సాక్షి, మెదక్: పల్లెపోరుకు రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల హడావుడి పూర్తి కాకముందే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. దీంతో పార్టీలు మరోమారు స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాయి. పంచాయతీ రిజర్వేషన్ల కోటా తేలటంతో గ్రామాల రిజర్వేషన్లపై దృష్టి సారించాయి. పంచాయతీల వారీగా రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే ఎన్నికల రంగంలోకి దిగేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. రిజర్వేషన్‌లకు అనుగుణంగా పంచాయతీల్లో గెలుపు గుర్రాలను వెతికే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి.అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఊపులో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ పంచాయతీ సీట్లను వంద శాతం కైవసం చేసుకోవటంపై దృష్టి సారించింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 469 పంచాయతీల్లో 236 పంచాయతీలు మహిళలకు, 233 పంచాయతీలను అన్‌రిజర్వుడ్‌గా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు. ఎస్టీలకు 80, ఎస్సీలకు 66, బీసీలకు 120 పంచాయతీలను రిజర్వు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మండలాల యూనిట్‌గా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈనెలాఖరున పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీల్లో పట్టు ఉన్న తమ పార్టీ నేతలను లేదా వారి సతీమణులను ఎన్నికల బరిలో దించేందుకు పార్టీలు సిద్ధం అవుతున్నారు.
టీఆర్‌ఎస్‌లో జోరు...
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని రెండు స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ పంచాయతీ ఎన్నికల్లోనూ తమ పార్టీ జోరు కొనసాగించటంపై దృష్టి పెట్టింది. అన్ని పంచాయతీల్లో తమ పార్టీ జెండా ఎగురవేసేందుకు ప్రణాళికను రచిస్తోంది. ఇందుకోసం టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ, మండలస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మండలాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభమైనందున గల్లంతైన ఓటర్లను ఓటర్లుగా చేర్పించాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీని అంటిపెట్టుకుని ఉంటూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడిన నాయకులకు సర్పంచ్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పల్లెపోరుపై ‘హస్తం’ నజర్
పంచాయతీ ఎన్నికలపై హస్తం పార్టీ కూడా దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో పైచేయి సాధించాలని చూస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగుల వేస్తోంది. మాజీ మంత్రి సునీతారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలోని పంచాయతీల్లో పార్టీ గెలుపుపై దృష్టి పెట్టారు. మెదక్‌లో సైతం కాంగ్రెస్ నాయకులు పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. త్వరలో మండలాల వారీగా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 29న మెదక్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలోనే సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా గెలుపు గుర్రాలను బరిలోకి దించుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ, టీడీపీ, సీపీఎం తదితర పార్టీ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment