ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ వస్తుందో నేటితో తేలిపోనుంది. గురువారం అధికారులు లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వ్‌డ్ గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. ఇప్పటికే అధికారులకు ఏ విధంగా రిజర్వేషన్ కేటాయించాలో కలెక్టర్ అవగాహన కల్పించారు. దీంతో ఆశావహులు ఆసక్తిగా గమనిస్తున్నారు. తమకు అనుకూలంగా వస్తుందా..? రాదా..? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
సాక్షి, మెదక్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలపై చర్చ ఊపందుకుంది. ఇప్పటికే పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ ధర్మారెడ్డి పర్యవేక్షణలో డీపీఓ, ఆర్డీఓలు రిజర్వేషన్లపై కసరత్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రం రిజర్వేషన్లపై అమలులో పాటించాల్సిన మార్గదర్శకాల గురించి కలెక్టర్ ఆర్డీఓలు, ఎంపీడీఓలకు అవగాహన కల్పించారు. లాటరీ పద్ధతిలో మహిళా రిర్వేషన్లను ఖరారు చేయనున్నారు. అలాగే జనాభా ప్రాతిపదికన మండల యూనిట్‌గా ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను చేపట్టనున్నారు. నేడో, రేపో గ్రామాల వారీగా పంచాయతీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆశావహుల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది.
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం 469 పంచాయతీలున్నాయి. ఇందులో 236 గ్రామాలను మహిళలకు రిజర్వు చేశారు. వందశాతం ఎస్టీ జనాభా ఉన్న 63 పంచాయతీలను, జనాభా ప్రాతిపదికన అదనంగా మరో 17 గ్రామాలను ఎస్టీలకు రిజర్వు చేశారు. దీంతో ఎస్టీలకు కేటాయించిన స్థానాల సంఖ్య 80కి చేరింది. ఎస్సీలకు 66, బీసీలకు 120 పంచాయతీలను రిజర్వు చేశారు. జనరల్ కేటగిరిలో 233 పంచాయతీలను ఉంచారు. 2011 జనాభా ఆధారంగా మండలం యూనిట్‌గా ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలంటూ ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా కలెక్టర్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో గురువారం అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. డీపీఓ హనూక్, ఆర్డీఓలు వీరబ్రహ్మాచారి, వెంకటేశ్వర్లు, శ్యాంప్రకాశ్‌లు రిజర్వేషన్ల ప్రక్రియపై కసరత్తు చేపట్టారు. లాటరీ పద్ధతిలో మహిళలకు రిజర్వు చేసిన పంచాయతీలను ఎంపిక చేశారు. జనాభా ఆధారంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ పంచాయతీల రిజర్వేషన్‌లను నేడు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు వివరాలు ప్రకటించనున్నారు. గత ఎన్నికలో కంటే బీసీలకు తక్కువ పంచాయతీలు రిజర్వు కానున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల శాతం తగ్గటమే ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు.
ఓటర్ల లెక్క తేలింది..
జిల్లాలో ఓటర్ల లెక్క కూడా తేలింది. మొత్తం పంచాయతీల్లో 4,63,405 మంది ఓటర్లున్నారు. ఇందులో బీసీ ఓటర్లు 2,97,091 మంది ఉండగా ఎస్సీ ఓటర్లు 77,741, ఎస్టీ ఓటర్లు 50,451 మంది ఉన్నారు. బీసీ ఓటర్లులో మహిళలు 1,52,161 ఉండగా పురుషులు1,44,920 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లలో మహిళలు 25,738 మంది ఉండగా పురుషులు 24,713 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లలో మహిళలు 40,576 ఉండగా పురుషులు 37,163 మంది ఉన్నట్లు తేలింది. ఓటర్ల సవరణలో భాగంగా జిల్లాలో 15,096 మంది ఓట్లు తొలగించగా 1,784 మంది ఓటర్ల పేర్లు, చిరునామాలు సవరించారు. ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య కొంత మేర పెరిగే అవకాశం ఉంది. జనవరి 25వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. దీంతో ఎన్నికలు నిర్వహించే సమయానికి ఓటర్ల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment