తూప్రాన్: ఎన్నికల ప్రధాన అంకం ముగిసింది. ఊహించని స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది. ఒకవైపు అధికార టీఆర్‌ఎస్ పార్టీ మరోవైపు పలు పార్టీల పొత్తులతో రంగంలోకి దిగిన మహాకూటమి, కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులు తమ సత్తాచాటేందుకు సర్వశక్తులూ వడ్డారు. గెలుపెవరిదో ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఆ గెలుపోటములపై జిల్లాలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఎగ్జిట్‌పోల్, పోస్ట్‌పోల్ సర్వేలు గందరగోళంగా సృష్టిస్తున్నాయి. ఉన్న రెండు నియోజకవర్గాల్లో పోటీ ఎవరెవరి మధ్య ఉందో ఇప్పటికే తేలిపోయింది. దీంతో మా నాయకుడు గెలుస్తాడంటే మా నాయకుడే గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో ఆగక గెలుపుపై కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్‌లకు పాల్పడుతన్నారు. ఈ బెట్టింగుల్లో డబ్బు మాత్రమే కాకుండా బంగారం, బైక్‌లు, వింధులు వినోదాలు ఏర్పాటు చేస్తామని కూడా హామీలిస్తున్నారు.
ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీతో గెలుస్తారనే విషయంపై ఎక్కువగా డబ్బు చేతులు మారనుంది. మెదక్ నియోజకవర్గం నుంచి అధికార పార్టీకి చెందిన పద్మాదేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉపేందర్‌రెడ్డి ఒకరేమో ప్రభుత్వ పథకాలు గెలిపిస్తాయని, మరొకరేమో ప్రభుత్వ వైఫల్యాలు గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ప్రధానంగా గెలుపు వీరిద్దరి మధ్యే ఉందని నమ్మేవారు లక్షల్లో బెట్టింగులు పెడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా ఇరువురి మధ్య పోటీ ఉంది. ఇక్కడ కూడా పోరు రసవత్తరంగా ఉంది. పలువురు కార్యకర్తలు మా పార్టీనే గెలుస్తుందని లక్షల రూపాయలను బెట్టింగ్‌ల్లో పెడుతున్నారు.
కార్యకర్తల్లో ఉత్సాహం..
ప్రధానంగా గజ్వేల్‌లో గెలుపుపై ఆంధ్రప్రదేశ్‌లో కూడా బెట్టింగులు సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మరో వైపు రెండుసార్లు ఒటమి చవిచూసిన కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. గజ్వేల్ సీటు రాష్ట్ర స్థాయిలోనే హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఇక్కడ గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది.
దీంతో అందరి దృష్టి గజ్వేల్ వైపు ఉంది. ఫలితంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. వెయ్యి రూపాయల నుంచి లక్షల వరకు కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు బెట్టింగ్‌లు కాస్తున్నారు. కొందరు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండడం నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది. మరోవైపు లగడపాటి సర్వేతో కాంగ్రెస్‌పార్టీ నాయకుల్లో అధికారం తమదే అంటూ వారు కూడా ఊపుమీద ఉన్నారు. కొందరు పందెం ఓడితె తన వద్ద ఉన్న బంగారం, వాహనాలను బెట్టింగ్ కాస్తున్నారు. మరికొందరు విహారయాత్రలకు తీసుకెళ్తామని, మరికొందరు విందు, వినోదాలను ఏర్పాటు చేస్తామని ఒకరికొకరు హామీలు ఇచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment