సాక్షి, మెదక్: టీఆర్‌ఎస్ కార్యకర్తలను ఉద్యమకారులుగా అభివర్ణిస్తూ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో కార్యకర్తలు కీలకపాత్ర పోషించారని, దేశంలో ఎక్కడా జరగని విధంగా 48 గంటల రైల్ రోకో కార్యక్రమం చేపట్టిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో మెదక్ జైలులో మూడు రోజులు గడిపిన విషయాన్ని మంత్రి స్మరించుకున్నారు. తొలి అమరవీరుల స్థూపాన్ని చిన్న శంకరంపేటలో ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నామన్నారు. మెదక్‌లో ఆదివారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
కార్యకర్తలు అభివృద్ధి విషయంలో పోటీ పడినట్లు, సభ్యత్వ నమోదు విషయంలోనూ పోటీపడాలని సూచించారు. టీఆర్ఎస్ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా తీసుకుంటున్నారని, ప్రజల్లో తమ పార్టీకి ఉన్న విశ్వసనీయతకు ఇదే నిదర్శనమన్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కాబట్టే ప్రజలకు తమ పార్టీపై నమ్మకం ఏర్పడిందన్నారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు ఏమి చేశాయని ఆయన నిలదీశారు. జాతీయ పార్టీల్లో పని చేసే నాయకులకు ఢిల్లీలో గులాం గిరి చేయడమే సరిపోతుందన్నారు. కాంగ్రెస్ నేతలు కుర్చీల కోసమే రైతు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే తిన్నది అరగక చేసుకుంటున్నారన్నది కాంగ్రెస్ నాయకులు కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు బంధు, ఉచిత కరెంట్ , రైతు భీమా లాంటి సంక్షేమ పథకాల ఊసే లేదన్నారు. టీఆర్ఎస్ పథకాల గురించి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి చెప్పాలని, ఆప్పుడైనా కాంగ్రెస్ బాగుపడుతుందన్నారు. రైతులు దరఖాస్తు పెట్టకుండానే ఎకరాకు రూ 10 వేలు ఇస్తున్న ఏకైక పార్టీ తమదేనన్నారు. తమ పాలనలో పాలమూరులో వలసలు తగ్గిపోయాయన్నారు. ఘనపురం కాల్వలు బాగుపడ్డాయంటే టీఆర్ఎస్ పార్టీ పుణ్యమేనన్నారు. మంజీర, హల్దీ మీద చెక్ డ్యామ్‌లు కట్టిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment