గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్ శాతాలను ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిర్ణయిం చింది. ఈ శాతాలకు అనుగుణంగా జిల్లాలో కేటగిరీల వారీగా కేటాయించాల్సిన సర్పంచ్ స్థానాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలకు గాను, 74 పంచాయతీలను షెడ్యూల్ ఏరియా పంచాయతీలుగా ఎస్టీలకు కేటాయించింది. మిగతా 573 పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్ల గణాంకాలకు అనుగుణంగా ఆయా కేటగిరీలకు మండలాల వారీగా నిర్ణయించాల్సి ఉంది. మండలాల వారీగా ఏయే కేటగిరీలకు ఎన్ని స్థానాలు రిజర్వు చేయాలనే అంశంపై జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు పూర్తి చేసి కలెక్టర్ ఆమోదం కోసం పంపించారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలకు గాను వంద శాతం గిరిజన జనాభా ఉన్న 74 పంచాయతీలను షెడ్యూలు పంచాయతీలుగా పేర్కొంటూ సర్పంచ్ పదవులను ఎస్టీలకు కేటాయించారు. మిగతా 573 పంచాయతీలను నాన్ షెడ్యూలు పంచాయతీలుగా పేర్కొంటూ.. సర్పంచ్ పదవులను రిజర్వు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. నాన్ షెడ్యూల్డ్ పంచాయతీల్లో ఎస్టీలకు 19, ఎస్సీలకు 129, బీసీలకు 138 సర్పంచ్ పదవులతో పాటు, అన్ రిజర్వుడు కేటగిరీలో 278 మందికి కేటాయించాల్సిందిగా ఆదేశించింది. ప్రతీ కేటగిరీలోనూ మహిళల రిజర్వేషన్ కోటా 50శాతం ఉండాలని ఆదేశించింది. దీంతో జిల్లాను యూనిట్‌గా తీసుకుని తిరిగి మండలాల వారీగా సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్ కోటాను జిల్లా పంచాయతీ విభాగం నిర్ణయించింది.
మండలాల వారీగా ఏయే కేటగిరీలకు ఎన్ని స్థానాలు కేటాయిం చాలనే అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. గురువారం ఉదయం ఈ ప్రతిపాదనలను కలెక్టర్ ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కలెక్టర్ ఆమోదించిన తర్వాత సంబంధిత ఆర్డీఓల పర్యవేక్షణలో ఈ నెల 29వ తేదీలోగా మండలాలు, కేటగిరీల వారీగా సర్పంచ్ పదవుల రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే జిల్లాలోని 5,778 గ్రామ పంచాయతీ వార్డులకు గాను, 74 షెడ్యూల్డు పంచాయతీల్లోని వార్డులను మినహాయించి మిగతా వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేయడంపైనా అధికారులు సన్నద్ధమవుతున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు మండలాన్ని యూనిట్‌గా తీసుకుని, గ్రామ పంచాయతీలో ఏయే కేటగిరీలకు ఎన్ని వార్డులు కేటాయించాలనే కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 29 నాటికి కేటగిరీల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.
రొటేషన్ కథ మళ్లీ మొదటికి..!
పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు నాలుగు పర్యాయాలు సాధారణ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పంచాయతీలకు తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండగా, 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం త్వరలో జరిగే ఎన్నికలను తొలి సాధారణ పంచాయతీ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. దీంతో గత నాలుగు ఎన్నికల్లో జరిగిన రొటేషన్ విధానంతో సంబంధం లేకుండా, ఈసారి జరిగే ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను తాజాగా నిర్ణయిస్తున్నారు. దీంతో గత నాలుగు పర్యాయాలు పంచాయతీ ఏ కేటగిరీకి రిజర్వు అయ్యిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు.
మరోవైపు కొత్తగా వందకు పైగా పంచాయతీలు ఏర్పడటంతో.. గత రిజర్వేషన్లతో ఏ మాత్రం పొంతన లేకుండా.. ప్రస్తుత రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల శాతం కూడా తగ్గడంతో సర్పంచ్ పదవుల రిజర్వేషన్లలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో మాత్రం గత నాలుగు పర్యాయాలు జరిగిన రొటేషన్ రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తూ, తమ పంచాయతీ ఏ కేటగిరీకి కేటాయించే అవకాశం ఉందనే కోణంలో ఔత్సాహికులు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 29 నాటికి పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై స్పష్టత రానుండగా, వివిధ పార్టీల నేతలు, ఔత్సాహికులు రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment