బోర్డు ఏర్పాటుపై తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన అనంతరం కూడా టీఆర్ఎస్, ఏఐడీఎంకే సభ్యుల ఆందోళన కొనసాగడంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. శ్రీరామ నవమి సందర్భంగా సభ్యుల విజ్ఞప్తి మేరకు సోమవారం కూడా సెలవు ఇస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తమ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు తమ నిరసన విరమించబోమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంపై వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చకు తమ నిరసన అడ్డుకాదని, అవిశ్వాసంపై స్పీకర్ చర్చకు అనుమతిస్తే అందులో పాల్గొనేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని నాయక్ తెలిపారు. -
మళ్లీ మున్సి‘పోల్స్’ సందడి
సాక్షి, కరీంనగర్ :మున్సిపల్ ఎన్నికల హడావుడి మళ్లీ మొదలు కానుంది. నాలుగు వారాల్లో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరికొంత సమయం కావాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. మున్సిపాలిటీల పదవీకాలం 2010 సెప్టెంబర్‌లో పూర్తయింది. అప్పటినుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు, జనాభా వివరాలకు సంబంధించి ఆటంకాలు ఏర్పడ్డాయి. సహకార, పంచాయతీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ బల్దియా ఎన్నికలు నిర్వహించాలని భావించింది. పార్టీ రహిత ఎన్నికలయిన పంచాయతీ, సహకార ఎన్నికలకు, పార్టీ గుర్తులపై జరిగే మున్సిపల్ ఎన్నికలకు తేడా ఉంటుందని, పట్టణాలు, నగరాల్లో ఓటర్ల ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయని ప్రభుత్వం అప్పట్లో వాయిదాల వైపే మొగ్గుచూపింది. పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నా అధికారయంత్రాంగం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎప్పుడు ఉత్తర్వులు వచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. సాధ్యమయ్యేనా? ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోనే సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుందన్న ఊహాగానాల నేపథ్యంలో నాలుగు వారాల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఈ అనుమానాలను పెంచుతున్నాయి. గతంలో ఎన్నికలను పూర్తి చేసేందుకు హైకోర్టు 2013 సెప్టెంబర్ 2వరకు గడువు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినా గడువులోగా ఎన్నికలు సాధ్యపడలేదు. దీంతో ప్రభుత్వం మరో నాలుగు నెలల గడువు కోరింది. ఈ గడువులోగా ఎన్నికలు పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. తాజాగా కోర్టు నాలుగు వారాల్లో ఎన్నికలు పూర్తి చేయాలనడం ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. పట్టణాల్లో సందడి.. హైకోర్టు ఉత్తర్వులతో జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సందడి మొదలయ్యింది. ప్రభుత్వం ఏం చేయనుందన్న చర్చ ఒకవైపు సాగుతుండగా... మరోవైపు ఆశావాహులు పోటీకి సిద్ధమవుతున్నారు. దాదాపు నాలుగేళ్లుగా బల్దియాలకు ఎన్నికలు జరగకపోవడం వల్ల స్థానిక నేతలు నిరాశకు గురయ్యారు. పార్టీల నేతల చుట్టూ తిరుగుతూ కాలం గడిపిన తమకు ప్రజాప్రతినిధులయ్యే అవకాశం వచ్చిందన్న ఉత్సాహంతో ఉన్నారు. పార్టీపరంగా జరుగనున్న ఎన్నికలు కావడంతో తమ అభ్యర్థిత్వాలకు నేతల ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల కారణంగా కొన్ని స్థానాలకు పోటీ విపరీతంగా ఉండనుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పరిధిలో రిజర్వేషన్లను ఖరారు చేసి మున్సిపల్ వ్యవహారాల శాఖకు పంపారు. అధికారికంగా ఈ రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. మేయర్లు, చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్రం యూనిట్‌గా ఖరారు చేస్తారు. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీల పరిధిలోని వంద డివిజన్లు, 226 వార్డులకు ఎప్పుడయినా ఎన్నికల నిర్వహణకు బల్దియా అధికారులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఇందుకు అవసరమయిన ఎన్నికల సామగ్రిని సైతం సమకూర్చిపెట్టుకున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టేందుకు మున్సిపల్ వ్యవహారాల శాఖ తయారుగా ఉందని అధికారులు చెప్తున్నారు.