సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఎంబీబీఎస్ సీట్లను పెంచడంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పక్షపాత ధోరణిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణకు ఎంసీఐ తీవ్ర అన్యాయం చేసిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నిబంధనలను అతిక్రమించి అత్యధికంగా ఎంబీబీఎస్ సీట్లు పెంచిన ఎంసీఐ, తెలంగాణకు మాత్రం నిబంధనల మేరకు కాకుండా తక్కువ పెంచి ఇవ్వడంపై మండిపడుతున్నాయి. ఇంత పక్షపాత ధోరణి చూపడం పట్ల కేంద్రానికి తమ నిరసన తెలపాలని భావిస్తున్నట్లు సమాచారం.
190 సీట్లకే పరిమితం...
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2019ృ20 నుంచి అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఎంసీఐ సీట్ల పెంపుపై ప్రతిపాదనలు కోరింది. పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలంటే, ప్రస్తుతమున్న రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా 25 శాతం సీట్లు పెంచాల్సి ఉంటుందని ఎంసీఐ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రతిపాదనలను తెలంగాణ వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) ఎంసీఐకి ప్రతిపాదనలు పంపించారు. కానీ కొన్ని కాలేజీలకు 25 శాతం సీట్లకు బదులు కేవలం 20 శాతమే పెంచి ఎంసీఐ చేతులు దులిపేసుకుంది. గాంధీ మెడికల్ కాలేజీ, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ, నిజామాబాద్, సిద్ధిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం 900 ఎంబీబీఎస్ సీట్లున్నాయి.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 25 శాతం చొప్పున వాటిల్లో 225 ఎంబీబీఎస్ సీట్లను ఎంసీఐ అదనంగా పెంచాల్సి ఉంది. కానీ కేవలం 190 సీట్లు మాత్రమే పెంచింది. ఏకంగా 35 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ నష్టపోయింది. ఉదాహరణకు మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 150 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఆ ప్రకారం 38 సీట్లు పెంచాల్సి ఉండగా, కేవలం 25 సీట్లనే పెంచారు. ఆ ఒక్క కాలేజీనే 13 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయింది. అలాగే సిద్దిపేటలోనూ ప్రస్తుతం 150 సీట్లుంటే, కేవలం 25 సీట్లే పెంచారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 100 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఆ ప్రకారం అదనంగా 25 సీట్లు పెరగాల్సి ఉండగా, కేవలం 20 సీట్లే పెంచారు. అలాగే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లోనూ 100 సీట్లు ప్రస్తుతముంటే, 20 సీట్లే పెంచారు. ఇక సూర్యాపేట, నల్లగొండ మెడికల్ కాలేజీలు ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్నందున వాటికి పెంచలేదు. ఈఎస్‌ఐ కాలేజీకి కూడా సీట్ల పెంపు జరగలేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ కనబరచడంపై విమర్శలు వస్తున్నాయి.
మహారాష్ట్రకు 50 శాతం వరకు పెంపు...
మహారాష్ట్రలోని అనేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 25 శాతానికి బదులు ఏకంగా 50 శాతం వరకు సీట్లు పెంచడంలో ఆంతర్యమేంటో అంతుబట్టడంలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉదాహరణకు నాందేడ్‌లోని డాక్టర్ శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 100 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇప్పుడు ఆ కాలేజీకి అదనంగా మరో 50 సీట్లు పెంచారు. అంటే ఏకంగా 50 శాతం పెంచారు. అలాగే జలగాంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 100 ఎంబీబీఎస్ సీట్లుంటే, దానికి కూడా మరో 50 సీట్లు పెంచారు. మొత్తం ఆ రాష్ట్రంలో 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుంటే ఆరు కాలేజీల్లో 100 సీట్ల చొప్పున ప్రస్తుతమున్నాయి. వాటన్నింటికీ 50 సీట్ల చొప్పున పెంచారు. అంతేకాదు ఎనిమిది కాలేజీలకు ప్రస్తుతం 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటికి 38 సీట్ల చొప్పున పెంచాల్సి ఉండగా, వాటికి కూడా 50 సీట్ల చొప్పున పెంచేశారు. ముంబైలోని సేథ్ జీఎస్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 180 ఎంబీబీఎస్ సీట్లుంటే, 25 శాతం చొప్పున ఆ కాలేజీకి 45 సీట్లు పెంచాలి. కానీ ఏకంగా 70 సీట్లు పెంచారు.
ఇలాగైతే రిజర్వేషన్ల అమలు ఎలా?
పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాలంటే, ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా 25 శాతం సీట్లు పెంచాల్సి ఉంటుంది. అప్పుడే ప్రస్తుతమున్న సీట్లకు రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బంది రాదు. పైగా రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినదు. ఇది శాస్త్రీయమైన నిబంధన. కానీ 25 శాతం సీట్లు కాకుండా 20 శాతమే పెంచితే అనేక చట్టపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో విద్యార్థులు కోర్టుకు వెళ్లే ప్రమాదమూ ఉందని అంటున్నారు. ఇక మహారాష్ట్రలో 25 శాతానికి బదులు 50 శాతం వరకు పెంచడం వల్ల కూడా రిజర్వేషన్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయని అంటున్నారు. దీనిపైనా ఇతర వర్గాల ప్రజలు కూడా కోర్టుకు వెళ్లే ప్రమాదముందని అంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల పెంపులో ఎంసీఐ నిర్వాకంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment