అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోవడంలో విఫలమైంది. ప్రత్యర్థి పార్టీల నుంచి వలసలపైనే పూర్తిగా ఆధార పడడంతో అభ్యర్థుల ఎంపికలో తడబాటుకు గురైంది. చివరి నిమిషంలో అవకాశం దక్కించుకున్న అభ్యర్థుల అనుభవరాహిత్యం ఓట్ల వేటలో అడ్డంకిగా మారింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా స్టార్ క్యాంపెయినర్లు తరలివచ్చినా ఓటర్లను ప్రభావితం చేయలేకపోయారు. నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి, దుబ్బాకలో రఘునందన్‌రావు మినహా మిగతా అభ్యర్థులెవరూ ఓటర్లపై తమదైన ముద్ర వేయలేకపోయారు.
–సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పదకొండు అసెంబ్లీ స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ రద్దయినా, బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం చేసింది. నాలుగు విడతల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేయగా తొలి జాబితాలో టీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ అందోలు, దుబ్బాక అభ్యర్థి రఘునందన్‌రావును మాత్రమే ఖరారు చేసింది. రెండో జాబితాలో నాయిని నరోత్తమ్ రెడ్డికి సిద్దిపేట స్థానాన్ని ఖరారు చేశారు. మూడు, నాలుగో జాబితాను విడుదల చేయడంలో బీజేపీ నాయకత్వం తీవ్ర జాప్యం చేసింది. పార్టీ జిల్లాలో సంస్థాగతంగా బలహీనంగా ఉండడం, చాలా చోట్ల బలమైన అభ్యర్థులు లేకపోవడంతో.. ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్త నేతల కోసం వేట సాగించింది. ప్రత్యర్థి పార్టీల నుంచి అలాంటి సంకేతాలు లేకపోవడంతో చివరికి పార్టీలో కొత్తగా చేరిన నేతలకు అవకాశం ఇచ్చింది.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో జిల్లాతో ఏ మాత్రం సంబంధం లేని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయను బరిలోకి దించింది. మెదక్ అభ్యర్థి ఆకుల రాజయ్య, నర్సాపూర్ అభ్యర్థి సింగాయిపల్లి గోపి మినహా, మిగతా నియోజకవర్గాల అభ్యర్థులందరూ ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వారే కావడం గమనార్హం. పటాన్‌చెరు నుంచి కరుణాకర్‌రెడ్డి, సంగారెడ్డి నుంచి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, జహీరాబాద్‌లో జంగం గోపి చివరి నిమిషంలో పార్టీ అభ్యర్థులుగా తెరమీదకు వచ్చారు. నారాయణఖేడ్ అభ్యర్థిగా ఎంపిక చేసిన రవికుమార్ గౌడ్‌ను తప్పించి చివరి క్షణంలో నాటకీయ పరిణామాల నడుమ కాంగ్రెస్ అసంతృప్త నేత సంజీవరెడ్డికి అవకాశం కల్పించారు.
ఫలితమివ్వని ‘స్టార్’ క్యాంపెయినింగ్
పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావించిన నియోజకవర్గాల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నారాయణఖేడ్, దుబ్బాక సభల్లో పాల్గొనగా, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంగారెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, స్మృతి ఇరానీతో పాటు పరిపూర్ణానంద తదితరులు కూడా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అమిత్‌షా పర్యటించిన నియోజకవర్గాలు నారాయణఖేడ్, దుబ్బాకలో మాత్రమే పార్టీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించారు. గజ్వేల్, అందోలు, నర్సాపూర్ బీజేపీ అభ్యర్థులు మూడు వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. జహీరాబాద్ నుంచి తొలిసారిగా పోటీ చేసిన జంగం గోపి ఏకంగా 19వేల పైచిలుకు ఓట్లు సాధించడం బీజేపీకి కొంత ఊరటనిచ్చేదిగా ఉంది. సిద్దిపేట, సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్ అభ్యర్థులు ఎనిమిది వేల లోపు ఓట్లతో సరిపెట్టుకున్నారు.
పార్టీని వీడిన ముఖ్య నేతలు
ఓ వైపు ఇతర పార్టీల నుంచి అసంతృప్త నేతల రాకకోసం ఎదురుచూసిన బీజేపీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. కొంతకాలంగా పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ టీఆర్‌ఎస్‌లో చేరడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. అదే బాటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదిలా ఉంటే మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి సంగారెడ్డి టికెట్‌ను ఆశిస్తూ బీజేపీలో చేరడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, 24 గంటల లోపే తన మనసు మార్చుకుని తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment