మెదక్ అర్బన్: హైకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో గ్రామ పంచాయతీలకు సాధారణ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 11ను ప్రామాణికంగా తీసుకొని పంచాయతీల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పూర్తి చేయాలనే హైకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల్లో తెలియపర్చింది. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శుల సేవలను వినియోగించుకొని తక్షణమే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించాల్సిందిగా ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులను ఎప్పటిలోగా పూర్తి చేయాలనే విషయాలపై గడువును నిర్దేశిస్తూ షెడ్యూల్‌ను జారీ చేసింది.
అలాగే గ్రామపంచాయతీ పాలకమండళ్ల ఐదేళ్ల పదవీ కాల పరిమితి ఈ సంవత్సరం ఆగస్టు 2తో ముగిసింది. వీళ్ల కాలపరిమితి ముగిసేలోగా పంచా యతీ ఎన్నికలు జరగకపోవడంతో ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రత్యేకాధికారులకు గ్రామపంచాయతీల పరిపాలన బాధ్యతలను అప్పగించారు. అయితే నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారుల పాలన మూడు నెలలకు మించి కొనసాగేందుకు వీలులేదు. ఈనెల 11న హైకోర్టు వెలువరించిన ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో గతంలో పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు జాబితా తయారీ, బ్యాలెట్ బాక్సుల ఏర్పాట్లు, బ్యాలెట్ పేపర్లు, సిబ్బందిని సైతం సిద్ధంగా ఉంచారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో తిరిగి ఓటరు జాబితాను తయారు చేయాల్సి ఉంది. నూతన జాబితా ప్రకారం సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, పేపర్లను తిరిగి కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది.
ఇదీ ఎన్నికల కమిషన్ షెడ్యూల్..
- సెప్టెంబరు 25 నాటి అసెంబ్లీ ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను రూపొందించాలి.
- నవంబరు మొదటి వారం నుంచి మూడో వారం వరకు ఓటరు జాబితా తయారీ ప్రక్రియ పూర్తి చేయాలి.
- జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీఓ, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతలు చేపట్టాలి.
- ఓటరు సంఖ్య ఆధారంగా పోలింగ్ స్టేషన్లను గుర్తించి పోలింగ్‌స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను రూపొందించాల్సి ఉంటుంది.
- నవంబరు నాలుగోవారం నుంచి డిసెంబరు మొదటివారం లోగా ప్రక్రియ పూర్తి కావాలి.
- రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల జాబితాను సరి చూసుకోవడంతో పాటు స్టేజ్–1, స్టేజ్–2 అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.
నవంబరు నాలుగో వారంలో స్టేజ్–1, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు, డిసెంబరు మొదటి వారంలో స్టేజ్–2 , రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణనివ్వాలి. సంబంధిత ఆర్డీఓలు ఈ శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించాలి.పోలింగ్ సిబ్బంది జాబితా సవరించి నవంబరు రెండో వారంలో ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు డిసెంబరు రెండో వారంలో శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి.
గతంలోనే ఏర్పాట్లు పూర్తి
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలోనే జిల్లాలో పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. కొత్తగా వచ్చిన ఓటరు జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికలకు కావాల్సిన సౌకర్యాలు రూపొందించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ మేరకు బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకం వంటి వాటిపై కసరత్తు పూర్తయింది. పంచాయతీల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా అందుకు తగిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. –హనోక్, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment