సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024–25 వైద్య విద్యా సంవత్సరంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్‌అర్బన్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈ కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అంటే కొత్తగా 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను ఇప్పటికే 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ ఎనిమిది కూడా అందుబాటులోకి వస్తే.. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకున్నట్టు అవుతుంది. వీటితో కలిపి రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరుతుంది. అంతేకాదు.. దేశంలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పనుంది.
భారీగా పెరిగిన వైద్య సీట్లు
తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వైద్య కళాశాలలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు గణనీయంగా పెరిగాయి. 2014లో ప్రభుత్వ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. ఈ ఏడాది నాటికి 3,790కి పెరిగాయి. కొత్తగా రానున్న 8 మెడికల్ కాలేజీల్లో మరో 800 మెడికల్ సీట్లు ఉంటాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,590 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి చూస్తే.. 2014కు ముందు రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ ఏడాది ఆ సంఖ్య 56కు చేరుకుంది.
ఇదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,850 నుంచి 8,340కు చేరింది. కొత్త మెడికల్ కాలేజీల సీట్లనూ కలిపితే 9,140 సీట్లకు చేరుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు మెడికల్ కాలేజీల ద్వారా మరికొన్ని సీట్లు రానున్నాయి. అంటే తెలంగాణలో మొత్తంగా 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండగా.. సగటున 7.5 పీజీ సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 2023–24లో దేశవ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన 2,118 మెడికల్ సీట్లలో ఒక్క తెలంగాణలోనివే 900 (43 శాతం) కావడం గమనార్హం.
‘జిల్లాకో మెడికల్ కాలేజీ’ ఇలా..
► 2014కు ముందు రాష్ట్రంలో గాంధీ (1954), ఉస్మానియా (1946), కాకతీయ (1959), రిమ్స్ ఆదిలాబాద్, నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఉన్నాయి.
► 2016–17లో మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో, 2018–19లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కాలేజీలు ఏర్పాటయ్యాయి.
► గత ఏడాది (2022–23)లో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేశారు.
► ఈ ఏడాది (2023–24) కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి.
► వచ్చే ఏడాది (2024–25)లో జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, అనతి కాలంలోనే మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యను, పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేశారు. కొత్త మెడికల్ కాలేజీలు, లోకల్ రిజర్వేషన్ వల్ల డాక్టర్ కావాలనుకునే తెలంగాణ విద్యార్థులకు అపార అవకాశాలు అందుతున్నాయి. విద్యార్థులు వీటిని సది్వనియోగం చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరిస్తుందనే నినాదానికి ఇదో నిదర్శనం.
– హరీశ్‌రావు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి
మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు..
Published Thu, Jul 6 2023 4:25 AM | Last Updated on Thu, Jul 6 2023 10:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment