జోగిపేట(అందోల్): సార్ మా ఊరు ఎవరికి, ఏ రిజర్వేషన్ వచ్చింది..ఇంకా కాలేదా? ఎవరికి వచ్చే అవకాశం ఉంది? అంటూ రాజకీయ నాయకులు మండలాల్లోని ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ స్థాయి అధికారులకు ఫోన్ చేస్తూ రిజర్వేషన్లు తెలుసుకునే ఆత్రుతను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు కూడా తమ గ్రామాల్లోని నాయకులకు ఫోన్ చేస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. రేపో, మాపో రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో అటు ఆశాశహులు, ఇటు సాధారణ జనం సైతం ఉత్సుకతను కనబరుస్తున్నారు. హైదరాబాద్, బొల్లారం, పటాన్‌చెరు, ఇస్నాపూర్ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు వారి గ్రామాల్లోని రాజకీయ నాయకులు, మిత్రులకు ఫోన్ చేసి మన ఊరు సర్పంచి ఎవరికొచ్చింది? అంటూ ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆశావహుల్లో మాత్రం టెన్షన్ నెలకొంది. రిజర్వేషన్ తమకు వ్యతిరేకంగా వస్తే రాజకీయ భవిష్యత్తు ఏమవుతోందోననే భయం చాలా మందిని వెంటాడుతోంది.
తమ గ్రామం ఫలానా కేటగిరీకి రిజర్వు అయిందనే పుకార్లు చాలా గ్రామాల్లో షికారు చేస్తున్నాయి. కొందరు నాయకులు ఏ రిజర్వేషన్ వస్తే ఆ రిజర్వేషన్‌కు అనుకూలమైన, సమర్థులైన అభ్యర్థులను వెతికే పనిలో ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలించకపోయినా తమ చెప్పు చేతల్లో ఉండే అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామంలో మంచి పేరు, కులం, వర్గం, డబ్బు, హోదా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరికొందరు ఆశావహులు పోటీ చేస్తాను మీ మద్దతు కావాలని కోరుతున్నారు. ఓసీ అయితే మీరు.. బీసీ అయితే మాకు మద్దతివ్వండి అంటూ ఒప్పం దాలు కుదుర్చుకుంటున్నారు. ఒకే పార్టీలో ఇద్దరు ఆశావహులుంటే ఒకరు ఎంపీటీసీ, మరొకరు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పరస్పర అంగీకారాలకు వస్తున్నారు. సర్పంచ్‌స్థానాలకు పోటీఎక్కువగా ఉండనుంది.
ఒక్కో అడుగు ముందుకు..
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే జిల్లాల వారీగా కోటా లు ఖరారవగా 29లోగా పంచాయతీల వారీ గా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు జనవరి 10వ తేదీలోగా మొదటి విడత ఎన్నికల నిర్వాహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అధికార యంత్రాంగం ముందుకు కదులుతోంది. అధికారుల శిక్షణ, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల వంటి ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు. రిజర్వేషన్ల కోటా ప్రకటించడంతో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది.
జిల్లాలో 647 పంచాయతీలు
జిల్లాలో 647 పంచాయతీలు ఉన్నాయి. ఇం దులో పూర్తిగా ఎస్టీలు ఉన్న 74 పంచాయతీలు ఎస్టీలకు కేటాయించారు. ఇందులో 37 ప్రత్యేకంగా కేటాయించారు. మరో 37 స్థానాలను జనరల్‌గా మహిళ లేదా పురుషులు పో టీచేసేందుకు వీలు కల్పిస్తూ రిజర్వేషన్ కల్పిం చారు. జిల్లాలోని పంచాయతీల్లో 285 స్థానాలను మహిళలకు కేటాయించారు. ఒకటి, రెండు రోజుల్లో పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈనెల 29లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి పంచాయతీ రాజ్ కమిషనర్‌కు నివేదిస్తే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందని భావించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment