సాక్షి, కరీంనగర్ :మున్సిపల్ ఎన్నికల హడావుడి మళ్లీ మొదలు కానుంది. నాలుగు వారాల్లో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరికొంత సమయం కావాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. మున్సిపాలిటీల పదవీకాలం 2010 సెప్టెంబర్‌లో పూర్తయింది. అప్పటినుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు, జనాభా వివరాలకు సంబంధించి ఆటంకాలు ఏర్పడ్డాయి. సహకార, పంచాయతీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ బల్దియా ఎన్నికలు నిర్వహించాలని భావించింది. పార్టీ రహిత ఎన్నికలయిన పంచాయతీ, సహకార ఎన్నికలకు, పార్టీ గుర్తులపై జరిగే మున్సిపల్ ఎన్నికలకు తేడా ఉంటుందని, పట్టణాలు, నగరాల్లో ఓటర్ల ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయని ప్రభుత్వం అప్పట్లో వాయిదాల వైపే మొగ్గుచూపింది. పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నా అధికారయంత్రాంగం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎప్పుడు ఉత్తర్వులు వచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
సాధ్యమయ్యేనా?
ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోనే సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుందన్న ఊహాగానాల నేపథ్యంలో నాలుగు వారాల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఈ అనుమానాలను పెంచుతున్నాయి. గతంలో ఎన్నికలను పూర్తి చేసేందుకు హైకోర్టు 2013 సెప్టెంబర్ 2వరకు గడువు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినా గడువులోగా ఎన్నికలు సాధ్యపడలేదు. దీంతో ప్రభుత్వం మరో నాలుగు నెలల గడువు కోరింది. ఈ గడువులోగా ఎన్నికలు పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. తాజాగా కోర్టు నాలుగు వారాల్లో ఎన్నికలు పూర్తి చేయాలనడం ప్రభుత్వానికి సవాలుగా మారనుంది.
పట్టణాల్లో సందడి..
హైకోర్టు ఉత్తర్వులతో జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సందడి మొదలయ్యింది. ప్రభుత్వం ఏం చేయనుందన్న చర్చ ఒకవైపు సాగుతుండగా... మరోవైపు ఆశావాహులు పోటీకి సిద్ధమవుతున్నారు. దాదాపు నాలుగేళ్లుగా బల్దియాలకు ఎన్నికలు జరగకపోవడం వల్ల స్థానిక నేతలు నిరాశకు గురయ్యారు. పార్టీల నేతల చుట్టూ తిరుగుతూ కాలం గడిపిన తమకు ప్రజాప్రతినిధులయ్యే అవకాశం వచ్చిందన్న ఉత్సాహంతో ఉన్నారు. పార్టీపరంగా జరుగనున్న ఎన్నికలు కావడంతో తమ అభ్యర్థిత్వాలకు నేతల ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల కారణంగా కొన్ని స్థానాలకు పోటీ విపరీతంగా ఉండనుంది.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పరిధిలో రిజర్వేషన్లను ఖరారు చేసి మున్సిపల్ వ్యవహారాల శాఖకు పంపారు. అధికారికంగా ఈ రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. మేయర్లు, చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్రం యూనిట్‌గా ఖరారు చేస్తారు. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీల పరిధిలోని వంద డివిజన్లు, 226 వార్డులకు ఎప్పుడయినా ఎన్నికల నిర్వహణకు బల్దియా అధికారులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఇందుకు అవసరమయిన ఎన్నికల సామగ్రిని సైతం సమకూర్చిపెట్టుకున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టేందుకు మున్సిపల్ వ్యవహారాల శాఖ తయారుగా ఉందని అధికారులు చెప్తున్నారు.
మళ్లీ మున్సి‘పోల్స్’ సందడి
Published Tue, Feb 4 2014 3:29 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement