సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సం‘గ్రామం’లో కీలక క్రతువు ముగిసింది. పంచాయతీల రిజర్వేషన్లకు జిల్లా యంత్రాంగం తుదిరూపునిచ్చింది. వివిధ కేటగిరీల కింద రాష్ట్ర సర్కారు జిల్లాకు నిర్దేశించిన కోటాను మండలాల వారీగా కేటాయించింది. ఈ జాబితాలను బుధవారం ఆర్డీఓలకు పంపిన కలెక్టర్ లోకేశ్‌కుమార్.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించారు. ఎల్లుండి (29వ తేదీ)లోపు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
దీంతో ఆగమేఘాల మీద గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ఖరారును అధికారయంత్రాంగం చేపట్టింది. మండలాలవారీగా పంచాయతీల రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఏ గ్రామం ఎవరికి కేటాయించారనే ఉత్కంఠకు నేడో, రేపో తెరపడనుంది. మరోవైపు జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల పరిధిలోని 5,020 వార్డుల రిజర్వేషన్లపై ఎంపీడీఓ, ఈవోపీఆర్‌డీలు కసరత్తు మొదలు పెట్టారు. ఇదిలావుండగా, ప్రతి కేటగిరీలోనూ మహిళలకు సగం సీట్లను రిజర్వ్ చేశారు. కాగా, జనరల్ కేటగిరీలో మాత్రం ఒక మండలంలో ఏడు స్థానాలుంటే అందులో నాలుగింటిని మహిళలకు, మూడు పురుషులకు ఖరారు చేశారు. మొత్తం సర్పంచ్ పదవుల్లో 50శాతం అన్‌రిజర్వ్ చేశారు. వీటిలో ఎవరైనా పోటీచేసే వెసులుబాటు ఉంటుంది.
పల్లెల్లో రాజకీయ వేడి
గ్రామపంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుండడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్ల అమలులోప్రభుత్వం సమూల మార్పులు చేసింది. రొటేషన్ విధానానికి స్వస్తి పలికిన సర్కారు.. రెండు పర్యాయాలు ఒకే కేటగిరీ కింద పంచాయతీలను రిజర్వ్ చేస్తోంది. పదేళ్ల వరకు ఇదే రిజర్వేషన్ కొనసాగనుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment