కాసుల కృష్ణకు పార్టీ సభ్యత్వం అందజేస్తున్న చెరుకు సుధాకర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకొని అసభ్యకర భాషలో విమర్శిస్తున్నారని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. సుప్రీంకోర్టుకు బీసీ జనాభా లెక్కలు సమర్పించి రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడి ఆదర్శ్‌నగర్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ద్వారా జరిగే మార్పులు ఏమీ ఉండవని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు తీవ్ర ప్రభావం చూపిందన్నారు.
తెలంగాణ అమరులు, ఉద్యమకారుల సంక్షేమం గురించి కేసీఆర్ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. వివిధ పత్రికలు, చానెళ్లను చెప్పుచేతల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో యాజమాన్యాలను బెదిరించడం అప్రజాస్వామికమన్నారు. సుధాకర్ సమక్షంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధికార ప్రతినిధి కాసుల కృష్ణ ఇంటి పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం ఇంటి పార్టీయేనని, అందుకే ఈ పార్టీలో చేరుతున్నానని కాసుల కృష్ణ తెలిపారు. సమావేశంలో ఇంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొమ్మాట వెంకటేశ్వర్లు, బుర్ర శ్రీనివాస్‌గౌడ్, నేతలు కొమురయ్య, హరీశ్‌యాదవ్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment